3009. 1-3. 270123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పశ్చాత్తాపం*
➖➖➖✍️
*నగరంలోనే పేరు మోసిన అపార్ట్మెంట్ అది. ఒక్కో ఫ్లోర్ కు ఒక ట్రిపుల్ బెడ్రూం, ఇంకో డబుల్ బెడ్రూం మాత్రమే వుంటాయి. విశాలమైన పార్కింగ్ ఏరియాతో, ఖరీదైన సెంటర్ లో కట్టారు. చూడటానికి చాలా హుందాగా, రిచ్ లుక్ తో కనిపిస్తూ వుంటుంది. అందులో ట్రిపుల్ బెడ్రూం ఫ్లాటు కొనొక్కొని వుంటున్నాడు మోహనరావు. రెవెన్యూ శాఖలో పెద్ద ఉద్యోగం చేసి, రెండు చేతులా దండిగా సంపాదించి, రిటైర్ అయ్యాక తన ఫ్లాట్ ను సర్వాంగ సుందరంగా చేసుకొని భార్యతో నివాసం ఉంటున్నాడు. చీకు చింతా లేదు. పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. రిటైర్మెంట్ డబ్బులు, ఇతరత్రా డబ్బులు బ్యాంక్ ఖాతాలో మూలుగుతున్నయి. తన ఆడి కార్ కు డ్రైవర్, ఇంట్లో వంట మనిషి, ఇతర పనులకు ఒక పని మనిషి కూడా మెయింటైన్ చేస్తూ దర్జాగా భార్యతో కాలం వెళ్లదీస్తున్నాడు.*
*ఉదయం నుంచి విసుగు వస్తుంది. కోపం నషాళానికి అంటింది. ఎదురుగా వున్న డబుల్ బెడ్రూం ఫ్లాట్ లో నుండి దగ్గుతున్న శబ్ధం వినిపిస్తుంది. కొంపతీసి కోవిడెమో అని అనుమానం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలతో ఈ మధ్యనే వచ్చి వుంటున్నారు. ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. ఈ అపార్ట్మెంట్ లో ఉండగలిగే స్థాయి వాళ్ళది కాదని మోహన్ రావు చికాకు. పైగా వారం రోజుల నుండి ఎవరూ బయట కనిపించడం లేదు. ఎవరో సరుకులు గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళడం గమనించాడు. ఖచ్చితంగా కరోనా అనే నిర్దారణ చేసుకొని, ఆ ఫ్లాట్ ఓనర్ కి ఫోన్ చేసి వాళ్ళని అర్జెంట్ గా ఖాళీ చేయించమని గొడవ చేశాడు.*
*అపార్ట్మెంట్ కమిటీ మీటింగ్ సాయంత్రం పెట్టించి, వచ్చే ఒకటవ తారీఖు కల్లా ఖాళీ చేయమని ఫోన్లో చెప్పించాడు. అప్పటికి కాని ఆ మిడిల్ క్లాస్ మీద వున్న కోపం కొద్దిగా శాంతించ లేదు. హమ్మయ్య ఒకటో తారీఖు తరవాత వీళ్ళ గోల వుండదని ప్రశాంతంగా నిద్ర పోయాడు ఆరోజు.*
*చూస్తుండగానే నాలుగు రోజులు అయ్యింది. ఐదో రోజు…! రోజూ వచ్చి కనిపించే డ్రైవర్ రాలేదు. ఫోన్ చేసాడు మోహన్ రావు. మొన్న "హైదరాబాద్ వెళ్లి వచ్చాం కదండీ. వచ్చిన దగ్గర నుండి జలుబు, జ్వరంగా వున్నాయి. టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది సార్" అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు డ్రైవర్. తను కూడా డ్రైవర్ తో కలిసి హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. గతుక్కుమన్నాడు మోహన్ రావు. సాయంత్రానికి తనకి, భార్యకి జ్వరం, తలనొప్పి, వంటి నొప్పులు, దగ్గు ప్రారంభం అయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేస్తే, కరోనా టెస్ట్ కిట్ తో ఒక కుర్రాడు వచ్చి, శాంపుల్స్ తీసుకొని వెళ్ళాడు. తెల్లవారి ఉదయం డాక్టర్ ఫోన్ చేసి చెప్పాడు భార్యభర్త లిద్దరికి కరోనా పాజిటివ్ అని, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ, 15 రోజులు క్వారంటైన్ కావాలని, వాడుకోవడానికి మెడికల్ కిట్ పంపించాడు..*
