Tuesday, May 2, 2023

గ్రంథం: జ్ఞానధార... రచన: జ్ఞానశిశువు

 గ్రంథం: జ్ఞానధార...
రచన: జ్ఞానశిశువు 
__

       ఉండు
__

అనవసర వ్యవహారాలను ఇంట్లోకి తేవద్దు.
అనవసర ఆహారాలను వంట్లోకి త్రోయొద్దు.

( అంటే ఊళ్లో వ్యవహారాలన్నీ ఇంట్లోకి తేవద్దు, రుచికోసం తినకు శుచి గా ఉన్నవి తగుమాత్రంగా తినమని)

శరీరం ఆరోగ్యంగా ఉంటే 
శరీరం ఉన్నా లేనట్టుగానే ఉంటుంది.

( అంటే రోగం ఉన్నప్పుడే శరీర బాగాలు గుర్తొస్తాయి, ఆరోగ్యం గా ఉన్నప్పుడు ఏమీ గుర్తురావు అనీ )

మనసు నిర్మలంగా ఉంటే 
మనసు ఉన్నా లేనట్టుగానే ఉంటుంది.

( కొంతమందికి తలంపుల రూపంలో మనసు వేధిస్తుంది, ఒకోసారి ఏ కారణం లేకుండా సంతోషంగా, శాంతిగా అనిపిస్తుంది అప్పుడు మనస్సు అనేది ఒకటుందనే గుర్తురాదు కదా!!)

నీ నివాసం కంటే గొప్ప ఆశ్రమం మరొకటి లేదు.
నీ దేహం కంటే గొప్ప దేవాలయం మరొకటి లేదు.
నీ మనసు కంటే గొప్ప దైవం మరొకటి లేదు.

( మనల్ని పాడు చేసినా బాగు చేసినా మనసే, దాన్ని ఉపయోగించుకోవటంలో ఉంటుంది, ఉపయోగించుకుంటే మోక్షానికి దానికి మించిన సహాయకారి మరకటి లేదు, కాబట్టి మనసు కూడా దైవంతో సమానం )

మిక్కిలి స్వార్థంగా జీవించు.
నీ ఆనందం కోసమే ప్రతీక్షణాన్ని వినియోగించు.

(ఇక్కడ ఆనందం అంటే బాహ్యమైన ఆనందం కాదు, ఆ ఆనందాలన్నీ కూడా ఏదో ఒక దాని మీద ఆధారపడి వచ్చేవి, అటువంటి భ్రమతో కూడుకున్న  ఆనందం మీద కాదు ఆత్మానందం మీద ఆధారపడి బ్రతకమని)

లోకసేవ పెద్ద అబద్ధం అని తెలుసుకో.
కుటుంబసేవే దేశసేవ అని తెలుసుకో.

( ముందు ని కుటుంబాన్ని ఉద్దరించుకో అది ని బాధ్యత అనీ..)

విశ్వానికి కేంద్రం నీవు.
నీవొక్కడివి ఆనందంగా ఉంటే,
ఆ ఆనందం విశ్వవ్యాప్తం అవుతుంది.

(స్వపరివర్తనే విశ్వ పరివర్తన అనీ) 

నీ మనశ్శాంతే
ప్రపంచశాంతి.

( మన అశాంతే ప్రపంచంలోని అనర్ధాలకు కారణం, నువ్వు శాంతిగా ఉంటే ప్రపంచానికి శాంతినివ్వగలరు నీకు లేనిది ప్రపంచానికి ఎలా ఇస్తావ్ అనీ )

ధర్మంతో నడువు.
సత్యంతో గడుపు.

అన్ని రకాల ప్రశ్నలనూ వదులు.
ప్రశ్నించిడం నీ స్వభావం కాదు.
అన్ని ప్రశ్నలకూ సమాధానం నీవు.

నీకు నీకు ఒక్క అడుగు ఎడంగా ఉండు.
లేదా
సర్వమూ నీవే అయి ఉండు.

గంగలో మునగడం కాదు,
నీలో నీవు మునుగు. (అంటే అంతర్ముఖం అవ్వమని)    
తెరను(ఆత్మను) గుర్తులో ఉంచుకొని 
ప్రపంచ సినిమా చూడు.

మనసారా ఏడువు.
కడుపార నవ్వు.

చివర్లో ఇదంతా ఓ నాటకం అనుకుని 
అన్నీ దులుపుకుని స్వంతగూటికి(హృదయానికి) చేరుకో.

ఈ జగత్తొక స్వప్నం.
మహర్షి నేనే, నీచుడూ నేనే అని ఉండు.

( కుడి చెయ్యి నీదే ఎడం చేయి నీదే కదా!!)

ఎవరి అభిప్రాయాలనూ నీ మెదడులో నింపకు.
ఎవరినీ నీ అభిప్రాయాలతో చంపకు.

నీ చెవులను ఎవరికీ అప్పగించకు.
నేను-ఉన్నాను అని నీలో వినబడే మాటను విను.

నీ చూపును ఏ దృశ్యాలకూ అంకితం చేయకు.
నీలోని ద్రష్టను పరికించి చూడు.

వెలుపల ఉంటే ప్రశ్న తెగదు.
లోపల ఉంటే ప్రశ్న పుట్టదు.

వెలుపల నటించు.
లోపల జీవించు.

నిత్యవ్యవహారంలో ఉన్నట్టే ఉండాలి.
మనసెప్పుడూ "నేను" పైనే కేంద్రీకరించి ఉండాలి.

అందరికీ నీవు ఉన్నట్టే ఉండు.
నీకు నీవు లేనట్టు ఉండు.

(నీ జీవితాన్ని కూడా ఒక సినిమాలా చూడు దానితో కలసిపోకు అనీ )

"ఉండు" అంతే.
అలా ఇలా ఉండొద్దు.

( I AM SO AND SO అంటే నేను పలానా అది చేశాను, ఇదీ చేశాను, అంతటి వాడిని, ఇంతటి వాడిని అనుకోకు అనీ, BE STILL AND KNOW THAT I AM GOD, "ఉండు" I AM THAT I AM అంతే..)
* * *
జ్ఞానశిశువు

No comments:

Post a Comment