*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *ఒక రోజు ఒక వేటగాడి చేతికి ఒక చిన్నపక్షి(పిచ్చుక) దొరికింది . అతడు దానిని చంపబోతుంటే ఆ పక్షి అతనితో ఇలా అంది:~*
💖 *”అయ్యా! నీవెన్నెన్నో పెద్ద పెద్ద మృగాల్నీ, జంతువుల్నీ వేటాడి ఉంటావు. నా లాంటి అల్పప్రాణిని చంపటంవల్ల నీకేం లాభం? పిడికిల్లో పట్టేంత కూడా లేని నన్ను చంపి తింటే నీ ఆకలి ఎలాగూ తీరదు. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టి నన్నువదిలెయ్. అందుకు ప్రతి ఫలంగా నేను నీకు అమూల్యమయిన మూడు నీతి సూక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి, నీవు సంతోషంగా సుఖంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి." అంది.*
💖 *ఆ వేటగాడు ఒక్కక్షణం అలోచించి ‘నిజమే ఈ పిచ్చుకని చంపటంవల్ల ఉపయోగంలేదు’ అనుకుని “సరే వదిలివేస్తాను ఆ నీతి సూక్తులు చెప్పు" అన్నాడు.*
💓 *ఆ పిచ్చుక ఆ వెంటనే “అయ్యా! కానీ నాదొక షరతు. నేను మొదటిసూక్తిని నీ చేతిలో చెప్తాను. రెండవది నీఇంటి పైకప్పుపై కూర్చుని చెప్తాను. ఇక మూడవది చెట్టుకొమ్మ మీద కూచుని చెప్తాను”అంది. వేటగాడు సరేనన్నాడు.*
❤️ *ఆ పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చుని మొదటి నీతిసూక్తినిలా చెప్పింది:~*
💖 *”ఎదుటి వ్యక్తి ఎవరైనాసరే, ఎంతగొప్పమాటలు చెప్పినా సరే, నీ అనుభవానికి(తర్కానికి) రానంత వరకు ఆ వ్యక్తినీ, ఆ మాటలను నమ్మకూడదు.” అని చెప్పి వేటగాడిచేతిలో నుండి ఎగిరివెళ్లి ఇంటిపైకప్పుపైన కూర్చున్నది.*
💖 *ఇంటిపైకప్పుమీదినుండి ఫక్కుననవ్వి అందిలా “ఓరీ…మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకున్నావు? నా కడుపులో అత్యంత విలువైన, బరువైన వజ్రం ఉంది. అది తెలుసుకోకుండా నువ్వు వదిలేశావు నన్ను.”*
💝 *ఈ మాటలు విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టాన్ని తలచుకుని “అయ్యో! అంత విలువైన, బరువైన వజ్రాన్ని కోల్పోయానే, ఎంతటి మూర్ఖుడిని నేను” అని ఏడవటం మొదలుపెట్టాడు.*
💖 *పిచ్చుక అంది “ఓరీ నీవు నిజంగానే మూర్ఖుడివి. ఇందాకే నీకు చెప్పాను కదా! ‘ఎదుటి వ్యక్తి ఎవరయినా సరే…ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే… నీ అనుభవానికి (తర్కానికి) రానంతవరకు ఆ వ్యక్తినీ, ఆ మాటల్నీనమ్మకూడదు’ “ అనీ*
💖 *’నీ పిడికిలంత కూడా లేని నేను, నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు? మూర్ఖుడా! సరే ఇక రెండోనీతిసూక్తి చెబుతా విను’*
💖 *’వెనక్కి తిరిగిచూసుకుని గతంలో జరిగిపోయిన వాటిని గురించి ఎప్పుడుకూడా అలోచించి బాధ పడకూడదు.’ అని చెప్పి ఎగిరి వెళ్లి చెట్టుకొమ్మపైన కూర్చుంది*
💝 *ఆ వెంటనే ఆ వేటగాడు ఏడుస్తూ "నేను నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నన్ను మోసం చేసావు." అని అరుస్తున్నాడు.*
❤️ *ఆ పిచ్చుక వేటగాడిని చూస్తూ అలా కూచుని ఉంది.*
💝 *వేటగాడు కాసేపటికి తేరుకుని “ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకుని జరిగిపోయిన వాటి గురించి అలోచించి బాధ పడవద్దు”అని గుర్తు చేసుకుని “సరే! ఇప్పుడా మూడోసూక్తి ఏమిటో చెప్పు”అన్నాడు.*
💖 *ఆ పిచ్చుక “ఎలాగూ నేను చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు కదా? మూడోది చెప్పటంవల్ల ప్రయోజనం ఏంటీ?” అంటూనే “నీ మాటలు వినని, అర్థం చేసుకోని వారిపై ఎన్నడూ నీ శక్తినీ, విజ్ఞానాన్నీ, సమయాన్నీ వృథా చేసుకోవద్దు”అనిచెప్పి ఎగిరి వెళ్ళిపోయింది.*
❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment