Saturday, March 16, 2024

దాతృత్వం...!!

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                *దాతృత్వం...!!*
                  ➖➖➖✍️

*దాత పిసినారి. చచ్చినా భూమిపై దేన్నీ వదిలిపెట్టడు. అంతా దానం చేసి వెళ్ళిపోతాడు.*

 *పిసినారి గొప్ప త్యాగి. చచ్చిన తరవాత అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. తనవెంట ఏదీ తీసికొని వెళ్ళడు.*

*దాతను, పిసినారిని గురించి పూర్వకవులు చేసిన చమత్కార వ్యాఖ్య ఇది!*

*దానం చేయకపోతే మరుసటి జన్మలో దరిద్రం వస్తుందని, దానాలు చేస్తే తరవాతి జన్మలో సంపదలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతాయి.*

*దాతృత్వం అనేది నిజంగా ఒక గొప్ప గుణం. లోకంలో ఉదార చరితులైన మహాత్ములు ప్రాణులందరినీ తమవారిగానే భావించి దానాలు చేస్తారని, సంకుచితమైన మనసు కలిగిన అల్పులు మాత్రం ప్రాణుల్లో స్వపర భేదాలను సృష్టించుకొంటూ భేదభావం ప్రదర్శిస్తారని ప్రాచీన నీతి చెబుతోంది.*

*దానం చేసేవాడి చేయి ఎప్పుడూ ఉన్నతంగా ఉంటుంది. యాచించేవాడి చేయి ఎప్పుడూ కిందనే ఉంటుంది.*

*ఇదీ దాతకు, యాచకుడికి ఉన్న తేడా!సముద్రం భూమి అంతా విస్తరించి ఉంది. కానీ ఏం లాభం? ఏ ప్రాణికైనా దాహం వేస్తే గుక్కెడు మంచినీళ్లను కూడా ఇవ్వలేదు.*

*ఎక్కడో మూలలో ఉన్న చేదబావి చిన్నదే. కానీ దాహం వేస్తే అందరూ ఆ చిన్నబావినే ఆశ్రయిస్తారు. దాత కూడా చేదబావిలాంటివాడే.* *              పిసినారి సముద్రంతో సమానుడు!*

*దానం చేయాలనే ఆలోచన రాగానే వెంటనే దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.*

*ఒక చేయినుంచి మరొక చేతిలోనికి తీసుకొనేలోగా బుద్ధి మారిపోవచ్చు. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానం చేయమంటాయి ధర్మశాస్త్రాలు!*

*అమోఘ దానశీలంతో చరిత్రలో నిలిచిపోయిన బలి, శిబి, దధీచి, కర్ణుల వంటివారు చేసింది అదేనని గ్రంథాలు చెబుతున్నాయి.*

*సంపాదించిన ధనానికి మూడే మార్గాలుంటాయి...*

*వాటిలో మొదటిది, శ్రేష్ఠమైంది దానమని,*

*రెండోది మధ్య మార్గమైన భోగమని, ఈ రెండూ చేయకపోతే*

*మూడో మార్గం నశించిపోవడమేనని భర్తృహరి సుభాషిత త్రిశతిలో అంటాడు.*

*కనుక దానం చేసి శ్రేష్ఠులుగా నిలిచిపోవాలని సందేశం. పాలు ఇవ్వడం ద్వారా గోవులు, ఫలాలను ఇవ్వడం ద్వారా చెట్లు... ఎప్పుడూ పరోపకారమే చేస్తాయి.*

*అలా జీవించడం ప్రశంసార్హం. తేనెటీగలు ఎంతో శ్రమించి, పుప్పొడులను సేకరించి తేనెలను దాచుకుంటాయి.*

*కానీ, ఏం లాభం? ఎంతగా దాచినా, ఆ తేనెలను మనుషులు దోచుకుంటారు. అవసరానికి మించి ఎంతగా దాచినా, అది పరుల పాలవుతుంది.*

*మనిషి తనకు సంపదలు పుష్కలంగా ఉన్నప్పుడే దానధర్మాలు బాగా చేయాలి. సంపదలు ఎప్పుడు నశించిపోతాయో ఎవరికీ తెలియదు.*

*అవి వ్యర్థంగా నశించిపోయాక విచారించి లాభం లేదు. కనుక కలిగి ఉన్నప్పుడే దానం చేయాలి.*

*ఆర్తులకు దానం చేయడం ఉపయోగం. అందుకే పాత్రోచిత దానం ఫలాన్నిస్తుంది. ఆకలిగొన్నవాడికి ఆహారం పెట్టాలిగాని, అజీర్ణమైనవాడికి ఆహారం పెడితే ఏం ప్రయోజనం?*

*పరోపకారం కోసమే మేఘాలు వర్షిస్తాయి. పరోపకారం కోసమే చెట్లు ఫలాలనిస్తాయి. పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి. మనిషికి భగవంతుడు ఇచ్చిన అమూల్య శరీరమూ పరోపకారానికే ఉపయోగపడాలి.*

*బలవర్ధకాలైన ఆహారాలతో శరీరాన్ని ఎంతగా పోషించినా, శారీరక శక్తిని పరోపకారం కోసం వినియోగించకపోతే, కొవ్వు పెరగడానికి తప్ప దేనికీ ఉపయోగపడదు.*

*దాతృత్వం ఒక వరం. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది. ప్రపంచంలోని చరాచరాలన్నీ అనాదిగా అందిస్తున్న సంపదలే నేడు మనిషికి సౌఖ్యజీవన సాధనాలైనాయి.*

*చేసిన దానం తరతరాలూ చెరిగిపోకుండా నిలుస్తుంది. చివరికి మిగిలేది అదే..!!*✍️
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment