# మనసుతో మనం కాసేపు...
🍁జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. హృదయంలో పేరుకునే అయిష్టాలు, నిరాశలు తుడిచివేసి శాంతి పుష్పాల పరిమళాలను ఆస్వాదించడం సాధన చేయాలి. హృదయ క్షేత్రంలో పుట్టి మంచితనం అనే ఎరువుల బలాన్ని స్వీకరిస్తూ దాని ఉనికినే ప్రశ్నించే విషపు మొక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బలహీన క్షణంలో మంచితనపు మొక్కలను అవి కబళించక ముందే- వాటిని పెకలించివేయాలి. అసూయ, అసహ్యం, అరాచకం వంటి నీచ గుణాలే కలుపు మొక్కలు. అవి చొరబడకుండా ఆధ్యాత్మిక జీవనమనే కంచె వేసి కాపాడుకోవాలి.
🍁అనుక్షణం కొత్త ఆలోచనలు వస్తుంటాయి.
ఆదర్శవంతంగా జీవించాలని, నలుగురి మెప్పు పొందాలని ఆశిస్తాం. అందుకు మనసు సహకరించకపోతే అడుగులు ముందుకు పడవు. మనసును మంచి చేసుకుని పని సాధించుకోవాలి మనసు, మాటవినని మరీ అంత దుశ్శీలి కాదు. సాధనతో మంచి లక్షణాలను పుణికి పుచ్చుకొంటుంది. అవకతవకలతో కూడిన జీవన విధానాన్ని ఎంచుకుంటే వచ్చే కష్టనష్టాలు ఏమిటో మనసుకు వివరించాలి. అందుకు హృదయ స్థావరంలో సహజీవనం చేసే బుద్ధి, జ్ఞానాల సహాయం కోరాలి. సహనంతో వివరిస్తే మనసు తప్పక దారికి వస్తుంది. మనసు మీద ఆధిపత్య పగ్గాలను బుద్ధిజ్ఞానాలు స్వీకరించి మచ్చిక చేసుకొని స్నేహితుల్లా ప్రయత్నించాలి. ఫలితం బాగుంటుంది.
🍁రుషులు, యోగులు, మునులు అలా బుద్ధి
జ్ఞానాలను వారి మనసుతో స్నేహం చేయించి విజయాలు సాధించినవారేనని గ్రహించాలి. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అలాంటి పాడుపని చేయడన్న దూషణ వాక్యం విని ఉంటాం. బుద్ధి జ్ఞానాలు తాము రంగప్రవేశం చేయకుండా బాధ్యత అంతా మనసుపై పెట్టినప్పుడు మనసు తీసుకునే నిర్ణయాలు పరిపక్వంగా ఉండవు. జీవితంలో అపజయం పొందిన వ్యక్తి తన మనసును కష్టపెట్టుకుంటే ఉపయోగం ఉండదు. మనసును దృఢపరచుకునే విషయంలో బుద్ధి జ్ఞానాలు అతడి సహాయపడతాయని పండితులు భావిస్తారు. బలవంతురాలు కాని మనసుకు సహాయ సహకారాలు అందించే బాధ్యతను బుద్ధి జ్ఞానాలు తీసుకోవాలన్నది పండితుల భావన.
🍁 మనిషి మనసులో జ్ఞానమనే సూర్యోదయం అయితే అజ్ఞానపు పొగమంచు ఇట్టే తొలగిపోతుంది. స్థాయిని, జ్ఞానాన్ని అనుసరించి జీవితం మనిషికి అందివస్తుంది. పరిపక్వత ఏ స్థాయిలో ఎలా అందివస్తే అలాగే జీవితాన్ని స్వీకరించాలి. హృదయంలో కదలాడే భావాలను హృదయ భాష చెబుతాం. మనకు ఏం కావాలి, ఏం లభిస్తున్నా బేరీజు వేసుకొని లౌకిక పారలౌకిక జీవితాలకు మేలు చేసే అంశాలను ఎంపిక చేసుకోవాలి. మనసు సానుకూలంగా తర్ఫీదు పొందితే పున్నమి ముందు చంద్రకళల్లా ప్రవర్ధమానమై మనిషి బతుకు ఆనందదాయకంగా మారుతుంది.
🍁అది ప్రకృతి ధర్మపరమైన మనిషికి ఇచ్చిన వరం, వాగ్దానం అని మనం గట్టిగా విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి.
🪷⚛️✡️🕉️🪷
No comments:
Post a Comment