Thursday, December 29, 2022

🪔🪔అంతర్యామి🪔🪔

 🪔🪔అంతర్యామి🪔🪔

🌹'ఇరుసున కందెన పెట్టక పరమేశుడి బండియైన పారదు సుమతీ' అంటాడు శతకకారుడు. బతుకు బండికి నటన కందెన లాంటిది. అది లేకపోతే చిరుబురులు, చీకాకులు, చీత్కారాలు తప్పవు.
కుటుంబ పోషణార్ధం, జీవితాన్ని సాఫీగా సాగించుకునేందుకు నటన కొంతవరకు అవసరమే. బతుకుతెరువు కోసం అదే నాటకాలు హానికరం కాదు. అంతమాత్రాన నటనే జీవితం కాకూడదు. నేడు మనిషి బతుకే నాటకం, ఎందరో నటనతో ఇతరులను వంచించడంతో పాటు ఆత్మవంచన చేసుకొంటూ బతుకుతున్నారు..

🌹 భగవంతుడి ఎదుటా నటనే. హృదయధామంలో నెలకొన్న సర్వాంతర్యామికి తెలియదా మనసులోని కల్మషం, స్వార్ధం? 'నానాటి బతుకు నాటకము' అనే సంకీర్తనలో- పుట్టడం పోవడం నిజం, జనన మరణాల మధ్య జరిగేదంతా నాటకం అంటారు.
అన్నమాచార్యులవారు.

🌹నటులు రంగస్థలం మీద ఉన్నంతసేపు మాత్రమే రాజు, మంత్రి, సేవకుడు. మరల తెరవెనక్కి వెళ్ళగానే తమ వేషాలు, భావావేశాలు వదిలి కేవలం పాత్రధారులుగా ఉంటారు. మనుషులు ఆ పరమేశ్వరుడి జగన్నాటకంలో పాత్రధారులం అనే విషయాన్ని విస్మరిస్తున్నారు.

🌹కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం, రెప్పపాటు జీవితం అన్నాడో కవి. తనకు ముందు పుట్టినవారు, తనతో నడిచేవారు కాలగర్భంలో మౌనంగా కలిసిపోవడం చూసి కూడా అనుక్షణం అరిషడ్వర్గాలను ప్రదర్శి స్తుంటారు. తాము ఆనందపడక ఇతరులను ఆనంద పడనీయక అర్ధం లేని జీవితం గడిపి చివరకు శాశ్వత నిశ్శబ్దంలోకి నిష్క్రమిస్తారు. కారణం తానే అన్నింటికీ కర్తనని, తనతోనే లోకమని, తాను లేకపోతే ప్రపంచమే లేదని భావిస్తుంటారు.

🌹కేవలం అజ్ఞాని మాత్రమే నేను చేస్తున్నానని అహంకరిస్తాడు. ఫలితంగా కర్మబద్ధుడు అవుతు న్నాడు. ఆత్మజ్ఞానం గలవాడు నేను నిమిత్త మాత్రుణ్ని అనే భావనతో తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తాడు.
🌹ప్రపంచంలో ప్రతి జీవికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. సర్వేశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రతిభను ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన సామర్థ్యాన్ని అహంకారంతో కాక ప్రసాదంగా స్వీకరించి లోకోపకారానికి వినియోగించి మానవజన్మకు ధన్యత చేకూర్చుకోవాలి.

🌹ధర్మసంస్థాపనార్థం ఆ జగన్నాటక సూత్రధారి కూడా పాత్రధారిగా ప్రపంచ నాటకరంగంపై ప్రవేశిస్తాడు. ప్రకృతి నియమాలకు బద్ధుడై సముచిత రీతిన పాత్రను పోషించి నిష్క్రమిస్తాడు.

🌹వేదిక మీద ఉన్నంతసేపూ పాత్రోచితంగా నటించవలసిందే. కుటుంబంలో, సంఘంలో నీ విధ్యుక్త ధర్మాన్ని పూర్తి శక్తి సామర్థ్యాలతో నిర్వర్తించాలి. నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలి పెట్టాలి. ఇది నా కర్తవ్యం అని నిరాపేక్షతో వ్యవహరించాలి. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడితో 'నీవు కేవలం నిమిత్తమాత్రుడివి... నీ కర్తవ్యాన్ని నిర్వహించు' అని ఆదేశిస్తాడు.

🌹నిత్యకృత్యాల్లో మూటకట్టుకునే పాపం తరగదు, పుణ్యం తీరదు. పాపపుణ్యాలు తొలగినప్పుడే సాధించవలసిన కైవల్యం అంటారు అన్నమయ్య.

🌹కనుక, ఆ పరమేశ్వరుడి జగన్నాటకంలో కేవలం పాత్రధారులం అనే ఎరుకతో కర్మలను ఆచరించాలి. అప్పుడే ఏ కర్మకూ బద్ధుడు కారు. అన్నమయ్య చెప్పినట్లు అప్పుడే పాపపుణ్యాల ఫలితాలను దాటి కైవల్య ప్రాప్తికి అర్హులవుతారు.

✍️కస్తూరి హనుమన్నా కేంద్ర ప్రసాద్
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment