Thursday, December 29, 2022

*🧘‍♂️83 - శ్రీ రమణ మార్గము🧘‍♀️* *గురువుల బరువు*

 *🧘‍♂️83 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*

*గురువుల బరువు*

భారత దేశంలో గురువులకు ఎప్పుడూ కొదువలేదు. ప్రజల అవసరాలను బట్టే గురువులు ప్రభవిస్తూ ఉంటారు. ఆయా కాలాల్లో మనుషుల వాంఛలను అనుసరించి - "వాటిని తీర్చడానికే మేమున్నాము” అంటూ వినియోగదారుని “డిమాండ్”ను బట్టి ఉత్పత్తిదారుడు వస్తువును రూపొందించినట్లు, గురువులు ఆయా శిష్యవర్గానికి కావలసినదేదో అందజేయడానికే ఉన్నారు. పూర్వకాలంలో మనుషులు ఆశించిన ధన రాసులకై, కామించిన వనితా రత్నాలకై తాపత్రయపడితే, అందుకు తగినట్లుగా లక్ష్మీ స్తోత్రాలు, వశీకరణ మంత్రాలు నేర్పుతుండేవారు. నేటి కాలంలో పిల్లవాడికి ఇంజనీరింగ్లో సీటు, అమెరికాలో ఉద్యోగం, తన “టెండర్”నే ప్రభుత్వం అంగీకరించి ఆ కాంట్రాక్టు తనకే ఇప్పించడం వంటి కోర్కెలే ముఖ్యమనిపిస్తున్నాయి. కాబట్టి, గురువులు అలాంటి కోర్కెలు తీర్చడానికే పోటీ పడుతున్నారు. ఇందులో కూడా ఎవరి స్పెషలైజేషన్ వారిది. కొందరు గురువులు  ప్రముఖుల లాభాలను వృద్ధి చేస్తుంటారు. కొందరు గురువులు తమను ఆశ్రయించిన రాజకీయ నాయకులను ఎన్నికలలోనూ, నాయకత్వ పోటీలో ప్రత్యర్థుల మీదనూ గెలిపిస్తుంటారు.

 ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలలోని ఉద్యోగులకు ప్రమోషన్లు ఇప్పించే గురువులు వేరు. ఈ ప్రయోజన సిద్ధి యావత్తూ అలౌకిక శక్తితోనే జరగాల్సిన పనిలేదు.

కంపెనీలోని అధిపతి, కిందిస్థాయి ఉద్యోగి తమ వద్ద శిష్యులైతే, చిన్నవాణ్ణి సిఫార్సుతో పైకి లేవదీస్తుంటాడు. ఇవేవీ దక్కని శిష్యులు తమ కర్మను నిందించుకుంటారే గానీ గురుశక్తిని మాత్రం శంకించరు. శిష్యుల మెదళ్ళను గురువు, అతడి ప్రధాన అనుచరులు, అంతకు మునుపే ఆ విధంగా 'కండీషన్' చేసి ఉంటారు.

సద్గురువు పాలిటబడితే పులి నోట పడ్డట్టేనంటారు. అర్థమేమిటంటే, పులివాత పడిన మనిషికి, నాగుబాము కాటుకు గురైన మనిషికి చావెట్లా తథ్యమో, సద్గురువును చేరిన మనిషికి అహంకార నాశనం అంత ఖచ్చితంగానూ జరుగుతుందనీ, తద్వారా తరిస్తాడని. కానీ ఈ ఆధునిక కుహనా గురువుల వలలో పడిన మనిషికి ఏ రకమైన విముక్తి లభించదు. మానవునికి ఉండాల్సిన ప్రశ్నించే గుణం మాత్రం నశించి, దాని స్థానే వెర్రి నమ్మకం ఏర్పడుతుంది. జిజ్ఞాసా పూర్వకంగా కనుగొనే శక్తి క్షీణించి, అంధ విశ్వాసంతో బ్రతకడం ఆరంభమవుతుంది. గురువుకై తన ధన మాన ప్రాణాలైనా అర్పించాల్సి ఉంటుందని, గురువూ, అతడి అనుచర గణమూ నిత్యమూ బోధిస్తుంటారు. శిష్యవర్గమంతా ఒకరకమైన సమ్మోహనా శక్తిచేత కట్టివేయబడి, మర మనుష్యుల్లాగా తిరుగుతుంటారు. కదిలిస్తే గురు నామాన్ని 
ఉచ్ఛరిస్తూ కేకలు పెడుతుంటారు. 
కంటి ఎదుట మానభంగాలు, మర్డర్లూ, మరే అకృత్యాలు జరిగినా, ఏమీ జరగనట్లే చరిస్తుంటారు.

ఈనాడు ఈ కలుషిత వాతావరణం మరీ విస్తరిల్లుతున్నది. కానీ ఇంతకు ముందూ ఇలాంటి కుహనా గురువులు లేరనుకోనక్కరలేదు; అప్పుడూ ఉండేవారు. ఐదారు దశాబ్దాల క్రితమే అరుణాచల రమణుణ్ణి ఎవరో ఒక వ్యక్తి “పలు మార్గాలు సూచించే అనేక గురువులున్నారు. గురువుగా ఎవర్ని స్వీకరించాలంటారు?” అని ఆ మహాపురుషుణ్ణి అడిగాడు. ఈనాటి గురువులలాగా తన ప్రచారం చేసుకునే స్థితికి ఎప్పుడూ దిగజారని రమణుడు ప్రశాంతంగా - "నీకు ఎవరి వద్దనైతే మనశ్శాంతి లభిస్తుందో అతణ్ణి ఎంచుకో' అని ముక్తసరిగా సమాధానం చెప్పాడు. “ఆయన బోధను కూడా పరిగణనలోకి తీసుకొని ఎంచుకుంటే మంచిదంటారా?” అని మళ్ళీ ప్రశ్నించాడు. ఆ వ్యక్తి.

ఆత్మ విచారానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన శ్రీ రమణుడు, ఇప్పుడు మనకున్న అజ్ఞానాన్ని వదల్చుకోమని ప్రబోధిస్తూ ఉంటే - అది గ్రహించలేక ఏదో అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తే ఏమి చెప్తాడు?

“నిజమైన అన్వేషకుణ్ణి - “ఇది చెయ్యి. అది చెయ్యి” అని చెప్పేవాడు అసలైన గురువు కాదు. అన్వేషి అప్పటికే తన జీవితంలో పలు సాధనాలతో పలు చర్యలతో సతమతమవుతూ ఉంటాడు; అతడికి కావలసింది ప్రశాంతి, విశ్రాంతిని. అంటే అతడి నిరంతర కార్యకలాపాల నుండి విముక్తి. ఇప్పటికే అతడు ఆచరిస్తున్న అనేక కర్మలకు మరికొన్నింటిని జోడించడంలో ప్రయోజనమేమిటి? అతడి కది మరింత మోయలేని భారమవుతుంది. కానీ, అలాంటి బోధ అతడికి ఏవిధంగా ఉపకరిస్తుంది?

"భూమి మీద ఉన్నంతకాలం మనిషి పలు రకాల కార్యకలాపాలలో మునిగి తేలుతుండడం సృష్టిలో సహజంగా జరుగుతూ ఉండేదే. ఇలాంటి చర్యలన్నీ అఖండానంద వినాశ హేతువులు. సాధకుడు ఇప్పుడు చేస్తున్నవి కాక, మరిన్ని తల పెట్టమని సలహా ఇచ్చేవాడు గురువు కానేరడు. సాధకుడి పాలిటి మృత్యుదేవత. ఈ లెక్కన ఇప్పుడు గురు రూపంలో దర్శనమిస్తున్న వారు, సృష్టికర్త అయిన బ్రహ్మదేముడైనా అయి ఉండాలి. లేక మృత్యుదేవత అయిన యమధర్మరాజైనా అయి వుండాలి. ఇలాంటి గురువు సాధకుడికి విముక్తి కల్గించకపోగా, మరింత శృంఖలా బద్ధుణ్ణి చేస్తున్నాడని భావించాలి” అని ముగించాడు శ్రీరమణుడు.

గురువులను తలకెత్తుకునే ముందు వారు ఎలాంటి బరువు మోపుతున్నారో ఆలోచించుకోడం శ్రేయస్కరం అని నాకు అనిపిస్తుంది.

*🧘‍♂️గురువు ఆత్మ🧘‍♀️*

గురువు నీ వెలుపల ఉన్నాడని భ్రమిస్తున్నావు. కాదు, నీ లోపల ఉన్నాడు. వాస్తవానికి నీ ఆత్మయే నీ గురువు. ఈ యధార్థం గుర్తించి గురువును నీ లోపలనే అన్వేషించు. నీ మనస్సు బహిర్ముఖమై ఉన్నది. అందువల్ల విషయములను వెలుపల ఉన్నట్టుగా చూస్తున్నది. గురువు కూడా ఆ విషయాలలో ఒకడవుతున్నాడు. కాని, సత్యం దీనికి భిన్నం. ఆత్మయే గురువు. మనస్సును అంతర్ముఖం చేస్తే విషయాలను నీ లోపలివిగానే గుర్తిస్తావు. నీ ఆత్మయే గురువనీ, ఆయన కంటే అన్యమేమీ లేదనీ తెలుసుకోగలుగుతావు.


No comments:

Post a Comment