Thursday, December 29, 2022

పరిపూర్ణ విశ్వాసం

 X. X2.  1-5.  281222-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *పరిపూర్ణ విశ్వాసం*
                 ➖➖➖✍️

*మూగజీవాలు తమ పట్ల కారుణ్యం చూపే మనుషులపై విశ్వాసం చూపిస్తాయి.* 

*యజమాని పట్ల కుక్క చూపించే విశ్వాసం జగద్విదితం. జంతువులు మరో జంతువుపై విశ్వాసం చూపలేవు. అవిశ్వాసం కలిగి ఉండవు. జాతిధర్మంతో కలివిడిగా ఉంటాయవి.*

*మానవుడు మాత్రమే తనదైన ప్రవర్తనతో సమాజ విశ్వాసం పొందగలడు.*

*మనిషిగా విశ్వసనీయత కొరవడినప్పుడు ఏకాకిగా మిగిలిపోతాడు.*

 *మనిషికి ముందు తన మీద తనకు నమ్మకం ఉండాలి.*

*సమాజానికి తనపట్ల సానుకూల దృక్పథం ఏర్పడాలంటే, ధర్మవర్తనతో మెలగాలి.*

*మంచికి సన్నిహితంగా, చెడుకు దూరంగా నడుచుకోవాలి. సదా సత్యాన్నే పలకాలి.*

*పదిమందిలో ఉన్నా, ఒంటరిగా కాలం గడుపుతున్నా ఒకే విధమైన వ్యక్తిత్వం కనబరచాలి.*

*స్వార్థాన్ని విడనాడి, స్వలాభాపేక్షను దూరం చేసుకోవాలి. అందరి మనసులను గెలుచుకుని, మన్ననలు పొందిన వాళ్లను అజాత శత్రువు అంటాం.*

*అటువంటి వారికీ కోపతాపాలు ఉంటాయి.*

*వారు అవసరార్థం కోపాన్ని ఎక్కడ ఎంత మోతాదులో అవసరమో అక్కడ అంతే ప్రదర్శిస్తారు. మనసులో పేరబెట్టుకోరు. సమయం వచ్చినప్పుడు అవతలి వాళ్ల మీద విషం చిమ్మరు.*

*ఉత్తముల మాటలు, చేతలు   సదా అమృతాన్ని పంచుతాయి. అటువంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన మనిషికి సంఘం బాసటగా నిలుస్తుంది. అభివృద్ధికి బాటలు పరుస్తుంది.*

*మనపట్ల ఒకరు విశ్వాసం ఏర్పరచుకున్నాక దాన్ని కాపాడుకోవడానికి మనమేమీ శ్రమించనక్కర్లేదు. మన వ్యక్తిత్వమే మనకా గుర్తింపు తెచ్చిందన్నది మరచిపోకూడదు.*

*అదే పునాది- మనిషికి కుంగిపోని, కుప్పకూలని బలాన్నిస్తుంది. కొంతమంది తాము నమ్మిన దానిపట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు. అననుకూల పరిస్థితులు ఎదురైనా తొణకరు, బెణకరు, చెక్కుచెదరరు. అనుచరగణం విశ్వాసం పొందగలిగితేనే సాధారణ వ్యక్తి నాయకుడిగా రాణిస్తాడు.*

*ఉద్యమాలు విజయవంతం కావడానికి నాయకులు తాము నమ్మిన సిద్ధాంతాలపై సంపూర్ణ విశ్వాసం, అనుకున్నది సాధించే దీక్షాదక్షతలు కలిగి ఉండటమే కారణం.*

*మానవుడికి తాను నమ్మిన విషయం పట్ల విశ్వాసం ఉంటేనే నీటిపైన, నిప్పులోనూ నడవగలడు. ఆకాశంలో విహరించగలడు. శాస్త్రజ్ఞుడు ప్రయోగశాలలో ఎన్నిసార్లు అపజయం ఎదుర్కొన్నా సంబంధిత విషయం మీద తనకున్న పట్టుతో, మనసులో అంకురించిన ఊహకు రూపమిచ్చేదాకా విశ్రమించడు. మేధ ఆవిష్కరణను సమాజానికి అంకితం ఇచ్చి, ప్రపంచం రూపు రేఖలు మారుస్తాడు.*

*సృష్టికర్త ఒకడున్నాడని, అతడే దేవుడని నమ్మే వాళ్లకు భగవంతుడు వెన్నంటి ఉంటాడని భక్తాగ్రేసరుల ఆధ్యాత్మిక చరిత్ర చాటుతుంది.*

*వైద్యం కంటే ముందు రోగికి తనపై గురి కుదిరేలా చూసుకుంటాడు వైద్యుడు. పనితనంపై ఉన్న నమ్మకమే మనకు చేతినిండా పని కల్పిస్తుంది.*

*అనుసరించే దైవానికి, ప్రదర్శించే భక్తికి, చేసే పూజకు, అవలంబించే దానధర్మాలకు ఫలితం కంటికి కనిపించక పోయినా- పుణ్యం రూపంలో ఎక్కడో జమ అవుతుందన్న విశ్వాసమే మనుషులను మహానుభావులను చేస్తుంది. సమాజంలోని మన తోటివారి గురించి ఆలోచించేలా చేస్తుంది. వితరణ గుణం పెంపొందేలా చేస్తుంది.*

*జీవితం చాలా చిన్నదన్నది వాస్తవం.
ఆ పరిధిలోనే విశ్వాసంతో ఆకాశానికి ఎగిరేవారు కొందరు, అఖండజ్యోతిలా ఖ్యాతినార్జించేవారు మరికొందరు.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment