Tuesday, January 31, 2023

*****🌷అంతరాలోచన🌷

 🌷అంతరాలోచన🌷

జీవితం అంటే...,

ఎడతెగని భావ పరంపరల ప్రవాహమే.

చావొస్తుందని తెలిసి బ్రతికేస్తున్నాం.,

బాధోస్తే బ్రతకలేమా?

సకల జీవులు భగవత్ అవతారములే..,

అందులో ఓ పది మాత్రమే అవతారములు గా ప్రాచుర్యం పొందినాయి.

➡ జీవుని తలంపు -
  కార్యరూపం దాల్చడానికి కొంత వ్యవధి అవసరం.

➡ భగవంతుని తలంపు -
తలంపు, కార్యం  ఏకకాలంలో జరుగుతాయి.

శివ తత్వం:-

➡ శివం - శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.
➡ త్రినేత్రం - ధ్యానం/తపస్సు.
➡ ఢమరుకం - సంగీతం.
➡ తాండవాభినయం -  నృత్యం.
➡ శివుని చేతిలోని అగ్ని - నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.
➡ భిక్ష పాత్ర -  ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.
➡ కపాలం - శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.
➡ కోరుకునేది - చితా భస్మం కాదు.  చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)

భవబంధాలు తెగాలి అంటే:-

➡ ముందు భవము తెగాలి.,
అంటే 'నేను పుట్టాను' అన్న భావన పోవాలి.
➡ తర్వాత బంధాలు వాటికవే తెగిపోతాయి.

మనం ఇక్కడ నుండి అక్కడకు వెళ్లే వాళ్ళము కాదు.,

అక్కడ నుండి ఇక్కడకు వచ్చిన వాళ్లము.

➡ భక్తి కావాలంటే అరుణాచలం (అగ్నిలింగం) చుట్టూ తిరగండి.
➡ జ్ఞానం కావాలంటే అనిలాచలం (వాయు లింగం) చుట్టూ తిరగండి.

అనిలాచలం = శ్రీకాళహస్తి = వాయు లింగం = శ్వాస.

👉 శ్వాస మీద ధ్యాస (ధ్యానం) ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు.

సన్యాసం అనేది --
అంతరంగిక విషయం.,
బాహ్య విషయం కాదు.

లోకాన్ని ఉద్ధరించడం కూడా.,

తనను తాను ఉద్ధరించుకోవడం లో భాగమే.

➡ నాలుకను ఆపితే మాట ఆగుతుంది
➡ చిరునాలుకను ఆపితే మనసు ఆగుతుంది

నాలుకను పై దవడకి ఆనిస్తే, చిరు నాలుక కదలిక కూడా ఆగుతుంది. అప్పుడు మనసు నిశ్చలం అవుతుంది.

➡ నిశ్శబ్దం - నీ వెలుపలి విషయం.

➡ మౌనం - నీ లోపలి విషయం.

సైంటిస్టులు వెతికే దైవకణం బయట ఎప్పటికీ దొరకదు., తన లోపలే అది దొరుకుతుంది.

ఆ దైవకణమే -- నేను (ఆత్మ).

కర్తృత్వ భావనే బంధం;

అది తొలగితేనే మోక్షం.

దేనియెడల, ఎవరి యెడలా 'ప్రత్యేకత'ను కలిగి ఉండొద్దు.

అదే మోక్ష స్థితి.

'ఆచరణ' అనేది గొప్ప ఉపన్యాసము.

➡ పదార్థం గురించి చెప్పేది - సైన్స్ 

➡ పరమార్ధం గురించి చెప్పేది - ఆధ్యాత్మికం

గాఢనిద్రలో ఉన్న తన ఆనంద స్థితిని.,

మెలకువలో పొందాలనే ప్రయత్నమే 'ఆధ్యాత్మికం'.

'మౌనం'గా ఉండడమే నిజమైన దక్షిణామూర్తి స్తోత్రము.

👉 ఆత్మహత్యలో "భౌతిక శరీరం" పోతుంది.

👉 ఆత్మసాక్షాత్కారం లో "నేను" పోతుంది.

పైకి ఎలా కనబడిన సరే.,

ప్రతి ఒక్కరూ సృష్టి కార్యాన్ని నెరవేరుస్తున్నవారే.

