Friday, December 23, 2022

ఇదే ప్రతి మానవుని కర్తవ్యం.

 ముందు జన్మలో యోగాన్ని, భక్తిని అభ్యసించి మధ్యలో మరణించిన వారు మరుజన్మలో శుచి మంతులు, శ్రీమంతులు, జ్ఞానవంతులు, యోగులు అయిన వారి గృహములలో పుడతారు. అటువంటి జన్మపొందిన తరువాత, అతడు, కిందటి జన్మలో, తాను ఎక్కడ యోగాభ్యాసం ఆపాడో అక్కడి నుండి మొదలుపెడతాడు. ఎందుకంటే అతని వెంట అతని వాసనలు అంటే బుద్ధి, సంస్కారం అతని వెంటే వస్తాయి. అంతకు ముందు జన్మలో ధ్యానం అభ్యాసము చేసాడు కాబట్టి మరు జన్మలో కూడా అదే ధ్యానం కొనసాగిస్తాడు. జ్ఞాన సిద్ధికి, యోగం సంపూర్ణంగా సిద్ధించడానికి ప్రయత్నం చేస్తాడు. యోగుల వంశంలో జన్మించడం వలన అతని చుట్టు ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది.

కాబట్టి మనం ఈ జన్మలోనే ధ్యానయోగం అవలంబించాలి. ఎంత వరకు చేయగలమో అంతవరకు అభ్యాసము చేయాలి. ఆ అభ్యాసం మరు జన్మకు కారీఫార్వర్డు అవుతుంది. మంచిజన్మ లభిస్తుంది, ఆధ్యాత్మిక బుద్ధి పుడుతుంది. మనం ధరించినది స్థూలదేహం అయితే మనలో ఉన్న మనోబుద్ధి అహంకారాలు సూక్ష్మదేహం. మనం చేసే పాపపుణ్యాలు ఈ సూక్ష్మదేహాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి. స్థూలదేహం మరణించిన తరువాత, ఈ సూక్ష్మదేహం, ఆ జన్మలవాసనలను తనతో కూడా అంటి పెట్టుకొని వెళుతుంది. మరుజన్మలో తన అభ్యాసాన్ని కొనసాగిస్తుంది అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు.

కాబట్టి మనం మరణించిన తరువాత మనతోబాటు వచ్చేవి మనం చేసే మంచి పనులు, పుణ్యకార్యాల ఫలాలు, పాపంచేస్తే ఆ పాపఫలాలు. అంతేకానీ, మనం సంపాదించిన ధనం, ఆస్తులు, బంధుమిత్రులు మన వెంట రారు. అన్నదమ్ములు, సంతానము, బంధువులు మనం సంపాదించిన ధనం, ఆస్తి కోసం కొట్లాడుకుంటారే కానీ, మనగురించి పట్టించుకోరు. మరణించిన తరువాత, అప్పటి వరకు సంపాదించిన ధనం బాంకులో కానీ, అటక మీద బస్తాలలో కానీ మూలుగుతుంటుంది. పొలాలు, ఇళ్లస్థలాలు, ఇళ్లు ఉన్నచోటనే ఉంటాయి. బంధుమిత్రులు శ్మశానం దాకా వస్తారు. తరువాత చేయాల్సింది ఒంటరి ప్రయాణం. అప్పుడు సూక్ష్మరూపంలో అంటే వాసనల రూపంలో మన వెంట వచ్చేది మనం చేసుకున్న పుణ్యం లేక పాపం.

కాబట్టి ప్రతి వాడూ బంధువుల మీద, ఆస్తి, ధనం మీద మమకారం తగ్గించుకోవాలి. ఈ ప్రపంచమే సర్వస్వం, సుఖమయం అనే అజ్ఞానాన్ని వదిలిపెట్టి, నేను వేరు ఈ దేహం వేరు అనే భావన కలిగి ఉండాలి. ఆత్మను గురించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ధ్యానం, భగవన్నామస్మరణ, శాస్త్ర పఠనం చేయాలి. పరోపకారం చేయాలి. సమాజసేవ చేయాలి. మనం ఎంత చేస్తే అంత పుణ్యం మనకు వస్తుంది. అది మరుజన్మకు కూడా సంక్రమిస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే అంతా చేయగలమా లేదా అనే సంశయం వదిలిపెట్టి, చేయగలిగినంత చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ప్రతి మానవుని కర్తవ్యం.

follow: @bhagavadgithaa

 🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩

No comments:

Post a Comment