Friday, December 23, 2022

వాటి కోసం మనం నిరంతరం ప్రయత్నించాలి.

 ప్రయత్నపూర్వకంగా యోగాన్ని అభ్యసించే వాడు, తన పాపాలను పోగొట్టుకుంటాడు. పరిశుద్దుడు అవుతాడు. తన పూర్వజన్మలలో చేసిన యోగాభ్యాసము వలన కలిగిన సంస్కారాలతో అతడి యోగం సిద్ధిస్తుంది. దాని ఫలితంగా ఉత్తమ గతులను పొందుతాడు.

తన పూర్వజన్మలలో పట్టుదలతో, ప్రయత్నపూర్వకంగా యోగాన్ని అభ్యసించి, సిద్ధిపొందకుండానే దేహాన్ని విడిచిపెట్టిన యోగి, మరుజన్మలో సకల పాపాలనుండి విముక్తి పొంది, పరిశుద్ధమనస్కుడై, శుద్ధసత్వగుణ సంపన్నుడై, నిరంతర అభ్యాసంతో యోగసిద్ధిని పొందుతాడు. తరువాత మోక్షాన్ని పొందుతాడు.

కాబట్టి యోగ సిద్ధిని పొందడానికి మూడు ముఖ్యలక్షణములు కలిగి ఉండాలి. 

1. ప్రయత్నము, పట్టుదల. 
2. అనేక జన్మలలో చేసిన అభ్యాసము. 
3. చేసిన పాపములు పోగొట్టుకోవడం, కొత్త పాపాలు చేయకపోవడం.. 

కాబట్టి ఏకార్యం తలపెట్టినా దానికి పట్టుదల, ధృఢ సంకల్పం, అత్యవసరం. ఈ రెండు ఉంటే సాధారణమైన పనులే కాదు ఆధ్యాత్మిక కార్యాలు కూడా చక్కగా సిద్ధిస్తాయి. పట్టుదల, ప్రయత్నం లేని వాడు ఏ ఏకార్యం చేయలేడు. ఈ పట్టుదల ప్రయత్నము పూర్వ జన్మలలో చేసిన అభ్యాసం వలన కలుగుతుంది. మోక్షము పొందాలనే కోరిక, దాని మీద ఇష్టము కలుగుతాయి. అటువంటి యోగి మరుజన్మలో తన ప్రమేయం ఏమీ లేకుండానే ఆధ్యాత్మికతవైపుకు మళ్లుతాడు. నేరుగా యోగాభ్యాసము చేస్తాడు.

ఇదంతా విన్న తరువాత, మోక్షం కావాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలో అని సందేహం రావచ్చు. పట్టుదల, ప్రయత్నము, అభ్యాసము ఇవి చక్కగా ఉంటే ఒకటి రెండు జన్మలలోనే మోక్షస్థితిని పొందవచ్చు. దీని కన్నా ముందు ఇంతవరకు మనం తెలిసో తెలియకో చేసిన పాపాలను పోగొట్టుకోవాలి. ఇది ధ్యానము, నిష్కామకర్మలు, భక్తి వీటి వలన సాధ్యం అవుతుంది. అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది. ధ్యానం కుదురుతుంది. ఇదంతా చేస్తే వచ్చే ఫలితము "పరాంగతిమ్" అని అన్నాడు పరమాత్మ అంటే పరమగతి. అంటే తిరిగి రాని స్థితి పునర్జన్మ లేని స్థితి. జీవాత్మ పరమాత్మలో కలిసే స్థితి. బ్రహ్మానుభూతి. ఇవి అన్నీ పరమగతులే. వాటి కోసం మనం నిరంతరం ప్రయత్నించాలి.

Follow 🔸 @bhagavadgithaa 

             🙏 జై శ్రీ కృష్ణ 🙏

No comments:

Post a Comment