Tuesday, January 24, 2023

శ్రీ రమణాయ అధ్యాయము 37 ( భగవాన్ ఉవాచ తరువాయి భాగం )

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
అధ్యాయము 37
( భగవాన్ ఉవాచ తరువాయి భాగం )
        భగవాన్ వారివద్దకు వచ్చిన భక్తులకు చిత్రమైన విధములలో ఉపదేశాన్ని ఇస్తూ ఉండేవారు . అందులో కొన్ని -

         ఒకసారి మహాశివరాత్రి పర్వదినమున ఒక సాధువు భగవాన్ వద్దకు వచ్చి దక్షిణామూర్తి స్తోత్రం దాని అర్ధం గురించి చెప్పమని ప్రార్థించాడు . భగవాన్ ఆ వచ్చిన పెద్ద మనిషిని గంటల తరబడి కూర్చోపెట్టి మౌనముగా అందరివంకా చూస్తూ ఉండిపోయారు . అలా ఎనిమిది గంటలు మౌనంగా ఉండిపోయారు . *సుమారు 4 గం || లకు భగవాన్ “ దక్షిణామూర్తి స్తోత్రం అర్ధం తెలిసింది కదా . ” ఆ విధంగా మౌనంలో పరబ్రహ్మతత్వం దక్షిణామూర్తి స్తోత్రంలో పరమార్ధాన్ని బోధించారు* . 
       ఒకసారి ఆశ్రమంలో అందరూ ఫలహారం కొరకు కూర్చుని ఉండగా భగవాన్ సుందరేశన్ భక్తుడిని కూడా వచ్చి కూర్చొనమనగా అతడు ఆ రోజు పితృతర్పణం రోజని చెప్పగా భగవాన్ ఇట్లనిరి . “ *ఎందుకు పితృతర్పణం . నీ తల్లిదండ్రులు ఇదివరకే ఊర్ధ్వలోకానికి వెళ్ళారు . ఇప్పుడు నువ్వు తర్పణం వదిలి వాళ్ళని పైకి పంపవలసిన పనిలేదని తినమన్నారు . ఆ రోజు నుంచి సుందరేశం అమావాస్య రోజున పితృతర్పణం చేయటం మానేశారు* . 

       మరొక భక్తునికి షోలాపూర్ లో ఉద్యోగమురాగా భగవాన్ వద్దకు వెళ్ళి చెప్పి ఆశీర్వచనం తీసుకొనిన తరువాత ఆశ్రమం గడపదాటుటకు అతనికి మనస్సు ఒప్పక “ భగవాన్ మిమ్మల్ని వదిలిపోలేనని " ఏడ్చెను . *అప్పుడు భగవాన్ అందరితో ఇట్లనినారు . “ ఇరవై సం || ల నుంచి ఇతను ఇక్కడ ఉండి తెలుసుకున్నది ఇది . ఈనాడు భగవాన్ లేని స్థలానికి వెళ్తున్నానని దుః ఖపడుచున్నాడు* . " 

        మరొకసారి భగవాన్ పుష్పాలను మనుష్యులు ఉండనీయరని ఆ పూలను కోసి సూదులతో బాధిస్తారని దేవుడికి అసలు పూలుకావాలా . *ఆ పూలు చెట్టు మీద ఉంటే దేవుడివి కావా అసలు తమని అర్పించుకోవటం బదులు ఇలాంటి అగత్యాలు చేస్తారని చివరకు పూలనిచ్చే చెట్లను రాత్రికూడా నిద్రపోనీయరని ఆ చెట్లకు ఏమీ మిగల్చరని అంత ఆశ మనుష్యులకెందుకని భగవాన్ వాపోయినారు* . 
       మరియొక భక్తుడు భగవా ' ముందరలాగా భగవాన్ యొక్క రూపము . తన కళ్ళ ఎదుట కనిపించుట లేదని దానికి నివారణం ఏదని కోరగా భగవాన్ నామము జ్ఞాపకముంటే చాలని అది రూపముకన్న గొప్పదని నామము కూడా తరువాత పోతుందని అంత వరకు నామాన్ని పట్టుకోమన్నారు* . 

      మరొకసారి ఒక భక్తుడు ఉద్యోగము కావాలని భగవాన్ ని కోరగా “ *నాకే వీళ్ళు ( ఆశ్రమం వాళ్ళు ) తిండి పెడితే తింటున్నాను . పొమ్మంటే నాకు గతిలేదు . ఇక నేను ఒకరికి ఉద్యోగమిచ్చేదేమిటి ? " అని అన్నారు* .
      భగవాన్ కి పెట్టిన భోజనం పారవేయుటమంటే ఇష్టముండేది కాదు . దానికి ఒక భక్తుడు పారవేయకపోతే భూతాలకి తృప్తి ఎలా కలుగుతుందని ప్రశ్నించగా దానికి జవాబుగా భగవాన్ “ *నువ్వు భోజనం చేయక ముందేవాటికి తృప్తి చేయరాదు . నీ ఎంగిలితింటే కాని తృప్తి కాదా " అన్నారు భగవాన్* . 

      ఒకసారి భగవాను ఒక ఉత్తరం వచ్చింది . అందులో ఆ ఉత్తరం వ్రాసిన వాని తల్లి వృద్దురాలని తనను పోషించేందుకు జీతం సరిపోవటం లేదని జీతం పెరగవలెనని కోరినారు . భగవాన్ దానికి సరే అని అన్నారు . మళ్ళీ ఇంకొక ఉత్తరంలో అతను తనకు జీతం పెరిగిందని పై గ్రేడ్ ఇప్పించమని కోరినాడు . భగవాన్ దానికి కూడా సరి అన్నారు . తరువాత ఉత్తరంలో అతనికి పెళ్ళి అయితే భార్య వస్తుందని ఎందుకంటే అతని అమ్మ మంచాన పడిందని కరుణించమని కోరగా భగవాన్ మళ్ళీ సరి అన్నారు . కొన్నాళ్ళకు మరియొక ఉత్తరంలో పెళ్ళి అయిందని తన భార్యకు గర్భము వస్తే చూసి తన తల్లి పోతానంటుందని అనుగ్రహించమని కోరారు . భగవాన్ మళ్ళీ సరి అన్నారు . మరియొక ఉత్తరంలో సంతానం కలిగిందని కాని ప్రమోషన్ కావాలని కోరాడు . సరి అన్నారు భగవాన్ . మళ్ళీ ఉత్తరంలో అమ్మపోయింది అని రాశాడు . తరువాత ఉత్తరంలో బిడ్డ పోయినాడని రాశాడు . మళ్ళీ ఇంకొక ఉత్తరంలో భార్య గర్భవతియై బిడ్డను కని ఇద్దరూ పోయారని రాశాడు . చివరి ఉత్తరంలో అతను ఉద్యోగానికి సరిగ్గా హాజరు కాకపోవుటచే పనిలోంచి తీసేశారని తెలిపాడు . చివరికి భగవాన్ ఇట్లనినారు - *మధ్యలో వచ్చిందేదో పోయింది . మిగిలింది ఎప్పుడూ ఉన్నది తాను చివరికి మిగిలేదో అది అన్నారు* .

      ఇంకొకసారి ఒకతను భగవాన్ కూర్చున్న హాలులోకి వచ్చి చంపుతానని భగవాన్ని బెదిరించగా భగవాన్ మనలాగా భయపడలేదు . పైపెచ్చు ఇలా అన్నారు , “ *చంపునాయనా నాకీ దేహభారం తప్పిపోతుంది* . "

        పోస్టాఫీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న ఒకతనికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోగా ఆ దంపతులు భగవాన్ వద్దకు వచ్చి వచ్చే జన్మలోనైనా మా అబ్బాయిని చూస్తామా అని కోరగా భగవాన్ తప్పకుండా చూస్తావు అన్నారు . వారు వెళ్ళిపోయిన పిదప తక్కిన వారు భగవాన్ తో అదెలా సాధ్యమని అడుగగా *భగవాన్ భగవద్గీతను తెప్పించి దానిలోనున్న ఒక శ్లోకము చదివించారు . దాని తాత్పర్యమేమనగా “ ఎవరి అర్హతను బట్టి వారికి జ్ఞానమివ్వాలి . సిద్ధంకాని వారికి వేదాంతం బోధిస్తే అసలు వారి విశ్వాసమే నాశనమవుతుంది* . " 

