Tuesday, October 8, 2024

 🕉️ ఓం నమః శివాయ 🕉️

నువ్వెంత సంపాదించినా నీపేరు ఎవడు చెప్పుకొడు............!!
శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, ధర్మరాజు, నలుడు, ప్రహ్లాదుడు, చివరికి అవసరం కోసమే దానం చేసిన కర్ణుడు, శ్రీకృష్ణదేవరాయలు అని కొందరి పేర్లు చిరకాలం ఎందుకు ఉన్నాయి? 
 వాళ్ళు చేసిన దానధర్మాలు చిరకాలం ఉండిపోయాయి. కొందరివి కలియుగాంతం వరకు ఉంటాయి. మరి కొందరు ఎన్ని యుగాలైనా అలానే చిరస్థాయిగా ప్రజల మనసుల్లో ఉండిపోతారు. అదే దానధర్మాలకి ఉన్న గొప్పతనం.

వాళ్ళు ఎంత సంపాదించారు అని ఎవరు అడగరు. ఎందుకంటే ఆనాటి యుగలలో కూడా వందల వేల కోటాను కోట్లు సంపాదించిన కోటీశ్వరులు ఉన్నారు. కానీ వారికి పెరు రాలేదు. ఎందుకంటే దానం చేయలేదు కనుక.. కోట్లు వుండిఏమి లాభం. తినడానికి దేహం సహకరించనప్పుడు? 

చేసేదానం పిడికెడు అయినా చాలు అర్హుడికి దానం చేయాలి. అప్పుడు కీర్తి వచ్చి చేరుతుంది. అనర్హుడికి దానం చేస్తే ఉన్నపేరు పోతుంది. ఆస్తులు పోతాయి.

వినయంతో కూడిన దానం, స్వార్థరహితమైన దానం, అర్హుడికి మాత్రమే చేసే దానం, నిజాయితీగా సంపాదించిన దానితో చేసే దానం, భక్తితో అత్యంత శ్రద్ధతో చేసే దానమే పవిత్రతను ఇస్తాయి.

దానానికి సనాతన ధర్మంలో ప్రముఖ స్థానం ఉంది. దానాలు చాలా రకాలు. అన్న దానం, హిరణ్యదానం, వస్త్ర దానం, విద్యా దానం, భూదానం, గోదానం ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే ఆకలితో ఉన్న వానికి పిడికెడు అన్నం పెట్ట‌డాన్ని మించిన దానం మరొకటి ఉండదు. భర్తృహ‌రి సుభాషితాల్లో దానం గురించి పేర్కొన్నాడు. మన చేతులు బంగారు మురుగులు ధరించడంతో ప్రకాశించవు. దానం చేతే అవి ప్రకాశిస్తాయని ఆయన ఒక శ్లోకంలో పేర్కొన్నారు. దానం గొప్ప కోసం చేయకూడదు. దేవాలయాల్లోనో, కళ్యాణ మంటపాల్లోనో గోడలకు రంగులు వేయించి, సీలింగ్‌ ఫ్యాన్లు పెట్టించి పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్లు, ఫ్లెక్సీలు వేయించి మరీ ఈ దానాలు చేస్తుంటారు. దీనివల్ల ఎంతో కొంత పుణ్యం లభిస్తుంది కాని పూర్తి స్థాయిలో పుణ్యం లభించదని గ్రహించాలి. దానం చేయడం మన జీవితంలో ఒక భాగం కావాలి. నిరాపేక్షగా, నిష్కామంగా దానం చేయాలి. అలాగే దానం చేసిన మర్నాటి నుంచే దాని వల్ల వచ్చే పుణ్యం గురించి అంచనాలు వేయకూడదు. తనకున్న దానిలో ఎంతో కొంత దానం చేయాలి. దానం వారి స్తోమ‌త‌కు తగ్గట్టు ఉండాలి. శక్తికి మించి దానం చేయడం పనికిరాదు. డబ్బు ఉండి కూడా తక్కువ దానం చేయరాదు. మన పురాణేతిహాసాల్లో దానం గురించి అనేక కథలు న్నాయి. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దధీచి, రంతి దేవుడు, కర్ణుడు మొదలైన ఎందరోదాతలు ఉన్నారు. కర్ణుడి దానం గురించి ఒక విచిత్రమైన జనశ్రుతి కథ ఉంది. ఎట్టి పరిస్థిితుల్లోనైనా దానం చేయాలని చెప్పే కథ ఇది.
దుర్యోధనుడు కర్ణుణ్ని అంగరాజ్యానికి రాజును చేశాడు. అతనికి కర్ణుడు ప్రియమిత్రుడైనా దాతగా అతనికున్న పేరు చూసి దుర్యోధనుడు ఈర్ష్య పడ్డాడు. ఈర్ష్య అతని సహజ గుణం. తను చక్రవర్తి, కర్ణుడు ఒక రాజు మాత్రమే. అయితే దాతగా అతనికి వచ్చినంత కీర్తి తనకు లేదు అని ఆతని బాధ. తాను కూడా కర్ణునిలా గొప్ప కీర్తి పొందాలని భావించాడు. విరివిగా దానాలు చేయడం ప్రారంభించాడు. ఎక్క డెక్కడివారో వచ్చి దుర్యోధనుని నుంచి దానాలు పొందుతుండేవారు. తాను గొప్ప దాతనయ్యానని దుర్యోధనుడు తనకు తాను సంతృప్తిపడసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచింది. ఒకసారి దుర్యోధనుని రాజధానిలో కొన్ని రోజుల పాటు కుండపోతగా వర్షాలు పడ్డ్డాయి. వీధులు జలమయం అయ్యాయి. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు దుర్యోధనుని వద్దకు వచ్చి తాను పెద్ద యాగం తలపెట్టానని, అందుకు కొన్ని బండ్ల ఎండు కట్టెలు కావాలని కోరాడు. దుర్యోధనుడు ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఎండు కట్టెలు లభించలేదు. ఆ బ్రాహ్మణుని కోరిక తీర్చలేక నిస్సహాయత వ్యక్తం చేశాడు. ఆ బ్రాహ్మణుడు ఆ సమయంలో ఆ రాజ్యంలోనే ఉన్న కర్ణుని వద్దకు వెళ్లి ఎండు కట్టెలు దానం చేయమని అడిగాడు. కర్ణుడు కూడా ఎండు కట్టెల కోసం ఎంతో ప్రయత్నించాడు. అవి ఎక్కడా దొరకలేదు. వెంటనే అతను అక్కడ తాను నివసిస్తున్న భవనంలో కొంత భాగాన్ని కూలగొట్టించి దానిలో లభ్యమయ్యే కలపను ఆ బ్రాహ్మణునికి ఇచ్చి అతని కోరిక తీర్చాడు. అది తెలుసుకున్న దుర్యోధనుడు నివ్వెర పోయాడు. తాను పెద్ద చక్రవర్తిని అయినా, గొప్ప ఐశ్వర్యం ఉన్నా ఆ బ్రాహ్మణుని కోరిక తీర్చలేకపోయానే అని సిగ్గుపడ్డాడు.
దుర్యోధనునిది గొప్ప కోసం, కీర్తి కోసం తెచ్చి పెట్టుకున్న దాన గుణం. కర్ణునికి అది సహజ గుణం. మానవుడు ధర్మం తప్పకుండా ధనం ఆర్జించవచ్చు. కాని దానినంతటినీ కూడబెట్టి తనే అను భవించాలను కోవడం కూడదు. కొంత సమాజ హితం కోసం వెచ్చించాలి. దాన ధర్మాలు చేయకుండా ఎవరు ధనం కూడబెడతారో అతనిని దొంగగా భావిస్తాయి మన ధర్మ శాస్త్రాలు. తనకున్న దానిలో కనీసం 6వ శాతం దానం చేయాలంటాయి శాస్త్రాలు. తనకున్న దానిలో తృణమో, పణమో ఇతరులకు దానం చెయ్యటం విధ్యుక్త ధర్మంగా అందరూ భావించాలి.

నం చేయాలని ప్రముఖంగా చెబుతుంది, సనాతన ధర్మం..
’పెట్టందే పుట్టదు’ అనీ అంటుంది. ’చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంతా’ అంటారు. 
’పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్దీ బిడ్డలూ’ అనీ అంటుంది లోకం. ఇలా దానం యొక్క గొప్పతనాన్ని చెబుతారు. 
దానం చేసినవారిలో ప్రముఖులనీ చెబుతారు. దధీచి తన వెన్నెముకనే దానం చేశారు, ఇంద్రుని వజ్రాయుధం కోసం. బలి చక్రవర్తి మూడడుగుల నేల కావాలంటే దానం చేసి పాతాళానికెళ్ళేరు, శిబి చక్రవర్తి తన తొడ మాంసం కోసి పావురాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేశారు, సరిపోకపోతే తానే సమర్పించుకోడానికి సిద్ధమయ్యారు. నేటి కాలానికీ ప్రపంచంలో కలిగినవారు తమ సొత్తులో కొంత లేక అంతా దానం చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం.
ఎవరికైనా కావలసింది పిడికెడు మెతుకులు బతికున్నపుడు,చస్తే తగలబెట్టడానికో పూడ్చి పెట్టడానికో కావలసిన చోటు ఆరడుగుల నేల. ఎవరూ పోయేటపుడు కూడా ఏం పట్టుకుపోరు. అన్ని మతాలూ దానం చేయమనే చెబుతాయి.
అపాత్రులకు దానం చేయకూడదు. దానంతీసుకునేవారు మనకంటే తక్కువవారనుకోవడం చాలా తప్పు, వారు, మనం దానం చేయడానికి వీలు కల్పించినందుకు సంతసించాలి. కలిగినంతలో దానం చేయాలి, శక్తికి మించి దానం చేయకూడదు. 
కలిగినవారు దానం చేయకపోవడం తప్పు, కలగనివారు శక్తికి మించి దానం చేయడం తప్పు. దానం ఏ రూపంలోనైనా ఉండచ్చు, ఒక్క ధనమిస్తేనే దానం కాదు. దశదానాలంటారు. అన్నిటిలోనూ గొప్పదైనది అన్నదానం వెంటనే ఫలితమిచ్చి ప్రాణాన్ని నిలుపుతుంది, ఆ తరవాతది విద్యాదానం. చెప్పుకుంటూపోతే చాలా ఉంది.

🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏

No comments:

Post a Comment