Wednesday, December 28, 2022

******అజాత శత్రుత్వం*

 *🧘‍♂️82 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*అజాత శత్రుత్వం*

శత్రువులు లేని మనిషంటూ ఉండడు. అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారు కూడా తమ జీవిత కాలాల్లో అనేక మంది శత్రువులతో పోరాడి సంహరించ వలసి వచ్చింది. జీసస్ జీవితం పొడుగూతా, శత్రువులు అతణ్ణి వెన్నాడుతూనే ఉన్నారు. చిట్టచివరకు శిలువ మీద కెక్కించారు. మహమ్మదు తన జీవిత కాలంలో ఎందరో శత్రువులతో యుద్ధాలు చేశాడు.

పరమ శాంతమూర్తి అయిన బుద్ధుడికైనా ఈ మానవ శత్రుత్వం తప్పలేదు. గౌతమ బుద్ధుడి పేరు ప్రఖ్యాతులు పెరగడం, బౌద్ధ భిక్షువులకు ప్రజలు అనేక కానుక లందించడం, పూర్వాశ్రమంలో అత్యంత ధనికుడైన ఒక అనుచరుడు బుద్ధుడు నివసించడానికి, విహరించడానికి అతి సుందరమైన ఉద్యానవనాన్ని క్రయంచేసి తన గురువుకు బహూకరించడం, ఇవన్నీ చూచిన ఇతర మత వర్గీయులు ఓర్వలేకపోయారు. ఇదే కాక బింబిసార మహారాజు తన ఆస్థాన వైద్యుడైన జీవకుణ్ణి, బుద్ధుడికి, అతడి శిష్యులకు వైద్యం చేయమని నియోగించడం, వారందరి అసూయను మరింత ప్రజ్వరిల్ల చేసింది.

 ఆ కారణం చేత బుద్ధుడి శీలం మీద బురద చల్లాలనే ఉద్దేశ్యంతో, భిన్న మతావలంబి అయిన చించ అనే సన్యాసిని చేత, బుద్దుడు పరస్త్రీ సంగమానికి పూనుకున్నాడని సభాముఖంగా అభియోగం చేయించారు. ఆవిడ వేసిన ఈ అభాండం శుద్ధ అబద్ధమని రుజువయిన తర్వాత, విధి వశాన ఆవిడ ఎన్నో కష్టాలకు గురయింది. అంతటితో ఆగకుండా గౌతముడి వ్యతిరేకులు మరో మతానికి చెందిన సుందరి అనే వనిత చేత, బుద్ధుడి పడక గదిలో తానొక రాత్రి గడిపానని పదిమంది ముందూ చెప్పించారు. ఇది ప్రజలలో ప్రచారం అయిన తర్వాత, ముందు ముందు సుందరి తాను అబద్దం చెప్పాననే విషయం బయట పెడుతుందేమోననే సంకోచంతో, ఒక తాగుబోతు ముఠా చేత ఆవిణ్ణి హత్య చేయించారు. ఇలాంటి దుష్కృత్యాలు చేయడంలో మానవ స్వభావం ఆనాటికీ ఈ నాటికీ ఒక లాగానే ఉందని గ్రహించవచ్చును.

వధించిన సుందరి శవాన్ని తీసుకెళ్ళి బుద్ధుడు నివసించే జటావన విహారం వద్ద పడేశారు. ఈ హత్య సందర్భంగా బుద్ధుడిపై చర్య గైకొనాల్సిందేనని రాజ్యా పాలకుల్ని అభ్యర్థించారు. కాని సుందరిని చంపిన తాగుబోతులు, ఓ కల్లు దుకాణంలో కూచొని చిత్తుగా తాగేసిన తర్వాత వొళ్ళు తెలియని స్థితిలో, 'సుందరి చావుకు నువ్వు కారణమంటే నువ్వు కారణమని' పోట్లాడుకుంటుండగా, రాజ భటులు వచ్చి పట్టుకు పోవడం జరిగింది.

 రాజు సమక్షంలో సుందరిని తామే చంపినట్లు అంగీకరించడమే కాక, తమని ఎవరు ఈ పనికి నియోగించారో అది కూడా బయట పెట్టేశారు. రాజు, వారికీ వీరికీ కూడా మరణదండన విధించాడు. అప్పటికీ ఊరుకోకుండా, ఆ భిన్న మతస్థులు గౌతముణ్ణి పరిమార్చడానికి శ్రీగుప్త అనే వ్యక్తి చేత బుద్ధుడి ఆహారంలో విషం పెట్టించడానికి ప్రయత్నించి విఫలులయ్యారు; కరుణామయుడైన బుద్ధుడు శ్రీగుప్తుణ్ణి క్షమించాడు.

ఈ శతాబ్ది ప్రథమార్థంలో జీవించి తరించిన అరుణాచల రమణునికైనా శత్రువులు తప్ప లేదు. 

కొత్తగా కొండ మీదికి వచ్చి కూచున్న రమణుడి వద్దకు ఎక్కువ మంది వచ్చి పోతున్నారని, తన వద్దకు వచ్చేవారు తగ్గిపోతున్నారనే స్పర్ధతో అదే కొండమీద నివసిస్తున్న మరో పాతస్వామి, రమణుణ్ణి చంపడానికి పైనుండి రాళ్లు దొర్లిస్తుండేవాడు. ఇదే విధంగా ఒకసారి అతడో పెద్ద బండరాయి కింది వైపుకు దొర్లించినప్పుడు అది దారిలో మరో పెద్ద రాయికి తగిలి రెండు ముక్కలై రమణుడు కూచున్న రెండు వైపుల నుండి దూసుకొని, కొండ కింద కొచ్చి పడ్డాయంటారు. అద్భుతాల సంగతి ఎలా ఉన్నా తనకన్నా ముందు వచ్చి కొండ మీద నివాసమేర్పరచుకున్న ఈ 'స్వామి' చేతుల్లో రమణుడు చాలాసార్లు ప్రాణాపాయం తప్పించుకున్నాడు.

ఇంకో చదువుకున్న స్వామి తాను రమణుడికి గురువుగా ప్రకటించుకొని, అరుణాచల శిఖరం పైన రమణుడి నివాసం ముందు వరండాలో బైఠాయించి, రమణుణ్ణి పలు రకాలుగా వేధించాడు. శాంత స్వభావుడైన రమణుడు ఈ బాధనంతా అలాగే ఓర్చుకున్నాడు. రమణుడి శిష్యులు మాత్రం ఈ వరండా 'గురువు' ఆగడాలు సహించలేక, చివరకు బయటకు గెంటివేశారు.

శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారికి కూడా ఇంటా బయటా శత్రువులుండేవారు. ఈయన మీద హత్యాప్రయత్నాలు జరుగుతాయేమోనని శంకించి అతడి చిన్నతనంలో,అనీబిసెంటు ఎన్నో కట్టుదిట్టాలు చేస్తూ ఉండేది. ప్రముఖ దివ్యజ్ఞానసమాజం వారు (థియానఫిస్టులు) కృష్ణమూర్తి తమ చెప్పు చేతల్లో ఉంటడం లేదనే ఆగ్రహంతో "ఈ కృష్ణమూర్తిని దుష్టశక్తులు పట్టి పీడిస్తున్నాయి” అని ఆరోపించారు. 

కానీ కృష్ణమూర్తి ఈ ఆరోపణలను వేటినీ పట్టించుకోలేదు. దేనికీ తొణికేవాడు కాదు; బెణికేవాడు కాదు. తాను చేయదలచుకున్నదేదో - అనగా తాను జీవితాన్ని దర్శించిన తీరును వివరిస్తూ ముందుకు సాగుతుండేవాడు. కృష్ణమూర్తితో కలిసి జీవిస్తూ, ఆయన వ్రాతప్రతులను మొదట్లో సమర్థవంతంగా ఎడిట్ చేసిన రాజ గోపాల్ అనే సహచరుడు, కృష్ణమూర్తి ఖ్యాతిని చూసి ఓర్వలేక అసూయ కొద్దీ అనేక వివాదాలను సృష్టించి, కోర్టు కెక్కించి ఆయన్ని వేధించాడు.

భూమి మీద పుట్టిన తర్వాత, ప్రయోజకుడైన మనిషికి శత్రువులు లేకుండా ఉండడం కల్ల వారి సామర్థ్యమే వారి యెడల పరాయి వారి మనస్సుల్లో ఈర్ష్యాసూయలు, ద్వేషమూ తద్వారా శత్రుత్వమూ జనింప చేస్తాయి. అయితే సామాన్యులమైన మనవంటి వారందరికీ పరస్పర శత్రుత్వముంటుంది.

 అనగా అవతలివాడు మన యెడల శత్రుత్వం వహించినప్పుడు, అతడి యెడల మనమదే రకమైన వైరాన్ని ప్రకటిస్తాం. కానీ మనం ప్రస్తావించుకున్న మహా పురుషుల వంటి వారికి, లోకంలో శత్రువులైతే ఉండవచ్చు కానీ, వారి యెడల వీరికి శత్రుత్వముండదు. తమ అజ్ఞానం వల్లనే వారు ఈ శత్రు భావాన్ని ప్రకటిస్తున్నారని కనుగొని మిన్నకుంటారు. తమకు కలుగనున్న అపాయం నుండి బయటపడేంత వరకూ జాగ్రత్త పడతారే కానీ, అవతల వారి చర్యలకు వీరు ఆగ్రహించేది, ఆవేశపడేదీ ఉండదు. ఇటువంటి మహాపురుషులకూ, మామూలు జనాలకూ ఇదే తేడా 

No comments:

Post a Comment