Thursday, January 26, 2023

శ్రీ రమణాయ అధ్యాయము 39 ( భగవాన్ శ్రీ రమణ మహర్షి అవతారము ముగించుట )

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
అధ్యాయము 39 

( భగవాన్ శ్రీ రమణ మహర్షి అవతారము ముగించుట ) 

      భగవాన్ శ్రీ రమణ మహర్షి తన 16 వ యేటనే ఆత్మ జ్ఞానమును పొందినారు . వారు దేహము అశాశ్వతమైనప్పటికి ఆ నశించే దేహములోనే శాశ్వతమైన అమృత తత్వమున్నదని “ నేను ” అనే ఆత్మ చైతన్యం ఒక శక్తిగా శరీరంలో నడుస్తూ ఉన్న శక్తికి కేంద్రమని ఆ నేను ఆ శక్తి ప్రవాహం వల్ల అన్నీ వారు చేస్తున్నారని గ్రహించారు . ' నేనెవరు ' అనే విచారణ తమ 16 వ యేట వారు భౌతిక దేహము మరణించినదని వారి దేహము ఒక శవములాగా పడివున్నా భగవాన్ తను జీవించి ఉన్నట్లు స్పష్టముగా తమ ఉనికి స్ఫురణలోనే ఉన్నారు . వారు నేను అని పలుకకుండా మరియే ఇతర పదాలను కూడా పలుకక తమ నోరును గట్టిగా మూసి ఉంచినప్పటికి నేను ఉన్నాను , *నేను శబ్దం ఉంది . నేను అనేది ఉన్నది అని ' నాలోనే నాకు అనుభూతి పూర్తిగా ఉన్నది అదేమిటి ? అది ఒక శక్తి లేక ప్రవాహంగా తన శరీరాన్ని పనిచేయిస్తున్న శక్తికి కేంద్రముగా శరీరము జడమై గట్టిగా ఉన్నప్పటికి దానితో ఆ శరీరము పనిచేస్తున్నా దానితో సంధింపబడి ఉన్నట్లు అనిపించింది . ఆ శక్తి ప్రవాహం కేంద్రమే నేనుగా నన్ను కదిలిస్తుంది . పనిచేయిస్తుంది* " అని భగవాన్ గ్రహించారు . ఈ అభిప్రాయము తెలుసుకున్న తరువాత భగవాను మరణం గురించి భయం పోయినది . దానికి మరణము లేదని ఇక భయపడనవసరములేదని భగవాన్ తెలిపారు . కావున భగవాన్ మరణించే ఈ అధ్యాయము తెలుసుకునే ముందు *భగవాన్ స్వయముగా వారే ఆత్మజ్ఞానము పొందిన తరువాత మరణమే లేదని కావున భయానికి ఇక చోటెక్కడని చెప్పినారు . కావుననే భగవాన్ మరణించలేదు . కాబట్టే నిర్యాణము , సమాధి అని కూడా అనకుండా ఈ అధ్యాయానికి భగవాన్ శ్రీ రమణ మహర్షి తమ అవతారమును ముగించినారని చెప్పబడినది* . 


      ఇలపై అవతరించిన మహాపురుషులు తమ కార్యములను నెరవేర్చిన పిదప ఏదో ఒక కారణమును చూపి వ్యాధి కలిగించుకుని తమ శరీరములను వదిలివేయుదురు . అది మాయా ప్రభావము తప్ప నిజానికి అటువంటి మహాపురుషులకు వ్యాధులు సోకవు . కానీ సోకినట్లుగా చూపి ఏదో ఒక నెపముతో వారి శరీరములను విడిచెదరు . అలాగే మన భగవాన్ శ్రీ రమణ మహర్షి వ్యాధిగ్రస్తులై తమ ఆరోగ్యము రోజు రోజుకి క్షీణింపచేసుకుని 1947 వ సం || ములో మొదలైనవి వారి బాధలు . వారికి కీళ్ళవాతము , నడుముకి వీపుకి వ్యాపించి బాధపడుతుంటే భగవాన్ “ *ఈ దేహమే ఒక వ్యాధి . ఆ వ్యాధికి నివారణ చూడాలి కాని ఈ వ్యాధికి నివారణ దేనికి ?* అని అంటూ ఏ మందులు వేసుకొనక మౌనముగానే ఉండేవారు . అలా ఒక సం || ము కీళ్ళవాత బాధతో ఉండి 1948 వ సం || మున భగవాన్ ఎడమ చేతికి ఒక కురుపు వచ్చి అది పెరిగి పెరిగి వస్తూ ఉంటే భక్తులు భగవాన్ ని దాని గురించి అడిగితే " *లింగం పుట్టినదని అది స్వయంభూలింగమని ” అనేవారు . డాక్టర్లు శస్త్ర చికిత్స చేయాలంటే భగవాన్ “ ఎదిగితే ఎదుగుతుంది . మనకేమి దాని పని అది చూసుకుంటుంది . మనమెందుకు కదల్చటం* ” అని అనేవారు . భగవాన్ ని బలవంతముగా ఒప్పించి శస్త్ర చికిత్స చేశారు . ఐనా ఆ కురుపు మళ్ళీ పెరిగి పెద్దదైనది . అసలు భగవాన్ ఇంత జరిగినా నొప్పితో బాధపడుతున్నట్లుగాని అసలు వారి శరీరముపై కురుపు ఉందని కాని శస్త్ర చికిత్స బాధగాని పడినట్లు కనపడలేదు . అసలువారు ఒక శరీరమని అనుకుంటే కదా . రెండవసారి ఆపరేషన్ పెద్ద డాక్టర్లు చేశారు . భగవాన్ దానికి ఒప్పుకుని మళ్ళీ వస్తే చూచుకుందాంలే అన్నారు . ఆపరేషన్ ఐన తరువాత కూడా భగవాన్ కి ఎటువంటి గుణము కనబడలేదు . ఆ పుండు మానకపోగా రక్తం కారుట మొదలైనది . చివరికది విషగ్రంధి అని నిర్ణయించారు . *ఒక డాక్టరు భుజంతో సహాకోసి వేయాలన్నారు . అప్పుడు భగవాన్ “ ఇది తలపై లేచిన తలను కొట్టి వేయుదురు కాబోలు ” అని అన్నారు* . పుండుకు ఎన్నో చికిత్సలు చేసినా తగ్గలేదు . ఒకరు భగవాన్ ను ఇట్లు ప్రశ్నించారు , “ *మీరు సంకల్పం చేసుకుంటే తగ్గిపోదా ? ” దానికి జవాబుగా “ దానిని నేను రమ్మంటినా పొమ్మనుటకు ” అన్నారు భగవాన్* . ఇంత బాధ పడుతున్నా చమత్కారం చేస్తూ వారికి చీమ కుట్టినట్లు కూడా అనిపించేది కాదు . వారి భావన వ్యాధి శరీరానికే కాని వారు శరీరము కాదని ఆత్మ అని తెలిసికొనుటచే వారు ఆ విషగ్రంధి తమ చేతిపై వచ్చినా ఎటువంటి బాధపడలేదు . కన్నీరు కార్చలేదు . భక్తుల బాధలను ఓర్చుకొనలేక వారి తృప్తి కొరకై శస్త్ర చికిత్స చేసుకున్నారు . వైద్యశాస్త్రము చదివిన డాక్టర్లను నొప్పింపక వారికోసము ఆపరేషను చేయించుకున్నారు తప్ప వారికి ఎటువంటి మోహము తమ శరీరముపై లేదు . 


       భగవాన్ బాధలను చదువుతుంటేనే మనకి ఎంతో బాధ కలుగుతున్నదే , మరి అంత బాధను స్వయముగా అనుభవించిన భగవాన్ మాత్రము ఏ చలనము లేకుండా ఆత్మ నిమగ్నులై యున్నారు . అటువంటి జ్ఞానము , నిబ్బరము , ధైర్యము , ఓర్పు , దేహ వ్యామోహము లేకుండుటలాంటి మహోన్నత శక్తిని ప్రసాదించమని భగవానుని వేడుకుందాం . 


ఓ రమణా నీవే మాకు శరణాగతి . 

అరుణాచల శివ. 

No comments:

Post a Comment