*మోహన్ రావుకి ఏం చేయాలో తోచలేదు. వంట మనిషి, పని మనిషీ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే, తన కొచ్చిన కరోనా భయానికి నెల వరకూ రావడం కుదరదని తెగేసి చెప్పేశారు. వాచ్మెన్ కూడా తన ఫ్లాట్ కు రావడానికి భయపడుతున్నాడు. మిగతా ఫ్లాట్ ఓనర్స్ వెళ్లవద్దని కూడా చెప్పారట. అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు తామేమీ సహాయం చేయలేమని చెప్పేశారు. బంధువులకు కాల్ చేస్తే అందరూ రాలేమని అంటున్నారు. పిల్లలేమో ఎక్కడో అమెరికాలో వున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు మోహన్ రావుకి..!*
*నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కాలింగ్ బెల్ శబ్ధం వినిపించింది. డోర్ తీసి చూసాడు మోహన్ రావు. ఎదురుగా ఎదురింటి మిడిల్ క్లాస్ మాన్.. ‘పర్వాలేదు సర్, నన్ను లోనికి రానివ్వండి. నాకు కరోనా తగ్గిపోయి రెండు రోజులు అయ్యింది. నాకు కరోనా రెసిస్టెంట్స్ వుంది. భయం లే’దంటూ, వేడివేడి ఆహార పదార్థాల క్యారేజీ అక్కడ పెట్టి, తినే వరకు వుండి, వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేయించి, పట్టుకోవాల్సిన ఆవిరిని పట్టించి, ఖాళీ క్యారేజీని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా ఉదయం, సాయంత్రం అతనే వచ్చి, అన్ని రకాల సదుపాయాలు అమర్చి, భోజనం, మందులు అన్నీ తనే చూసుకుంటూ 15 రోజులు సహాయం చేశాడు.*
*క్వారంటైన్ కాలం అయిపోవడం వలన ఆ సాయంత్రం ఫ్యామిలీ డాక్టర్ పంపిన అబ్బాయి వచ్చి శాంపుల్ తీసుకెళ్ళి పోయాడు.*
*తెల్ల వారింది. ఉదయం 8 గంటలకు డాక్టర్ ఫోన్ చేసి, కరోనా నెగటివ్ వచ్చిందని అభినందనలు తెలియజేసి, ‘ఇక ఏం భయం లేదు, మీరు బయటకు రావచ్చ’ని చెప్పాడు.*
*ప్రశాంతంగా అనిపించింది మోహన్ రావుకు.. చావు భయాన్ని చాలా దగ్గరగా చూసినట్టు అనిపించింది.. ఎన్ని అస్తులున్నా, ఎంత మంది బంధువులున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అన్ని సార్లు ఉపయోగ పడవని అర్థం అయ్యింది. ఇన్ని రోజులు ఇంత సహాయం చేసిన ఆ మిడిల్ క్లాస్ మనిషికి కృతజ్ఞతలు చెప్పాలని, జీవితంలో మొదటి సారి అనిపించి మెయిన్ డోర్ ఓపెన్ చేసాడు మోహన్ రావు. ఎదురు ఫ్లాట్ ఖాళీగా కనిపించింది. వాచ్మెన్ ను పిలిచి ఎదురు ఫ్లాట్ వాళ్ళు ఏమైయ్యారని అడిగాడు. ఇవ్వాళ ఒకటో తారీఖు కదండీ, వాళ్ళు రాత్రి ఖాళీ చేసి, వేరే ఊరు వెళ్లిపోయారని వాచ్మెన్ సమాధానం విని ఉలిక్కి పడ్డాడు మోహన్ రావు.*
*అప్పుడప్పుడు ఖాళీగా కనిపించే ఎదురు ఫ్లాట్ ను ఇవ్వాళ చూడాలంటే భయం వేసింది. పశ్చాత్తాపంతో కళ్ళు నేల చూపులు చూశాయి. దూరంగా మోగుతున్న గుడి గంటలు మోహన్ రావు చెవులకు మనుషుల్లో మహాత్ములు కూడా వుంటారని చెప్తున్నట్లు అనిపించింది. తన జీవితంలో తొలి మార్పుకు ఆ గుడి గంటలు శ్రీకారం చుడుతున్నాయి. మోహన్ రావు లోని ఇన్నాళ్లు దాగున్న మనిషి మొదటి సారి కన్నీళ్ళ రూపంలో బయట పడ్డాడు. అతనిలోని మానవత్వానికి ఇదే పునాదయ్యింది.*
*దైవం మానుష రూపేణ అనే మాటకు భావం ఇప్పుడే అర్థమయ్యింది...*✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment