Tuesday, December 20, 2022

గీత గోవిందం* ========== (హాస్య కథ)

 *****
                    *గీత గోవిందం*
                    ==========
                       (హాస్య కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"ఏమే గీతా! నీ పెళ్లికి రాలేకపోయాను. మూడేళ్ల తరువాత ఇప్పుటికి రావడం కుదిరింది. సరేకానీ బావగారు, అదే మీ వారు గోవింద్ గారు ఎలాంటి వారు? ఎలా ఉంది నీ సంసార జీవితం?" స్నేహితురాల్ని అడిగింది సంగీత, ప్లేటులో పెట్టిన జంతికలను నిశబ్ధంగా నములుతూ.

"ఏం చెప్పమంటావే? మూడు మంచి స్వరాలు, ఆరు అపస్వరాలుగా సాగుతోంది" నిర్లిప్తంగా చెప్పింది గీత, జంతికలను పరపరలాడిస్తూ.

"ఏం జరిగిందే?" జంతికల పళ్లెం తన వైపు లాక్కొని అడిగింది సంగీత.

"నాకు కాపురానికి వచ్చే వరకూ తెలియదే, ఈయనకు పాటల పిచ్చి ఉందని! ఆ తర్వాతే తెలిసింది, అది పరాకాష్టకు చేరిందని. ఎలాగంటే,  ఓ సారి గోవింద్ వాళ్ళ మేనత్త కొడుకు పెళ్లికి వెళ్లాము. ఆ రోజున ఆ నూతన దంపతులను విడిదిలోకి తీసుకుని వస్తున్నారు. ఈయన ఊరుకోకుండా,  " *కొత్త పెళ్ళి కూతురా రా రా* " అంటూ సుమంగళి సినిమాలో పాట ఎత్తుకున్నారు. అంతే వెంటనే ఇరుపక్షాల పెళ్లివారూ ఏకమాటాడుకుని ఉమ్మడిగా ఈయనను చుట్టముట్టి గదిలోకి తీసుకెళ్లి కుమ్మేసారు" చెప్పింది గీత.

"అదేంటే  అది సంధర్భోచితమైన పాటే కదా? కొంపదీసి ఏదైనా అపస్వరం పాడేరా?" అమాయకంగా అడిగింది సంగీత.

"స్వరాలే కాదు, పదాలు కూడా మార్చేసారే బాబూ! " *కొత్త పెళ్ళి కూతురా రా రా, నీ కుడికాలు ముందు మోపి రారా* " అని పాడటానికి బదులు,
 
" *కొత్త పెళ్ళి కూతురా రా రా, నీ కుడికాలు ముం౼ మోపి రారా* " అక్కడ *దు* బదులు *డ* అని పరమ ఛండాలంగా పాడారు మరి, అందుకే ఆ కుమ్ముడు కార్యక్రమం!" ఆ సంఘటన తలుచుకుంటూ చెప్పింది గీత.

"రామరామ !అదేంటే? సొంత కవిత్వమా?"

"కొంత పైత్యం కూడానూ!" చెప్పింది గీత, డబ్బాలోని జంతికలు కొన్ని పళ్లెంలో వేస్తూ.

"పోనీ ఆ తర్వాత అయినా తన పద్ధతి మార్చుకున్నారా?" ఆశక్తిగా అడిగింది సంగీత.

"ఏం మార్చుకోలేదు. రెండు సంవత్సరాల క్రితం కూడా, ఇలాగే ఓ రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి ఈయన పైన ఆఫీసర్ గా కొత్తగా చేరిన ఓ అమ్మాయి వచ్చింది. ఆ కట్టుబడి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈయన ఉబ్బిపోయి,

 *మల్లెతీగకు పందిరివోలె, మసక చీకటిలో వెన్నెల వోలె, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా* " అని పాడారు. 

వెంటనే ఆ అమ్మాయి కూడా  *నా ఒంటినిండా టాటూలేగా అన్నయ్య,  ఇంక పుట్టుమచ్చకి ఖాళీ ఏదిర అన్నయ్యా!* " అని అదే బాణీలో బదులిచ్చిందే ఒళ్ళంతా టాటూలుతో ఉన్న ఆ పిల్ల" చెప్పింది  గీత.

"బాగుందే. అయితే బావగారికి ఆఫీసులో గంతకు తగ్గ బొంత దొరికిందన్నమాట" మళ్లీ జంతికలకు పనిచెపుతూ అంది సంగీత.

"భలేదానివే, అసలు కథ ఆ తర్వాతే జరిగింది. ఆ పాట పల్లవి పూర్తవ్వగానే ఆ అమ్మాయి ఉగ్రరూపం దాల్చి, 'రేపు ఆఫీసుకు రా! నీ అంతు చూస్తా' అని ఈయన మీద ఫైరైపోయింది. అఫ్ కోర్స్ ఆ తర్వాత ఆ అమ్మాయికి సర్ది చెప్పి పంపించాననుకో" 

"ఇంతకీ ఏం తప్పు పాడారే, అది చెప్పు?"

"పల్లవిలో ఆఖరి పాదంలో " *తోడబుట్టిన ఋణం తీర్చుకుంటానే చెల్లెమ్మా* " అని పాడటానికి బదులు " , *తొడగొట్టిన ఋణం తీర్చుకుంటానే చెల్లెమ్మా* " అని పాడారే" వస్తున్న నవ్వును ఆపుకుంటూ, జంతికల ప్లేట్ తన వైపు లాక్కుని చెప్పింది గీత.

"అయితే ఆ దెబ్బకు గోవింద్ బావగారు తన బాణీ మార్చేసి ఉంటారు, ఔనా?"

"కాదే తల్లీ, ఆ తర్వాత రోజుల్లో పాటలకు తన అభినయం కూడా జోడించి పాడడం మొదలెట్టారు. అది ఎలాగంటే,... కిందటేడాది అత్యవసరంగా ఓ ఐటమ్ కావాల్సి వచ్చి, ఈయనను అది తెమ్మని మా పక్కింటి పరిమళ దగ్గరకు పంపించాను. ఈయన వెళ్లి వాళ్ళ తలుపు తట్టగానే ఆమె బయటకు వచ్చి, 'గోవింద్ గారా ! ఏం కావాలి ? ఎందుకు వచ్చారు ?" అని అడిగిందిట. 

ఈయన సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ 
*ఎందుకంటే ఏమి చెప్పను? అందుకేననీ ఎలా చెప్పను* " అంటూ గాత్రం మొదలెట్టారుట. అసలే అనుమానపు పీనుగ అయిన వాళ్లాయన, ఈయన్ని రెక్క పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లి ఉతకడం మొదలెట్టబోయాట్ట. ఈలోగా ఈయన పెట్టిన చావు కూతలు వినబడి నేను అక్కడకి వెళ్లి ఏదో సర్దిచెప్పి తీసుకొచ్చేనే తల్లీ" జంతికల ప్లేట్ సంగీత వైపు జరుపుతూ చెప్పింది గీత.

"అంత సిగ్గు పడే పని ఆయనకు ఏం చెప్పావే?" అనుమానంగా అడిగింది సంగీత.

"ఏమీ లేదే ! మా చంటాడికి డైపర్లు అయిపోతే, ఆ పరిమళ వాళ్ళ పిల్లాడిది కూడా సేమ్ సైజు కదా అని, అది ఒకటి తెమ్మని పంపించా" అసలు విషయం చెప్పింది గీత.

"సరేకానీ, మరి ఆయన 'గీతా'నికి ఏదైనా 'తాళం' వేసే చర్యలు చేపట్టేవా?" ఖాళీ ప్లేటును గీత వైపు తోస్తూ అడిగింది సంగీత.

"మనం కథలలో చదివినట్లే, రివర్స్ సింగింగ్ మొదలెట్టానే. ఎలాగంటే .....ఓ రోజు వంటింట్లో పనిచేసుకుంటూ ఏదో కూనిరాగం తీసాను. వెంటనే తననే పిలుస్తున్నానేమో అనుకున్న ఈయన 

*నీవేనా నను పిలిచినది, నీవేనా నను తలచినది* " అంటూ లోపలికి వచ్చారు. చిర్రెత్తిపోయిన నేను " *నేను కాదురోయ్ నిను పిలిచినది, నేను కాదురోయ్ నిను తలచినది* " అని పాడేటప్పటికి వెంటనే మూతి, పంచె రెండూ ముడిచి పారిపోయారు" డబ్బాలోని ఆఖరి విడత జంతికలు ప్లేటులో పోస్తూ, చెప్పింది గీత.

"ఒహో బావగార్ని అలా దారిలో పెట్టేవన్నమాట. బాగుంది, తర్వాత ?" ప్లేట్ మీద దాడి చేస్తూ అడిగింది సంగీత.

"ఔనే! కానీ దారిలోకి వచ్చింది మాత్రం అప్పుడు కాదు. ఓ సారి ఆఫీసుకు బయలుదేరుతూ 
" *వస్తా వెళ్లొస్తా..* " అని పాడగానే, నేను
" *మళ్లెప్పుడొస్తా* " అనగానే, ఆయన
" *రేపు సందేళకొస్తా* " అని పాడారు. వెంటనే 
"అంటే ఈ సాయంత్రం రారా? ఎక్కడుంటారు? ఏదైనా సెకండ్ సెటప్ పెట్టారా?" అని దులిపేసాను. 

పాపం వెంటనే "ఏమీ లేదే బాబూ! ఏదో ఫ్లోలో అలా పాడేసానంతే" అంటూ కాళ్ళ బేరానికి వచ్చారు. 

"అందుకే చివరిసారిగా చెబుతున్నా! మీ పద్ధతైనా మార్చుకోండి లేదా పాడడమైనా మానుకోండి" అనేసరికి,
"అలాగేలేవే, ఈ గొడవలన్నీ ఈ పాటలవల్లే కదా! సరే ఈరోజు నుంచే మానేస్తాను" అని ఆ రోజుతో పాటలకు జనగణమణ పాడేసార్లే" ఓ రెండు జంతిక పలుకులు నోట్లో వేసుకుని చెప్పింది గీత.

"హమ్మయ్య! పోనీలేవే, రెండు కేజీల జంతికలు ఖర్చు అయితే అయ్యాయి గానీ మొత్తం మీద గోవింద్ గారి గీతాల అలవాటు మాన్పించేవన్న ఆనందాన్ని మిగిల్చావు" ఆఖరి జంతికపలుకు నోట్లో వేసుకుని చెప్పింది సంగీత.

"ఏం ఆనందమే బాబూ! ఆ రోజు నుంచి ఆ అలవాటు నాకు అంటుకుంది?" నిర్లిప్తంగా చెప్పింది గీత.

"ఔనా? ఎలా?" ఖాళీ ప్లేట్ తడుముతూ అడిగింది సంగీత.

"ఎలాగంటే, మచ్చుకు ఓ రెండు చెబుతాను.  ప్రతిరోజూ సాయంత్రం వాడుకగా పూలు తెచ్చే ఈయన  ఆరోజు తేవకపోవడంతో నేను 

" *వాడుక మరచెదవేలా......* " అని పాడేసరికి, బిత్తరపోయిన ఆయన 
"ఈరోజు బాగా లేదు నా తలరాత, హడావిడిలో మరచిపోయా గీతా" అని పాపం క్షమాపణ ధోరణిలో చెప్పారే.  

అలాగే ఇంకో రోజు ఉదయం ఆయనకు  బ్రేక్ ఫాస్ట్ కోసం వేడి వేడిగా ఓ వాయ ఇడ్లీ వేసి, ఓ అరడజను ఆయన ప్లేటులో వేసి, ఆయన కూర్చుని ఆవురావురని తింటూంటే ఎదురుగా కూర్చున్న నేను,

" *కనులు తెరచినా నీ "వాయే"
నే కనులు మూసినా నీ "వాయే*  అని చేతులు తిప్పుతూ పాడేసరికి, 

"అంటే నేను వాయలు వాయలు ఇడ్లీలు లాగించేస్తాననే కదా అలా అభినయం చేస్తూ పాడుతున్నావు" అనేసరికి "అబ్బే కాదండీ, ఎందుకో ఆ పాట జ్ఞాపకం వచ్చింది, పాడాను" అనేసరికి ఆయన,

"సరే! జరిగింది చాలు, ఇప్పటికైనా నీ పద్ధతి అయినా మార్చుకో లేకపోతే పాటలు పాడడం అయినా మానుకో" అని నా డైలాగ్ నాకే రివర్స్ లో అప్పచెప్పారే!" ఖాళీ జంతికల డబ్బా కింద పెడుతూ చెప్పింది గీత.

"సరేనే మరి జంతికలు కూడా అయిపోయినట్టున్నాయి. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే మీ గీతగోవిందం అలవాటు నాకు అంటుకునేలా ఉంది. మరి వస్తా" లేస్తూ చెప్పింది సంగీత.

" *వస్తా వట్టిది పోతా వట్టిది ఆశ...* " అంటూ పాడబోయి మధ్యలో ఆపి "నిజమేనే ఈ అలవాటు నాకు పోయి, నీకు రాకుండా ఉండాలంటే మటుకు కొన్నాళ్లపాటు నువ్వు మా ఇంటికి రాకు, నేను మీ ఇంటికి రాను " ఖరాఖండిగా చెప్పింది గీత.

" *రానని రాలేననీ ఊరకె అంటావు, రావాలని ఆశ లేనిదే…* " అని బిగ్గరగా పాడుకుంటూ అక్కడ నుంచి బయలుదేరింది, పాపం ఏమాత్రం సంగీత జ్ఞానం లేని సంగీత, సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చిన గీత బిత్తరపోయి చూస్తుండగా !!

         *****     **శుభం**     *****

(నేను రాసిన ఈ హాస్య కథ, అక్టోబర్ 2022 హాస్యానందం మాసపత్రిక లో ప్రచురితమైనది. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయగలరని ఆశిస్తూ…🙏🙏)

No comments:

Post a Comment