     మనస్సుని అరికట్టటానికి జ్ఞాన , భక్తి మరియు కర్మ మార్గాల ద్వారా చేయవచ్చునని అదెలా అంటే జ్ఞానమార్గం ద్వారా మనసును నేను కాను అని తెలుసుకుని మనసును నిరోధించమని కర్మ మార్గము ద్వారా ఏదో ఒక కర్మయందు మనసును లగ్నంచేసి దానివల్ల మనసు నిలిచిపోతుందని మరియు భక్తి మార్గము ద్వారా మనసుని ఇష్టదైవం మీదకి పోనిచ్చిన ఆ మూర్తియందు లగ్నమై నిలబడుతుందని భగవాన్ చెప్తూ అన్ని మార్గములలో భక్తి మార్గము సులభమని దాని ద్వారానే *ఎవరి ఇష్టదైవం వారి మనస్సులో తీరిక ఉన్నప్పుడల్లా ధ్యానించుకోమని దాని వలన మనసు నిలబడిపోతుందని చక్కటి రహస్యాన్ని భగవాన్ చెప్పినారు* . 

    ఒకసారి ఒక శవాన్ని పెట్టెలో పెట్టి తీసుకుని వచ్చి ఆ పెట్టెలో ఉన్న ఒక్కగానొక్క కొడుకును బ్రతికిస్తారనే ఆశతో భగవాన్ వద్దకు వచ్చారు . భగవాన్ మౌనంగానే ఉన్నారు . తెల్లవారి ఆ తల్లి విశ్వాసముతో ఎదురు చూచినా అది విఫలమైనది . ఆ మర్నాడు శవాన్ని దహనం చేశారు . భగవాన్ ఇలా అన్నారు , “ *విశ్వాసంతో చాలా దూరము నుంచి వచ్చారు . కాని ఒక్కణ్ణి బ్రతికిస్తే ఇక అంతం ఉంటుందా* . " 

         ఒక భక్తుడు భగవాన్ని ప్రశ్నించుచుండగా ప్రక్కనున్న ఒక కుక్క మెరుగుచున్నది . ఆ భక్తుడు కుక్కను విసుక్కొనగా దానికి భగవాన్ , “ *ఆ కుక్క మొరగటం లేదు నీ మనస్సు మొరుగుతోంది " అన్నారు* . 
     ఈ విధముగా భగవాన్ చెప్పిన బోధనలు చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో కలవు . సముద్రాన్ని అంతా తాగగలమా . ఆకాశన్నంతా ఒక్కసారిగా మొత్తం చూడగలమా అసాధ్యం . కొన్నింటిని మాత్రమే అవి కూడా భగవాన్ తన అనుగ్రహముచే వారి ఇచ్చానుసారముగా ఏవేవి చెప్పదలచినారో అవి మాత్రమే భగవాన్ నాకు సమయస్ఫూర్తితో ప్రసాదించుట వలన వాటినే సేకరించి ఇక్కడ సమకూర్చటమైనది . భగవాన్ ఉపదేశాలు ఎన్నెన్నో కలవు . భగవాన్ చెప్పిన అమూల్యమైన సంభాషణలను ఒక అభ్యాసముగా తీసుకుని విద్యగా నేర్చుకుని జ్ఞానిగా అవుటకు విజ్ఞానము పొందుటకు శక్తి సామర్థ్యాలను భగవాన్ నుండి వేడుకుందాం .
 ఓ రమణా నీవే మాకు శరణాగతి . 

రమణా శ్రీ రమణా జయ రమణా గురు రమణా జ్ఞాని రమణా

అరుణాచలం శివ. 

No comments:

Post a Comment