ఉత్తమ భూషణం
'కామ క్రోధాదులు మనిషి వెన్నంటి ఉండే దుర్గుణాలు. వాటిని సహనంతో వదిలిం చుకొని ముందుకు నడిచే మనిషే మనీషి అవుతాడు' అని పురాణ సాహిత్యం చెప్పింది. 'అలా మహాత్ముడిగా మారాలంటే ఎంతో చాకచక్యం అవసరం' అనీ అది సూచిస్తోంది. ఇలా అనడానికి కారణం మానవ నైజం. ఎవరైనా తనకు నచ్చినట్లు ప్రవర్తించకపోతే వెంటనే కోపం వస్తుంది. కోపం వల్ల జ్ఞాపకశక్తి నశిస్తుంది. అందు వల్ల ఇంగితాన్ని కోల్పోతాం. ఆవేశాన్ని దిగమింగుకొని సంయమనంతో ఆలోచించి సహనంగా ప్రవర్తించి నిర్ణయం తీసుకునే శక్తి రావడానికి చాలా సాధన కావాలి.
ఉత్తముడికి కోపం క్షణంలో మాయమవుతుందట. మధ్యముడి కోపం ఓ ఘడియ వరకు, అధముడికి ఒక రాత్రి పగలు వరకు, పాపిష్ఠివాడి కోపం మాత్రం జీవితాంతం ఉంటుందన్నది పెద్దల మాట. మనసులో పుట్టిన క్రోధాన్ని పాము కుబుసంలా వదిలి పెట్టాలి. భగభగ మండే క్రోధాగ్నిని ఓర్పు అనే నీళ్లు చల్లి చల్లార్చాలి. అది చెప్పినంత సులువుగా అబ్బే లక్షణం మాత్రం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. సాధనతో ఓర్పును అలవరచుకోవాలి. ధార్మిక ప్రవర్తనతో నమ్మకంతో ఓర్పును సాధించవచ్చు. తన ధర్మ ప్రవర్తనతో సహనశీలిగా ఉన్న వ్యక్తి కాబట్టే రాముడి కథ ఇన్ని యుగాల తరవాతా మనకు ప్రాతఃస్మరణీయమైంది. భారత రామాయణాల్లోని ఎన్నో పాత్రలను పరిశీలించడం ద్వారా సహనం, సంయమనం వంటి లక్షణాలను అలవరచుకోవడాన్ని చేయవచ్చు. సాధన
ధర్మరాజు దుర్యోధనుడి కొలు
సీతు
వులో జూదం ఆడేటప్పుడు, అజ్ఞాత వాస సమయంలోను ఎప్పుడో ఒక ప్పుడు సహనం కోల్పోయి ప్రవర్తించి ఉంటే దాని పర్యవసానం ఏ విధంగా ఉండేదో ఊహించవచ్చు. హనుమంతుడు సీతాన్వేషణలో సముద్రాన్ని దాటే క్రమంలో సురస అనే అతి భయంకర రాక్షసి అడ్డగించినప్పుడు ఎంతో సంయమనంతో చేతులు జోడించి 'సీతామాతను వెతుకుతూ వెళ్తున్నాను... దారివ్వు తల్లీ' అని ప్రార్ధిం చాడు. మాట వినని సురస నోటి నుంచి తన శరీరాన్ని అంగుష్ఠమాత్రంగా చేసి లోపలికి వెళ్ళి అంతే వేగంతో బయటకి వచ్చి వినయంగా ఆమెకు చేతులు జో డించాడు. ఆంజనేయుడి సౌమ్యతకు, సహనానికి సురస ఆనందించి ఆశీర్వదిం చింది. రావణుణ్ని అంగీకరించకపోతే చంపి తినేస్తామని బెదిరించిన రాక్షస స్త్రీల హింసలను ఓర్పుతో భరించి, సీత రాముడి కోసం ఎదురుచూసింది. అందుకనే భూమాతకు ఉన్న ఓర్పు ఆమె కుమార్తె సీతమ్మకుంది అంటుంది రామాయణం.
విత్తు నాటిన మరునాటి నుంచే ఫలసాయం కోసం ఎదురు చూడటం ఎంత వరకు సమంజసం? దానికి నీరు అందించి, చీడపీడల నుంచి రక్షించి ఓర్పుగా సంరక్షిస్తేనే ఫలసాయం చేతికొస్తుంది. స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను అర్పించిన మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా వంటివారి చరిత్రలు చదవడం ద్వారా ఓర్పు, సహనాలను అలవరచుకోవచ్చు.
సాధారణంగా మానవులు అలంకారంగా ఆభరణాలను ధరిస్తారు. కానీ, లోకంలో ఉత్తములైనవారు ఓర్పును భూషణంగా ధరిస్తారని మహాభారతంలో విదురుడు చెబుతాడు. కొంత సమయం ఓర్పుతో నిగ్రహంతో వేచి చూస్తే ఎన్నో యుద్ధాలను, నష్టాలను అరికట్టవచ్చు. పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే లోకోక్తి కూడా ఉంది. ఇదే విషయాన్ని బోధించే విధంగా 'దాంతునికైనా వేదాంతునికైనా దార, సుతులు, ధన ధాన్యములుండినా, సారకు జపతప, సంపద కలిగినా శాంతమూ లేక సౌఖ్యము లేదు' అంటాడు త్యాగయ్య. అందుకనే ఈ లోకంలో ఉన్నత స్థాయికి చేరుకునే వ్యక్తికి ఉండాల్సిన ఉత్తమ భూషణం- ఓర్పు.
గంటి ఉషాబాల
No comments:
Post a Comment