*త్రిపురా రహస్యము - 73*
================
(చివరి భాగం)
*స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము*
*గ్రంధ సారాంశము - 2*
ప: మరి తమ ఆత్మే అయిన ఆ సుఖాన్ని అజ్ఞానులు ఎందుకని తెలుసుకోలేరు ?
ద: స్త్రీ వల్ల ఒకసారి, ధనంవల్ల ఒకసారి ఇలా సుఖాలు కలిగినప్పుడు, స్త్రీ, ధనము విడివిడిగా కనిపిస్తాయి. అందుచేత వాటివల్ల కలిగే సుఖాలు కూడా విడివిడిగానే ఉంటాయి. అవేవీ శాశ్వతం కాదు. ఆత్మ సుఖమే శాశ్వతమైనది. ఈ విషయం తెలియని అజ్ఞాని ఆత్మ సుఖాన్ని పొందలేడు.
ప: ఏదీ లేదు”. అనేది ఎందుకు ప్రమాణ సిద్దాంతము కాదు?
ద : జగత్తు ఉన్నది అనటానికి ఒక జ్ఞానముండాలి. లేదు అనటానికి కూడా జ్ఞానముండాలి. అది ఎందుకు లేదో చెప్పాలి. అందుచేత ఈ జగత్తులోనే ఉంటూ, జగత్తే లేదంటే తానే లేనివాడౌతాడు.
ప: అద్వైతము అంటే ద్వైతాన్ని నిషేధిస్తున్నారు. అసలు ద్వైత స్వరూపం ఏమిటి?
ద : ద్వైత రూపమైన జగత్తు దర్పణ ప్రతిబింబంలాంటిది. దర్పణంలో ఉన్న ప్రతిబింబాన్ని సత్యము అనిగాని, అసత్యం అనిగాని అనలేము. జగత్తు కనిపిస్తోంది.
అందుకని అది అసత్తు కాదు. నశిస్తుంది. అందుకని సత్తూ కాదు.
అందుకే జగత్తు అనిర్వచనీయమైనది. జగత్తు త్రికాలసత్యం కాదు. పరమాత్మ స్వరూపమే జగత్తు. అంతేకాని వేరు కాదు. పరమాత్మ జగత్తు వేరువేరు అనటమే ద్వైతము. ఆ రెండూ ఒక్కటే అని చెప్పటమే అద్వైతము.
ప్రకృతి జడము. పరమాత్మ చైతన్యము. ఆ చైతన్యమువల్లనే జడమైన ప్రకృతి చవైతన్యవంతమవుతున్నది. అందుచేత ఉన్నది అద్వైతమే.
పరశురామా ! ఇక్కడ ఉన్నది పరాచితి ఒక్కటే. ఆమే త్రిపురాదేవి. ఆమే పరబ్రహ్మ స్వరూపిణి. సృష్టిస్థితి లయకారిణి. ఆది మధ్యాంతరహిత కర్మపరిపక్వం కాని జీవులకు తిరిగి జన్మనిచ్చి, వారికి కూడా ఆత్మస్వరూపం తెలియ చెయ్యాలనేదే ఆమె సంకల్పం. అందుకే ఈ సృష్టి జరుగుతోంది. జీవులు వారివారి కర్మానుసారము స్వర్గనరకాలు అనుభవించి, కర్మఫలాన్ని అనుభవించటానికి మళ్ళీ ఇక్కడ జన్మిస్తాయి.
జన్మలలో మానవజన్మ దుర్లభమైనది. అందులోనూ బ్రాహ్మణజన్మ మహాదుర్లభమైనది. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతిమానవుడు సత్కార్యాలనే చెయ్యాలి. ముందుగా కామ్యకర్శ్మలు చెయ్యాలి. తద్వారా మనసు నిశ్చలమవుతుంది.
ఆ తరువాత నిష్కామ్యకర్మలు చెయ్యాలి ఆ తరువాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. దీనికి పూర్వజన్మ కృతము కావాలి. మంచి గురువు లభించాలి.
వీటన్నింటికీ మించి “స్వస్వరూప జ్ఞానం కావాలి” అనే పట్టుదల కావాలి, ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం జరిగిందో అప్పుడు అతడి బంధనాలన్నీ తెగిపోతాయి. బంధనాల నుండి విముక్తుడు కావటమే ముక్తి. అదే మోక్షము. అంటె జీవాత్మ పరమాత్మలో లీనం కావటం.
ఇది విన్న తరువాత కూడా ఇంకా మోహం పోలేదు. అంటే వాడు వట్టి మూర్ఖుడు అన్నమాట. వాడు కఠినశిల లాంటివాడు. వాడికింక జ్ఞానం రాదు.
త్రిపురా రహస్యాన్ని ఒకసారి విన్నంత మాత్రానే జ్ఞానం కలుగుతుంది. మందబుద్ది రెండుసార్లు వింటే చాలు. పరశురామా ! దీనిలోని జ్ఞానము, సాధన, ఫలితము అన్నీ పూర్తిగా నీకు వివరించాను.
దీన్ని విన్నంత మాత్రం చేతనే విజ్ఞానం కలుగుతుంది. వ్రాస్తే బాహ్యేంద్రియ దోషాలు పోతాయి. ఎప్పుడూ దీన్ని చదువుతూ, '“ఆపరాచితే నేనూ అని భావించి. అనుభవ పూర్వకంగా తెలుసుకుంటే మోక్షం కలుగుతుంది.
కాబట్టి నువ్వే పరమేశ్వర స్వరూపమని భావించి మోక్షమార్గంలో చరించు” అన్నాడు దత్తాత్రేయుడు.
ఆ మాటలు విన్న పరశురాముడు గురువైన దత్తాత్రేయుణ్జి పరిపరివిధాల ప్రశంశించి, ఆయనకు ప్రదక్తిణలు చేసి, పూజించి, చిరకాలము సాధన చేసి పరమాత్మలో ఐక్యమైనాడు. అంటూ త్రిపురా రహస్యమనే జ్ఞానఖండంలోని చివరిదైన ఇరవై రెండవ అధ్యాయాన్ని కూడా పూర్తిచేశాడు రత్నాకరుడు.
త్రిపురా రహస్యాన్ని ఆసాంతం భక్తిశ్రద్ధలతో విన్న అతని శిష్యులు కృష్ణశర్మ, నారాయణభట్టులు కూడా గురువుగారిని తగురీతిన సత్కరించి, ఆయన ఆశీస్సులు అందుకుని సెలవు తీసుకున్నారు.
హరితస గోత్రీకుడు శ్రీ క్రోవికృష్ణమూర్తి శ్రీమతి సత్యపర్వతవర్థనమ్మల జ్యేష్టపుత్రుడు అయిన క్రోవి పార్థసారథి సర్వజనామోదము పొందునట్లుగా అతిసులభ శైలిలో వ్రాసిన “త్రిపురా రహస్యదీపిక” అను జ్ఞానఖండము సంపూర్ణం 🙏🏻
ఓం తత్సత్...🙏🏻
🪷⚛️✡️🕉️🪷
*రేపటినుంచి కాశీఖండం ప్రారంభమౌతుంది*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment