🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
ధ్యానం - కుండలినీ శక్తి జాగృతి - వైజ్ఞానిక విశ్లేషణ - మెదడు - తరంగాలు :
సంకలనం : భట్టాచార్య
ధ్యానం మానసిక ప్రశాంతతను చేకూర్చుతుంది . ధ్యానం మన మనస్సును స్వాధీనంలోకి తెస్తుంది. మనస్సును స్వాధీనం చేసుకున్న తరవాత మన మనసులోని ఆలోచనలోనే తరంగాలన్నీ ఆగిపోవడమే కాక, మనలోని చేతనా స్పృహ విస్తరిస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడల్లా మానసికంగా పెరుగుదలను పొందుతుంటాం. ప్రారంభంలో కాస్త కష్టమైనప్పటికీ, రాను రాను తీవ్రతరం చేస్తే ధ్యానం కుదురుతుంది. అది క్రమేణా సమాధికి దారి తీస్తుంది. అప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచనే ఉండదు. శారీరక స్పృహ కూడా ఉండదు. అది నిర్వికల్ప సమాధి.ఆ సమయంలో మన మనసుకు, తద్వారా మన శరీరానికి గాఢమైన విశ్రాంతి లభిస్తుంది.
ఈ విషయం గురించే శాస్త్రజ్ఞులు మెదడుపై పరిశోధనలు జరిపి, ధ్యానం చేస్తున్నప్పుడు మెదడులో ఎటువంటి ఫలితాలుంటాయనే విషయాన్ని విపులీకరించారు. మెదడులో ఫ్రంటల్ లోబ్ , పెరైటల్ లోబ్ , థాలమస్, రెటిక్యులార్ ఫార్మేషన్ అంటూ నాలుగు భాగాలున్నాయి. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ నాలుగు భాగాలలో నాలుగు విధాలైన మార్పులు జరుగుతుంటాయనీ, ఫలితంగా మెదడు పూర్తి విశ్రాంతి పొందుతుంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
ఫ్రంటల్ లోబ్ : మనం వేసే పక్కా ప్రణాళికలకు మెదడులోని ఈ భాగమే కారణం. మనలోని చైతన్యానికి, భావోద్వేగాలకు ఈ భాగమే ప్రధాన కారణం. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ భాగం నిశ్చలమవుతుంది. ఫలితంగా మన మనసు తేలికపడినట్లవుతుందన్న మాట.
పెరైటల్ లోబ్ : ఈ భాగం మన చుట్టు ప్రక్కలనున్న విషయాలను మెదడుకు చేరవేస్తుంటుంది. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ భాగం కూడా నిశ్చలమవుతుంది . మనసులోని భారం తగ్గుతుంది.
థాలమస్: ఒకే విషయం పై దృష్టిని పెట్టేలా చేస్తుంది. ఇతరత్రా ఆలోచనలు లేకుండా చూసుకుంటుంది. ధ్యానం చేసేటప్పుడు థాలమస్ లోని ఆలోచనల పరంపరల వేగం తగ్గి ప్రశాంతత నెలకొంటుంది.
రెటిక్యులార్ ఫార్మేషన్ : శరీరంలోని వివిధ భాగాల నుండి వచ్చే సమాచారంతో మెదడుకు హెచ్చరికలు చేస్తుంటుంది . ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సంకేతాలు నిలిపివేయబడి , మెదడు విశ్రాంతిని పొందుతుంది. మొత్తంగా ఇవాళ్టి యువతరం భాషలో ధ్యానం గురించి చెప్పాలంటే, మన శరీరమనే హార్డ్ వేర్ లో మనసనే సాఫ్ట్ వేర్ ఉంది. దాంట్లోకి యాంటీ వైరస్ ను ఎక్కించడమే ధ్యానం.
ఏకాగ్రత, ధ్యానంతో..... విశ్రాంత స్థితి కలిగి కుండలినీ వికాసం జరుగుతున్నప్పుడు, కొన్ని అనుభవాలు, రహస్యాలు తెలుస్తాయి. మెదడులోని నాడీ వ్యవస్థ, శక్తి ప్రవాహాలలో కొన్ని అనూహ్యమైన మార్పులు జరుగవచ్చు. విజ్ఞానశాస్త్రం ప్రకారము, మెదడు ఆల్ఫా, బీటా,థీటా, డెల్టా తరంగాలను ప్రసరింప జేస్తూ ఉంటుంది.అవి ఈ క్రింది విధంగా ఉంటాయి.
ఆల్ఫా తరంగాల ఫ్రీక్వెన్సీ : సెకెనుకు 8 నుండి 14 సైకిల్స్
బీటా తరంగాల ఫ్రీక్వెన్సీ : సెకెనుకు 14 నుండి 24 సైకిల్స్
థీటా తరంగాల ఫ్రీక్వెన్సీ : సెకెనుకు 4 నుండి 7 సైకిల్స్
డెల్టా తరంగాల ఫ్రీక్వెన్సీ : సెకెనుకు 0.5 నుండి 5 సైకిల్స్
భావోద్వేగాలు ఏవీ లేకుండా ప్రశాంతతతో ఉన్నప్పుడు, మెదడు డెల్టా తరంగాలను వెలువరిస్తుంది. మెదడు తరంగాలు ఆల్ఫా, బీటా, థీటా, డెల్టా స్థితులలో మార్పులు జరిగినప్పుడు, కొన్ని శారీరక - మానసిక మార్పులు , కొన్ని రకాల అనుభవాలు జరుగుతాయి. ఆల్ఫా, బీటా స్థితులలో ఉన్నప్పుడు ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. మూడు గంటల కంటే ఎక్కువ సమయం ధ్యానంలో ఉన్నప్పుడు, వింత వింత అనుభవాలు కలుగుతాయి. వాటితో ఆగిపోకుండా సమాధిస్థితిని చేరుకోవడానికి గాఢమైన సాధన కొనసాగించాలి.
తాంత్రిక సాధన లో "relaxation" మాత్రమే కాకుండా, నాడీ వ్యవస్థ కూడా ఉద్దీపన చెందుతుంది. అతి వేగవంతమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. మారుతున్న భావోద్వేగాలు, చల్లదనం , "absorption" ఇలాంటి విభిన్నమైన అనుభవాలు తంత్రసాధనలో కలుగుతూ ఉంటాయి. మెదడులో అలౌకికానందం , వర్ణనాతీతమైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు కుండలినీ శక్తి జాగృతిని కలిగించడానికి పశుత్వ లక్షణాలను ప్రేరేపించే "మెడుల్లా అబ్లాంగేటా" కు సంబంధించిన మూలాధార, స్వాధిష్ఠానాలను జయించాలి.
ధ్యానంలో నాడుల ద్వారా, చక్ర స్థానాల ద్వారా, శక్తి మెదడుకు ప్రవహించేటప్పుడు..... మార్పు చెందిన జాగృత స్థితి వస్తుంది. అదే "కుండలినీ వికాసం". అది ఒక దైవీకమైన అనుభవం. ఇది చాలా అరుదైన ,అందమైన అనుభవం. ధ్యాన సాధనతో స్వాధిష్ఠాన చక్ర ప్రదేశం, జాగృతమైనపుడు, శరీరానికి చాలా తేలికగా మారిన అనుభవం వస్తుంది.
మణిపూరక చక్రం ప్రదేశాన్ని జాగృత పరచినప్పుడు, కొన్ని రకాల శక్తులు మరియూ సిద్ధులు వస్తాయి. విశుద్ధ చక్రం జాగృతం అయినప్పుడు "టెలిపతిక్ కమ్యూనికేషన్" అనుభవం వస్తుంది. ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క స్థానాన్ని జాగృత పరుస్తున్నప్పుడు, ఒక్కోరకమైన అనుభవాలు కలుగుతాయి. ఈ అనుభవాలతో భయాందోళనలు చెందకుండా ముందుకు సాగిపోవాలి.
ఈ క్రియా యోగ విద్యలన్నిటినీ..... గురువు సమక్షంలోనే అభ్యాసం చేయడం శ్రేయస్కరం. ఒక్కొక్క స్థానాన్ని ఉత్తేజపరిచినప్పుడు, ఒక్కో రకమైన అనుభవం వస్తుంది కాబట్టి, యోగ - మంత్ర-తంత్ర-యంత్ర శాస్త్రాలు నిగూఢమైన శాస్త్రాలు కాబట్టి, గురువు సమక్షంలోనే వీటిని అభ్యాసం చేయాలి.
No comments:
Post a Comment