గ్రంథం: జ్ఞానధార...
రచన: జ్ఞానశిశువు
______ *తానుండడమే దేవుడుండడం*
______
దేవుడు ఉన్నాడు...అని వాదిస్తాడొకడు...
ఉండనీ...
ఇక వాదన ఎందుకు?
ఉన్నాడని నిజంగా నీకు తెలిస్తే వాదించవు.
ఉన్నాడని వాదిస్తున్నావంటే...
లేడేమోనని ఏ మూలనో కాస్త అనుమానం నీకు ఉన్నట్టే.
దేవుడు లేడనే నాస్తికుడు కూడా వాదించనక్కర్లేదు.
లేనివాని గుఱించి ఇతరులతో గొడవెందుకు?
వాదిస్తున్నాడంటే, ఉన్నాడేమో అని ఏ మూలనో అతనికి అనుమానం ఉన్నట్టే.
వాదనకి కారణం, తనలో ఉన్న సంశయమే.
కాబట్టి-
వాదించే ఆస్తికుడు సంపూర్ణ ఆస్తికుడు కాడు.
వాదించే నాస్తికుడు సంపూర్ణ నాస్తికుడు కాడు.
సంపూర్ణ ఆస్తికుని, సంపూర్ణ నాస్తికుని
స్థితి ఒక్కటే - 'మౌనమే'.
* * *
'దేవుడు లేడు' అని వాదించేవాడొకడు
గురువుగారిని వాదనకు ఆహ్వానించాడు...
వెళ్లారు గురువుగారు...
ఇద్దరూ చాపలు పరచి ఎదురెదురుగా కూర్చున్నారు...
'దేవుడు లేడు' అని నా అభిప్రాయము' అన్నాడా నాస్తికుడు.
'ముమ్మాటికీ నా అభిప్రాయం కూడా అదే' అన్నారు గురువుగారు.
ఆ నాస్తికుడు అవాక్కయ్యాడు....
వాదనకు అవకాశం లేకుండా అయిపోయినందుకు...
'అదెలా అండీ......మరో మాట చెప్పండీ...' అన్నాడతడు.
'ఒకటే మాట... మీ మాటే నా మాట...' అన్నారు గురువుగారు.
అంతటితో నిరాశతో లేచి వెళ్లిపోయాడతడు.
* * *
దేవుడు ఉన్నాడు అన్నవానితో 'లేడు' అని వాదిస్తే ఘర్షణ ఉంటుంది.
దేవుడు లేడు అన్నవానితో 'ఉన్నాడు' అని వాదిస్తే ఘర్షణ ఉంటుంది.
లేడు అన్నవానితో లేడు అని,
ఉన్నాడు అన్నవానితో ఉన్నాడు అని అంటే
ఇక వాదనకు అవకాశం ఎక్కడిది?
జయాపజయాలకు అవకాశం ఎక్కడిది?
'నేను ఓడిపోయాను' అని ఒప్పుకున్నవాడిది కూడా గెలుపే.
అక్కడ ఘర్షణకు చోటుండదు.
ఘర్షణ లేకుండడమే విజయం.
* * *
ఒక గాజు గ్లాసులో నీళ్లు అర్థభాగం నింపబడి ఉంది...
ఒకడు 'సగం గ్లాసులో నీళ్లు ఉన్నాయి' అని నీళ్లు ఉన్న భాగం వైపుకు చూసి అంటాడు. మరొకడు నీళ్లు లేని భాగం వైపు చూసి సగం గ్లాసులో నీళ్లు లేవు అంటాడు.
ఇద్దరు చెప్పిందీ సత్యమే.
నీళ్లు ఉన్నా లేకున్నా గ్లాసు ఉంటుంది.
అదే ఆధార సత్యము.
ఒకాయను మీసాలున్నాయని ఒకడు,
ఆయనకు మీసాలు లేవు అని ఒకడు వాదించుకుంటున్నారట...
కానీ మీసాలు ఉన్నా లేకున్నా ఆ మనిషి ఉండాలిగా...
అదే ఆధార సత్యము.
'దేవుడు లేడు' అనే నాస్తికుడైనా 'తాను' లేడు అనడు....అంటారు భగవాన్.
తానుండడమే దేవుడుండడం.
* * *
నా చిన్నప్పుడు బాలచంద్రికలో చదివిన వివేకానంద బొమ్మల కథ ఒకటి గుర్తుకొస్తోంది...
టెక్సాస్ లో తుంటరి యువకులు కొందరు కిరోసిన్ డ్రమ్ము బోర్లించి, దానిమీద నిలబడి ఉపన్యాసం ఇమ్మంటారు-
వివేకానంద ఏ మాత్రం జంకు లేకుండా దాని మీదే నిలబడి ఉపన్యాసం ఇస్తారు.
ఆ సందర్భంలో వివేకానంద అన్న మాటలు-
'దేవుని మీద నమ్మకం లేని వారు నాస్తికులు కారు.
తమ మీద తమకు విశ్వాసం లేనివారే నాస్తికులు.
దేవుని మీద నమ్మకం ఉన్నవారు ఆస్తికులు కారు.
తమపై తమకు విశ్వాసం కలవారే ఆస్తికులు.
తమపై తమకు విశ్వాసం గల కొద్దిమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర' అంటారు.
వీరికి ఏ మాత్రం విశ్వాసం ఉందో చూద్దామని ఆ తుంటరి యువకుల్లో ఒకడు గాలిలో తుపాకీ పేలుస్తాడు...
జనమంతా చెల్లాచెదురుగా పరుగులు తీశారు...
ఒక్క వివేకానంద మాత్రం చెదరక బెదరక నిలబడి ఉన్నారు...
ఆ యువకులు వివేకానంద విశ్వాసానికి, నిశ్చలత్వానికి ఆశ్చర్యపోయారు...
వివేకానంద పాదాలపై బడి క్షమాపణ కోరారు.
* * *
నేను-నేను అంటాడు వ్యక్తిగా.
ఇది కర్మయోగం.
నీవు-నీవు అంటాడు ఆర్తిగా.
ఇది భక్తియోగం.
నేను-నేను అంటాడు సమిష్టిగా.
ఇది జ్ఞానయోగం.
* * *
అజ్ఞాని, జ్ఞాని ఇద్దరూ దేహం నేననే అంటారు.
'దేహంలో నేనున్నాను' అని అంటాడు అజ్ఞాని.
'నాలో దేహముంది' అని ఉంటాడు జ్ఞాని.
* * *
నాస్తికుడు లాగే ఆస్తికుడు కూడా దేవుడు లేడనే అంటాడు...
"ఓ వ్యక్తిగా" దేవుడున్నాడని ఆస్తికుడూ ఒప్పుకోడు.
దేవుణ్ణి "మొత్తం"గా చూస్తాడు ఆస్తికుడు.
* * *
అజ్ఞాని దృష్టి - వస్తువులపై, వ్యక్తులపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది.
జ్ఞాని దృష్టి - వస్తువులతో, వ్యక్తులతో ఉన్నప్పటికీ
'ఉనికి' మీద కేంద్రీకృతమై ఉంటుంది.
* * *
ఒకడు సినిమాను చూస్తుంటే,
ఒకడు ఆధారతెరను చూస్తుంటాడు.
సినిమా చూస్తూ, తెరను మరచేవాడు - నాస్తికుడు.
తెరను చూస్తూ, సినిమా చూడనివాడు - ఆస్తికుడు.
ఇద్దరిదీ సరి కాదు....
1. తెర
2. తెరపై దృశ్యం
రెండూ ఏకకాలంలో జ్ఞప్తిలో ఉంచుకున్నవాడే పరిపూర్ణజ్ఞాని.
అన్నీ ఉంటాయి - ఏమీ ఉండవు.
ఇది జ్ఞాని స్థితి.
* * *
పరిపూర్ణ నాస్తికుడు ఆస్తికుడే.
పరిపూర్ణ ఆస్తికుడు నాస్తికుడే.
No comments:
Post a Comment