Thursday, December 29, 2022

 ఉన్నచోటనే ఉండండి...

దక్షిణామూర్తి సన్నిధిలో పరివేష్ఠించి ఉన్న మునుల వలె, మేము
సద్గురు సన్నిధిలో పరివేష్ఠించి ఉన్నాం...

ఏ మాటా లేక, చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాం...
ఆ నిశ్శబ్దం కాస్త మౌనంగా మారుకుంది...

మాట ఆగితే - నిశ్శబ్దం.
మనసు ఆగితే - మౌనం.

మౌనమే స్వరూపంగా కలిగిన సద్గురువులో
ఉద్దేశపూర్వకమైన  ఓ స్పందన కలిగి,  అది మనసై, ఆ మనసు మాటై, ఆ మాట దివ్యోపదేశంగా మాకు అనుగ్రహించబడుతుంది.

ఆ భాషణం మళ్లీ మమ్మల్ని మౌనంలోకి తీసుకెళుతుంది...
యెందుకంటే ఆ భాషణం మౌనంలోనుంచే వచ్చిందిగనుక.

అందుకే అది మౌనభాషణం...
వారు మాట్లాడినా మాట్లాడనట్టే...

మనకు "ఏకం" అంటే ఏంటో తెలియక, అన్యంతో వేగులాడుతూ, గందరగోళంలో ఉంటాం కనుక
మనం ఊరికే ఉన్నా కూడా మాట్లాడుతున్నట్టే...

* * *

వేరే ఊరు నుంచి ఒక జిజ్ఞాసి వచ్చాడు రాత్రి...

ఈరోజు ఉదయం కాసేపు సత్సంగంలో గడిపి, శివాలయం వెళ్లి, తిరుగుప్రయాణం కావడం...అనేది అతని ప్రోగ్రాం...

గుడికెళ్లడం అంటే, ఇది(గురుసన్నిధి) గుడి కాదనే కదా...! అన్నారు గురువుగారు...

గట్టిగా నవ్వాడు అతను...

* * *

సద్గురు: నీవనుకునే పవిత్రమైన క్షేత్రాలు, తీర్థాలు ఉండేది భూమ్మీదే...వాటిని మోసే భూమి ఇంకెంత పవిత్రమైనది! నీవుండేది కూడా ఆ భూమ్మీదనే...

కాబట్టి నీవు ఉన్నచోటనే ఉంటే పోలా...!

మీ ఇంటి కిటికీ ద్వారా చూసే ఆకాశం కంటే
మా ఇంటి కిటికీ ద్వారా చూసే ఆకాశం పవిత్రమైనది అనుకోవడం లాంటిదే...ఒక చోటును పవిత్రక్షేత్రం అనుకోవడం కూడా.

అన్ని చోట్లా ఉండేది ఆ ఒక్క "చిదా"కాశమే...
కాబట్టి ఉన్న చోటనే ఉంటే పోలా...!

గిరిప్రదక్షిణం చేసి బయలుదేరిన చోటుకే చేరుకుంటావు...

అంత సంబడానికి బయలుదేరినచోటనే ఉంటే పోలా...!

"అన్ని క్షేత్రాలలో ఉండే దేవుడు ఒక్కడే"
అంటే దాని అర్థం అన్ని క్షేత్రాలకు వెళ్లి దర్శించిన నీవే ఆ ఒక్కడు అని అర్థం.

క్షేత్రాలు, దేవతామూర్తులు...అనేకం ఉంటాయి...
చూచేవాడు(ద్రష్ట) ఒకడే కదా!

దేవుడొక్కడే అనటంలో అంతరార్థం అదే.
"ద్రష్టే దేవుడు" అని.

ప్రశ్న: దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్చేత్ ద్బ్రహ్మయమం జగత్సాదృష్టిః ......

సద్గురు: నిజమే...ఆ చదువేదో ఉన్నచోటనే ఉండి చదువుకుంటే పోలా..!

కానీ...మేమూ తిరిగి తెలుసుకుంటాం...అంటారు.
ఏం చేస్తాం? తిరగమంటాం...
తెలుసుకునే వరకు తిరగవలసిందే...తప్పదు.

* * *
ఉన్నచోటనే ఉండేవాడు - జ్ఞానయోగి.

గురువాక్యం నమ్మి ఉన్నచోటనే ఉండేవాడు - భక్తియోగి.

ప్రయత్నపూర్వకంగా శ్రమపడి తెలుసుకునేవాడు - కర్మయోగి.

* * *

సద్గురు: మాకు  తెలిసినవారొకరున్నారు...
ఆకాశానికి నమస్కారం పెట్టు అంటే, ఆరుబయటకెళ్లి, తలపైకెత్తి ఆకాశానికి నమస్కారం  పెట్టి వచ్చాడు...
ఇప్పుడు మన మధ్యన ఉండేది కూడా ఆకాశమే కదా...? ఇక్కడే నమస్కారం చేసివుండొచ్చు కదా! అంటే, అప్పుడు నాలిక్కరచుకున్నాడు...

ప్రశ్న: "ఇది కూడా గుడే అని తెలిశాక కూడా అక్కడకెళ్లాలి, ఇక్కడకెళ్లాలి...అని ఎందుకనిపిస్తుంది గురువుగారూ...?

సద్గురు: దాని పేరే "కర్మ"....

పైగా "తిరగడం"లో సదుద్దేశం ఏమీలేదు వీడికి...
వాడి(దేవుడి) సీటును తాను కొట్టేయాలన్నదే కడుపులో భావన.

(అందరూ నవ్వుకున్నారు)

***

"గతం"లోకి జారుకున్న ప్రతీవాక్కూ అది దైవవాక్కే.
ప్రతి సంఘటనా దైవేచ్ఛయే...అన్నారు గురువుగారు.

ఈరోజు దైవేచ్ఛ ఏమనేది రేపు తెలుస్తుంది.

ఈరోజు మనకు అర్థంకాని సంఘటనను 
రేపు దానిని "దైవేచ్ఛ"గా మనం అర్థం చేసుకోవాలి.
"జరిగింది" కనుక.

* * *

నేను-నాది మొత్తం నాకిచ్చేయ్...
నేను-నాది మొత్తం నీకిచ్చేస్తాను...
అన్నారు గురువుగారు.

కాసేపాగి-
నీవు "నేను-నాది" మొత్తం నాకు ఇచ్చేశాక
నేను ఇచ్చే "నేను-నాది" మొత్తాన్ని నీవు తీసుకోవడమనేదే ఉండదు.
యెందుకంటే, అసలు నీవు లేవు కదా...!   అన్నారు.

ప్రశ్న: "నేను-నాది" మొత్తాన్ని మీకు ఇచ్చివేసినందుకు గుర్తేమి?

బాబు: ఇద్దరు ఉండరు....

శిష్యుడు-గురువు, జీవుడు-దేవుడు
ఇలా ఇద్దరుండరు... 

(నా సమాధానాన్ని గురువు అంగీకార సూచకంగా చిరునవ్వుతో ఊరకున్నారు)

* * *

"నేను" అనేది తెర.

నేను ఫలానా అనే నామరూపాల వ్యవహారం, తెరపై కదలాడే దృశ్యం.

* * *

శివుడు లేకుండా శక్తి ఉండదు.

శక్తి "లేనట్లు" ఉంటాడు శివుడు.

కానీ శివుడు శక్తియుతుడే.

కళను ప్రదర్శించినప్పుడు మాత్రమే 
తాను కళాకారుడు అనే విషయం ప్రకటనమౌతుంది.

ప్రకటన అనేది లేనప్పుడు,
కళా తెలియబడదు, కళాకారుడూ తెలియబడడు. 

అలా శివుడు తన శక్తిని ప్రకటించే క్రమంలో సృష్టి ఏర్పడింది.

సృష్టే లేకుంటే....శక్తి విషయమూ తెలియదు, శివుని విషయమూ తెలియదు.

* * *

No comments:

Post a Comment