Vi. X. 1-3. 020123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సుఖం…
సంతోషం…
ఆనందం…
➖➖➖✍️
ఆనందం మానవుని సహజస్థితి, వాస్తవస్థితి.
కానీ, నేడు అనేకులది తమ సహజ స్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖ సంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ.
సుఖం, సంతోషం, ఆనందం....ఒకేలా చెప్పేస్తున్నా, ఇవి మూడురకాల అనుభూతులు.
పంచేంద్రియాలను సంతృప్తిపరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.
వినోదభరితమై మనస్సును ఉత్సాహపరిచే 'సంతోషానుభూతి' మానసికం.
వీటికి అతీతమైంది "ఆనందా నుభూతి" ఆత్మసంబంధితం.
ఆనందం ఆధ్యాత్మికం. బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గతఅనుభూతి.
సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరుస్వేచ్చనిస్తుంది, ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం.
శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయి కి వస్తాం.
మొదటిది బంధం, రెండవది తాత్కాలితం, మూడవది శాశ్వతం.
మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జననమరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు. కానీ పరమానందస్థితికి వచ్చినవాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు.
ఆనందంగా జీవించడానికి హంగులు అవసరం లేదు. ఆర్ధికస్థితిగతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులలోనైన సమస్థితిలో వుండగలగడం, అన్నీ - అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.
మనభావాలపట్ల, మనలో ఉన్న ఆంతర్యామిపట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటిపట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామి పట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి. ఇది అలవడిననాడు అనుక్షణం మనం ప్రార్ధనలో వున్నట్లే. ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే.
ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు.(తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి)
మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం.
మొదటికొస నుండి రెండవకొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం.
మొదటికొస నుండి రెండవకొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.
వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత.
మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత.
ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం............. పేరు ఏదైతేనేం........... అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే.
ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది.
మనలోపలేవున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి. అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని.
ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'. సత్ అంటే సత్యం, చిత్ అంటే చైతన్యం ఆనందమంటే పరమానందం. ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగలుగుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి". ఇలా ఆనందమును తెలుసుకున్నవారు (ఆనందం బ్రహ్మనో విద్వాన్) ఆత్మను స్పృశించగలరు (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే).
ఆనందమునకు సోపానములు -
ఫలాపేక్ష లేకుండా పనిచేయడం
అందరిలో అంతర్యామిని గుర్తించడం
ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం
భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం .✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment