కాసేపు నవ్వుకుందాం.
మొన్నో, ఇంకేదో ఈమధ్యనో ట్విట్టర్లో ఒక మెసేజ్ చూసా. నువ్వు చిన్నప్పుడు టూత్‌పేస్టు ట్యూబు చివరికంటా నొక్కి వాడావా, సబ్బంతా అరగదీసాక మిగిల్న ముక్క కొత్త సబ్బుకతికించావా, బొగ్గుల బాయిలర్‌లో వేణ్ణీళ్ళు కాచుకున్నావా, సరుకుల కొట్లో బెల్లం ముక్కడిగావా, కిరసనాయిలు కోసం క్యూలో నించున్నావా... ఇలా. ఇవన్నీ చేసుంటే నువ్వు డెబ్భైలు ఎనభైల్నాటి మిడిల్ క్లాసు తెలుగోడని అర్థం! నవ్వొచ్చింది. ఆశ్చర్యం కూడా!
ఏడిసినట్టుంది. ఇవన్నీ చెయ్యనోడూ, సినిమాల్చూడనోడూ తెలుగు నేల మీద పుట్టటమెందుకూ?
అసలు వీటన్నిటికన్నా మిడిలెస్టు క్లాసు కథ అప్పట్లో ఇంకోటుంది, చెప్పనా? పండగనో, బళ్ళు తెరుస్తుండంగాన్నో కొత్త లాగూ చొక్కాలు కుట్టీటం. దీ వరస్టంటే అదే!
ఎదిగే వయసు, ఊరూర్కెనే బట్టలు చిన్నవైపోతాయని, బాఘా దిట్టంగా ఐదులో తొడుక్కున్న లాగూయే ఎనిమిదిలో కూడా సరిపోయేట్టు; మోకాళ్ళకి నాలుగించీలు కిందికీ, నడుం ఎనిమిదంగుళాలు ఎక్కువుండేట్టు ఇంత పెద్దగా లుడంగం మోస్తరు కుట్టీటం.
ఈ విషయంలో అమ్మలన్నీ ఉత్తర కొరియా నియంతలకన్నా కనాకష్టం! ఇదిగో, తీరా షాపుదాకా వెళ్ళాక ఈ బడుద్ధాయి గునిసాడనో, ఫాషనుగా లేదన్నాడనో రెడీమేడు లాగూల్లాగా తొడల్దాకా టైటుగా కుట్టిచ్చేరు గనక. అయినా అంతంత పోసి కొని, సంక్రాంతిక్కుట్టిచ్చినవి శివరాత్రికే పొట్టివైపోతే ఏవిట్సుఖం? బట్ట దండగా కుట్టుకూల్దండగా తప్పిచ్చీ, అని పెద్దంతరం చిన్నంతరం యంతమాత్రవూ పాటిచ్చకుండా, యావండీగారంటే శ్రీ. ప్రత్యక్ష D అన్న సంగతి కూడా పట్టిచ్చుకోకుండా తమ యజమానిగారిమీన్నే ధాష్టీకం! ఇక మనకీ మనోబీగార్లనేకవుంటాయనీ, సాటి మనిషిగా మన చొక్కాలాగూలు ఎలా వుండాలన్నది మన పెరసన్లనీ విషయం అసలు ఎరగనట్టే ఉంటాయవి. (అవంటే మొత్తంగా అమ్మలన్నీ అంతే!) చిన్నవయసులోనే జై ఆంధ్ర ఇంకిలాబ్ జిందాబాద్ అని గట్టిగా మనసులోనే అరిచావంటే, అందులో నీ తప్పేం లేదన్నమాటే.