ప్రాణం రెండు విధాలుగా అభివ్యక్తమవుతోంది--

➡ శ్వాసగా
➡ తలంపుగా

➡ పట్టుకుంటే - సంసారం.
➡ వదిలేస్తే - సన్యాసం.
➡ వదలగలిగి పట్టుకుంటే - ఆధ్యాత్మికం.

పుట్ట - శరీరం 
పాము - ఆత్మ

👉 ఒక్కొక్క పుట్టలో ఒక్కొక్క పాము ఉందనుకుంటే అది - స్వస్వరూప దర్శనం.
👉 అన్ని పుట్టల్లోను ఉండేది ఒకే పాము అని తెలిస్తే అది - విశ్వరూప సందర్శనం.

'అనంత విశ్వం'లోని సత్తువ కొంత --
నాన్న వీర్య కణమై, అమ్మ కడుపులో నలుసై ఈ భూమిపై పడి నాలుగు కాలాలు నడయాడి తిరిగి 'అనంత విశ్వం'లో కలుస్తుంది.

ఎందుకీ చక్రం?  ఎంతకాలమీ చిత్రం??

✳ ఇక్కడి వాళ్లు మేడలను చూడ్డానికి విదేశాలకు వెళుతున్నారు.
✳ అక్కడి వాళ్లు జ్ఞానులను చూడ్డానికి భారతదేశానికి వస్తున్నారు.

వారిది భోగ దేశం;  మనది యోగ దేశం.

➡ వ్యవహారంలో ద్వంద్వాలు ఉండడం తప్పనిసరి.

➡ అనుభవంలో మాత్రమే అద్వైతానుభవం ఉండడం సరి.

ఏ ఆలోచన అయినా,
ఏ క్షణానికి ఆ క్షణం మనసు నుండి శూన్యం అవ్వాలి.
అప్పుడు ఆ మనస్సే -- సాక్షాత్తూ "పరబ్రహ్మం" అనబడుతుంది.

(క్లాసు అయిపోగానే, బ్లాక్ బోర్డును డస్టర్ తో తుడిచేసినట్లు, తుడిచేయాలి.)

ఆధ్యాత్మిక ప్రశ్నకు సమాధానమే దొరకదు.

ఎందుకంటే,  'ప్రశ్నించే వాడే' సమాధానం కాబట్టి.

👉 జగత్తును చూసేవాడు తనను (ఆత్మను) చూడలేడు.

👉 తనను (ఆత్మను) చూసేవారికి జగత్తు లేదు.

✳ గ్రంథాల పారాయణం -  పారాయణం చేసిన తర్వాత ఫలితం.

✳ జ్ఞాన సూక్తుల పారాయణం - ఫలితాన్ని అనుభవిస్తూ చేసే పారాయణం.

👉 కోరిక - ఐహికమైనది.

👉 సంకల్పం - పారమార్థికమైనది.

బ్రహ్మం అంటే?
'ఉన్నది' ఏదో అది (సత్)

ఆధ్యాత్మికం అంటే?
ఆ బ్రహ్మము యొక్క స్వభావం (చిత్)

కర్మ అంటే?
సృష్టికి ప్రధాన కారణమైన ఆ బ్రహ్మము యొక్క విలాస సంకల్పము (ఆనందం)

వైరాగ్యం అంటే ...

➡ నీవు కోరకుండా ఉండటమే కాదు.,
➡ వచ్చిన దానిని కూడా వద్దనకుండా ఉండగలగటం.

దేవుడు రక్షిస్తాడని సనాతనధర్మం చెప్పదు. 

ధర్మం రక్షిస్తుందని చెప్తుంది. (ధర్మో రక్షతి రక్షితః)

👉 పుణ్యము పండినచో మనుష్య జన్మ వచ్చును.
👉 ఇంకను పండినచో ధర్మములందు అనురక్తి కలుగును.
👉 ఇంకను పండినచో ఆత్మానాత్మ విచారణ సిద్ధించును.
👉 ఇంకను పండినచో అఖండ ఆత్మతత్వానుభూతి కలుగును.

పుట్టినప్పుడు పేరు ఉండదు.,  ఊపిరి తప్ప.

పోయినప్పుడు ఊపిరి ఉండదు., పేరు తప్ప.

ప్రపంచానికి ఒకడు చచ్చినట్లు కనబడ్డా!
నిజానికి., అతనికి ప్రపంచం చచ్చింది.

No comments:

Post a Comment