*ఆప్తవాక్యం లేక వేదం - లోపం లేని ప్రమాణం.....*
మనం జ్ఞానాన్ని నేరుగా అంటే ప్రత్యక్షంగా కాక, ఊహించక మరొక పద్దతి ద్వారా గుర్తిస్తాం, దాన్నే ఆప్తవాక్యం అని అంటారు. ఆప్త వాక్యం అంటే మన అప్తుల ద్వారా అందే విషయం. ఆప్తులు అంటే ఎట్లాంటి స్వార్థం లేక మన మంచి కోరి చెప్పే వారు. మనం నేరుగా గుర్తించాల్సిన పని లేదు, ఊహించాల్సిన పనిలేదు, కానీ కొందరు చెప్పిన విషయాలను మనం నమ్ముతాం. వారు చెప్పిన మాటలనే ఆప్త వాక్యం అని అంటారు. మన పూర్వులు మనకు చెబుతారు, వారికి వారి పూర్వులు చెప్పారు, వారికి వారి ముందు వారు, ఇలా మన భారత జాతి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి జ్ఞాన సంపదను మనవరకూ తెచ్చి అందిస్తోంది. మనం కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేకుండా అనుభవించే పిత్రార్జిత ధనం లాంటిది.
ఆప్తవాక్యాన్ని ఎట్లా నమ్మగలం ?
దీనికే మరొక పేరు 'శబ్దం'. శబ్దం అంటే సహజమైనది అయ్యి ఉండవచ్చు లేక కృత్రిమమైనది అయ్యి ఉండవచ్చు. కృత్రిమమైన శబ్దాలు మారుతూ ఉంటాయి. మనం తయారు చేసుకున్న భాషలు అన్నీ కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మనం వాడే భాషల్లో కొన్ని పదాల అర్థాలు మనం ఏర్పాటు చేసుకున్నవి కనక అవి మనం మారిస్తే అవి మారుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష ఉండవచ్చు. ఈ భాషలన్నీ మనం తయారుచేసుకున్నవి. మనం తయారు చేయని కొన్ని సహజమైన శబ్దాలు ఉంటాయి, అవి ఎప్పటీకీ ఒకేలా ఉంటాయి. ప్రకృతిలో మనకు వినిపించే గాలి యొక్క శబ్దం, సాగరం యొక్క శబ్దం ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. అయితే ఈ సహజ శబ్దాలలో కొన్ని అర్థం కలిగిన శబ్దాలు ఉన్నాయి వాటినే వేదం అని అంటారు. అవి ఎవరో తయారుచేసినవి కావు.
ప్రత్యక్షం, అనుమానం అనే ప్రమాణాలతో వాస్తవాన్ని గుర్తించడం అనేది కష్టం. తప్పులు జరిగే అవకాశం ఎంతో ఉంది. ఇలా మన పూర్వులు ఈ విషయాన్ని గమనించి, కేవలం భాహిరమైన వాటితో గుర్తించడం సాధ్యం కాదు అని గమనించి, వారు తమ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి లోనివైపు కేంద్రీకరించడం ప్రారంభించారు. అట్లా ఎంతోకాలంగా చేసిన ప్రయత్నానికి వారు ఎట్లాంటి లోపాలు లేని ప్రమాణంగా వేద శబ్దాన్ని గుర్తించారు. వేద శబ్దం 'అపౌరుషేయం'. ఎవరో ఒకరు చెప్పినదో వ్రాసినదో కాదు. వేద శబ్దం అనేవి ప్రకృతిలో ఉండే సహజమైన శబ్దాలు. ఊహకు అందని సృష్టి రహస్యాలు మనకు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. వేదాన్ని మనం లోపం లేని ప్రమాణం గా గుర్తిస్తాం.
అట్లా ప్రత్యక్ష్యం, అనుమానం మరియూ శబ్దం(లేక ఆప్తవాక్యం లేక వేదం) అనే ఈ మూడింటిని మనం ప్రమాణాలుగా తీసుకుంటాం. ఈ మూడు ఎట్లా వాడుకోవాలో తెలిపేవారే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అయితే ప్రత్యక్షం, అనుమానం లాంటి ప్రమాణాలలో ఎంతవరకు వీలు అవుతుందో అంతా అంగీకరిస్తాం. వేద మర్గాన్ని పూర్తిగా విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుచరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైధికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైధికమో ఏది అవైధికమో తెలిపాయి. అట్లాంటి వాటిని ఆధారంగా తీసుకొని వాస్తవ సందర్శన చేస్తాం. మనం తయారుచేసిన వాటిలో లోపం ఉండే అవకాశం ఉంది. ఒక వస్తువుని చూసి మరొకటి అని అనిపించే అవకాశం ఉంది, దీన్నే బ్రాంతి అని అంటారు. అట్లా బ్రాంతితో చెప్పేవాటిలో లోపం ఉంటుంది. మరొక కారణం, ఉన్నదాన్ని స్పష్టంగా చూడలేక పోతాం, దీనికి పరాక్కు లేదా ప్రమాధం అని అంటారు. మూడోది విప్రలిప్స, ఎదుటివారిని సంతోషపెట్టేందుకు కల్పించి చెప్పేవి. మన పురాణాల్లో కూడా ఈ దోశాలు ఉన్నాయి. ఏదో ఒక వ్యక్తి సంతోషపడుతాడని వ్రాసినవీ ఉన్నాయి. అట్లాంటివి మనకు ప్రమాణాలు కావు. నాలుగోది, మనలో అశక్తి, కొన్నింటిని మనం అనుభవిస్తుంటాం కానీ వ్యక్తపరచలేం. ఎన్నో అనుభవాలని మాటలో తెలుపలేం. అన్నింటిని తెలుపగలిగే వాంగ్మయం అనేది లేదు. మనం వ్యక్తం చేసే వైధికమైన శబ్దాలు కూడా వాంగ్మయ రూపంలోనే ఉండడంచేత, వాంగ్మయ రూపంలో ఉన్న వేదం కూడా భగవత్ ఆనందం ఎట్లా ఉంటుంది అంటే చెప్పడం నాకూ చేతకాదు అని ఒప్పుకుంది. "ఎతో వాచో నివర్తంతే అప్రా ప్యమనసాసహ ఆనందం బ్రహ్మణో విద్వాన్"అంటుంది తైత్తిరీయం అనే వేద శాఖ. కొంత వరకు చెప్పగలను, కొంత ఊహించుకొనేంతవరకు కల్పన చేసి చెప్పగలను, కానీ పూర్తిగా చెప్పడం నాకూ చేతకాదు అంటుంది. బ్రమ, ప్రమాదం, విప్రలిప్స, అశక్తి అనేది జీవ నిర్మితములైన వాటికి ఉంటాయి కానీ వేదానికి అట్లాంటి దోశాలు ఉండవు. దీన్నే శాస్త్రం అని అంటాం. అంటే మనల్ని శాసించగలదు అని అర్థం. మనం ఇది చేయవచ్చు, ఇది చేయ కూడదు అని కృత్యాకృత్యములని, ఉన్న వస్తువులేమి, లేని వేమి అని నిరూపించ సామర్థ్యం కలది శాస్త్రం. శాస్త్రం అంటే మనకు కనిపించే సామాన్య శాస్త్రం, వాస్తుశాస్త్రం, రసాయణ శాస్త్రం ఇలాంటివి కాదు. శాస్త్రం అన్నాం అంటే అది వేదం అని అర్థం
No comments:
Post a Comment