సరే, ఎంతేనా మననాన్న కదా మన పక్షం వుంటారన్నమ్మేవో, ఖాళీయే. ఆయనేవోఁ, కుట్టీమన్నదొకరూ, కుట్టేవాడింకొకడూ, తొడుక్కుతిరిగే చెవలాయ వీడొకడూ, మజ్ఝిన మనకేలన రొష్టనే మెట్టవేదాంతం మాటునో, లేక మొన్న హాఫెర్లీకి లెక్కల్లో పంతొమ్మిది మార్కులే వొచ్చాయిగనుక వీడికీ శాస్తి జరిగి తీరాల్సిందనే అన్డాడీ లైక్ నిర్దాక్షిణ్యం వల్లనో, మన్ని దీ న్యూ ఫాషన్ టైలర్స్ అనబడే వీరయ్య కొట్లోకి తీసుకెళ్ళి ఇదిగో చొక్కా లాగూ గుడ్డలని వాడికిచ్చేసి, మన్ని వాడి ముందుకు తోసేసి, ఏదో రేపే దాఖల్చెయ్యాల్సిన యమర్జెంటు కోర్టు కాయితాల్చదూతున్నంత పోజుగా నిన్నటి ఆంధ్రప్రభో, మొన్నటి ఈనాడు సంపాదకీయం వెనకో దాక్కోటం!
ఈవీరయ్యగాడున్నాడే.. పరమ నాస్టీఫెలో. అసలు వీడో టైల్రే కాదు నన్నడిగితే. చెవులో ఒకేపు నీలం ఇంకో వైపు ఎరుపూ ఉంటాయే, అట్టాంటి రెండు రంగుల పెన్సిలు, మెళ్ళో కండవా రీతిన టేపూ తగిలిచ్చుకోని, వెధవ పోజు మళ్ళీ! మనం, చొక్కా నడుంకి ఒక్క అంగుళం కిందికి లాగూ మోకాలుకి రెండగుళాలు పైకి ఉంచాల్రా అని ముందే సీక్రెట్‌గా ఇన్ట్రష్షన్ ఇస్తామా, ముందంతా పరమ నైసుగా, నాకు తెల్సు కదా బాబూ అంతా కొత్త ఫాషనుగా కుట్టి పెడతాగా, లాగూ ఎనికిట జోబు కూడా ఉంటాది నీకెందుకు చూడంటాడా, నాన్నొచ్చి మరీ అంత పైకేంటయ్యా ఎదిగే పిల్లాడు కదా అనంగాల్నే టేపు ఏడంగుళాలు సర్రున కిందికి జారుస్తాడు... మాట నిలకడలేని కుంక!! ఇంక లాగూ కొలతలు. రామ రామ! అది వాడి నడుమూ మన్నడుమూ కలిపి కొలిచేసి, ఈ మాత్రం చాల్లెండి అయగారూ, కాళ్ళకాడ మాత్రం ఒక రెండంగుళాలు ఇదిగో ఈ మాత్రముంచీ, ఇంకొంచం లోపటికి మడిచి కుట్టేస్తా. నడుమూ, కాళ్ళూ ఇంకా ఎక్కువ కొలతైతే బాగా లూజయిద్దని మనేపు చూసి కన్నుమలపటం, అక్కడికేదో మనల్ని ఉద్ధరిచ్చినట్టు. డబ్బు కోసం గడ్డితింటవంటే ఇది కదూ... దొంగ భడవ.
రెండోసారి కూడా మనం వెళ్ళి అడిగిన ఆర్రోజులకి ఆ లాగూలు మన్చేతికి రావటం. ఎలా ఉన్నా, ఇవి కొత్తవీ అచ్చంగా మనవీనన్న ఆదర వాత్సల్య సంతోషాది భావాలతో చిరునవ్వు మన మొహాన విరబూస్తుండగా, ఇంటికెళ్ళి ఆ కొత్త వలువలు తొడుక్కునే ప్రయత్నం!
అద్గద్దీ విషయం... సరిగ్గా అక్కడొస్తుంది, శాక్యమునికొచ్చినంత జ్ఞానం, మనకి కూడా!
జేబులో చేతులు పెట్టుకున్నా సరే, నీపాదాల చెంత నాకు చోటివ్వు దేవదా అని కాళ్ళంటుకున్న పారోకిమల్లే, ఆ లాగూ లంపటం మనం నించున్నకాడి దక్షిణం వెంపు జారిపోటమే కాని పైకిరాన్దే!! మరిహను దాన్తోటి జనబాహుళ్యంలోకి మనవంటి సిగ్గరి, పరూగల్లా మోమాటస్తుడుగారెలా రాడవంటే, దానికి మరో నీచతుచ్ఛత్యంతమర్రేత్తక్కూపాయవోటి మనం గుడ్లనీళ్ళు కక్కుకుంటూ డెబ్భైమార్లు ఛీయన్చిందుల్తొక్కినా సరే, ఏడిశావులే కుంకాయా, చొక్కాకిందనుండేదానికెలా ఏడుస్తే ఏం, దానికింతేడుపేవిటనంటూ, అటో రెండూ ఇటో రెండూ పిన్నీసులు పెట్టడం!
దీనికన్నా అధ్వాన్నం మనకంటే ఓ రెండేళ్ళో మూడేళ్ళో ముందు పుట్టినందుకు అదో పేద్ధ అక్కగారైనట్లు మనమీద అక్ఖలేని అధికారజులుం ప్రదర్శించే అక్కరాక్షసిలుంటాయే, వాటి వెలిసిపోయిన పచ్చరిబ్బనో, మాసిపోయిన తెల్ల పీటీ యూనీఫాము రిబ్బనో మన లేని నడుం నెప్పెట్టీదాకా బిగిచ్చీ, ఇహపో వెధవాయా అని మనల్నే కసురుకోని బడికి పంపీటం!
వీటన్నిటికంటే అతి దారుణ పరమభయంకర ఒవరికీ చెప్పుకోలేని మజ్ఝాతిమజ్జతరగతి ఓటుంటుంది. అంటే, నీ లాగూ జారిపోతుంటుంది కదా. దాని కోసం, నీ మొల్తాడిప్పి దానికి ఒక నులకతాడు ముడేసి లాగూ బిగిచ్చటం. లాపోతే మీ అన్నయ్య పైజామానో అక్కయ్య పరికీణీయో చిరిగిపోయేకా ఆ బొందు (చదూరానోళ్ళు నాడా అంటార్లే..) దాచి పెడుతుందిగా మీ అమ్మ! బట్టల బీరువాలో ఏ మూల్నించో దాన్ని తెచ్చి గుండ్రాయితో నాలుగు మోది ఓ మూరెడు ముక్క తెగ్గొట్టి అదేసి నడుంకి కట్టటం!
నువ్వొళ్ళు పొగర్తోనో, శ్ట్రాటజీ ప్లానింగుల్లో వీకు అయినందువల్ల అగ్నానంకొద్దీ ముందస్తుగా ఒకటో కాసినో అక్కల్నీ అన్నల్నీ సంపాయిచ్చుకున్నాక వెళ్ళితే ఒక్కగానొక్క ఆఖరి కొడుకన్న మర్యాదా గౌరవం గారాబం దక్కుతాయన్న రాంగ్కాల్క్లేషన్తో తాపీగా మరికాస్త సోమరసం, మరొక్క రంభ డాన్సు అనుకుంటూ లేటు చేసావో, తరవాత అతి తీవ్ర దుఃఖద పరిణామాలుంటయి. తస్మాజ్జాగర్త.
నీ జారిపోయే లాగూక్కట్టిన రిబ్బనూ, నులకతాడూ చూసి నీ మీదాళ్ళెవ్వరూ నీమీద్జాలి పడరు. మొహం గంభీరంగా పెట్టటం అంతా వుట్టుట్టి నటన. అటుతిరిగి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, ఏదో పుట్టిములిగిపోతున్నట్లు పెరట్లోకి ఉరికి కసిగా నవ్వుతుంటారు. పాపం వెర్రి వెధవ, మరీ ఏంటమ్మా, లాంటి ఒకటో అరో వాక్యం వినిపించినా దాంట్లో హానెష్టీ శాతం ఎంతన్నది, ఆవెంట వినపడే వికటాట్టహాసాల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయించుకో.
మజ్ఝతరగతి మిడిలు క్లాసిళ్ళల్లో ఏకైక చివరాఖరి మగపిల్లడై పుట్డవంత దుర్భర భయానక సీను అగ్గిరాముడు సినిమాలో కూడా ఉండదు! మగాడై పుట్టేకంటే అడవిలో మానై పుట్టటం మేలన్న సామెత విన్లా? ఇందుకే!
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం
No comments:
Post a Comment