Friday, March 15, 2024

జీవితంలో ఏది సాధించాలన్నా ధర్మ బద్ధంగా కష్టపడి ప్రయత్నించాలి

 జీవితంలో ఏది సాధించాలన్నా ధర్మ బద్ధంగా కష్టపడి ప్రయత్నించాలి – రామాయణ, భారత, భాగవత, భగవద్గీత తదితర పురాణేతిహాసాలన్నీ నిర్ద్వందంగా చెప్పే విషయం ఇది. రాముడంతటి వాడే కష్టపడి యుద్ధం చేసి రావణ సంహారం చేసాడు. కృష్ణుడు మహావీరుడైన అర్జునుడికి గీతాబోధ చేసి మరీ 18 రోజులు యుద్ధం చేయించాడు. 

కానీ ప్రస్తుత సమాజంలో అందరూ రాత్రికి రాత్రే వారి కోరికలన్నీ తీరిపోయి, సిరి సంపదలు వచ్చే దారుల కోసం వెతుకుతూ జీవితమంతా వృధా చేసుకొంటున్నారు. ఎవరైనా మంత్రాలు, యంత్రాలు, తాయెత్తులు ఇస్తామంటే అప్పు చేసి మరీ వేలకు వేలు సమర్పించుకొని కొత్త కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారు. 

పురాణాలన్నీ కాలక్షేపానికి చదువుతారు. అర్ధం చేసుకొనే ప్రయత్నం శూన్యం, ఆచరణ ప్రశ్నే లేదు. మాకూ పురాణాలు తెలుసనే విజ్ఞాన ప్రదర్శనలో, అహంకారంతో అర్దం లేని వాదనలు చేయడంలో ముందుంటారు. రాముడికీ, కృష్ణుడికీ తెలియని కిటుకులు, రహస్యాలు, విజయానికి దగ్గరి దారులు మనకు తెలిసిపోతాయనుకోవడం అమాయకత్వమా, మూర్ఖత్వమా? లేక మంత్రాలు, యంత్రాలు అమ్ముకొనే వారంతా విశ్వామిత్రుడు, వశిష్ఠుల వంటి మహర్షుల కన్నా గొప్ప గురువులని నమ్మకమా?

రాముడు, కృష్ణుడు అంత కష్టపడినా, వారికి విజయం చేకూరింది వారు దైవస్వరూపులనే  కారణంతో కాదు. వారి యుద్ధం, వారి ప్రయత్నం ధర్మబద్ధమైనది కనుక విజయం వారిని వరించింది. వారి విజయం దైవికం ఐతే యుద్ధం అవసరమే ఉండదు కదా?! అప్పుడు రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఏవీ ఉండేవి కావు.

వేదాలు, పురాణేతిహాసాల వంటి అఖండ జ్ఞాన నిధిని మహర్షులు మానవాళికి అందించింది వాటి ద్వారా మానవుడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నేర్చుకోవాలని. కానీ ఈ విషయం గుర్తించలేని నేటి మానవుడు, అసలైన ఆధ్యాత్మిక బాటను వదిలి, అజ్ఞానాంధకారాలతో తప్పుల మీద తప్పులు చేస్తూ - ఈర్ష్యాసూయలనే ముళ్ళు, తుప్పలు, నిండిన స్వార్థపు దారిలో అగాధం వైపే అడుగులు వేస్తూ పతనం అంచుకు చేరుతున్నాడు.

పతనం చెందకుండా కాపాడుకోవాలంటే ఉన్న మహత్తర అవకాశం, తక్షణ కర్తవ్యం - ఆధ్యాత్మిక బాటను చేరుకోవడం, ధర్మాచరణ చేయడం. అధర్మమైన, స్వార్ధపు కోరికలతో - దేవుడికి వింత మొక్కుబడులు, ఆర్భాటపు కానుకలు సమర్పిస్తూ దేవుడిని అపవిత్రం చేసి మరింత పాపం మూటగట్టుకొని, వంశంలో తరువాతి తరాలకు తగిలే శాపాలకు బాధ్యులు కాకుండా - వంశాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం! 

సర్వేజనాః సుఖినోభవంతు🌺🙏🏻🌸

No comments:

Post a Comment