ఐదు మహాభూతములు - భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియములు, మనస్సు, ఐదు తన్మాత్రలు - శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము, కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, అందులో ఉన్న చేతనా శక్తి, ధైర్యము, ఇవన్నీ కలిస్తే దానిని క్షేత్రము అని అంటారు.
క్షేత్రము అంటే కేవలము కనిపించే ఈ శరీరమే కాదు ఈ క్షేత్రము పంచభూతాలు ఏర్పడింది. ఈ క్షేత్రములో పంచభూతములు, పంచతన్మాత్రలు (శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములు), పది ఇంద్రియములు, బుద్ధి, మనసు, అహంకారము, ప్రకృతి, ఈ ఇరవైనాలుగు తత్వములు కలిసి క్షేత్రము అని అంటారు.
ఈ క్షేత్రములో ఉన్న పదార్ధములు ఒకదానితో ఒకటి కలిసినపుడు వికారములు కలుగుతాయి. అవే కోరికలు, ద్వేషములు, సుఖము, దుఃఖము, తెలివి (జ్ఞానము), మనస్సులో చేసే సంకల్పాలు, ధైర్యము అనే వికారములతో కూడినదే ఈ క్షేత్రము. క్షేత్రము అంటే మన శరీరమే కాదు బయట కనిపించే ప్రకృతి కూడా క్షేత్రమే. అందులో నుండే ఈ జీవులు అన్నీ పుడుతున్నాయి. పెరుగుతున్నాయి. ఈ శరీరాలు అన్నీ ప్రకృతిలో భాగమే.
శరీరంలో ఉండే మనసు, బుద్ధి, అహంకారము వలన కలిగే వికారములు అనగా సుఖదుఃఖము, ఇవన్నీ కూడా క్షేత్రము యొక్క లక్షణాలే.
ఈ క్షేత్రము ఎల్లప్పుడూ ఏదో ఒక వికారముతో కూడి ఉంటుంది. వివిధ వికారములకు లోనవుతూ ఉంటుంది. కాని ఈ క్షేత్రములో ఉండే క్షేత్రజ్ఞుడు మాత్రము నిర్వికారుడు. ఆ క్షేత్రజ్ఞుడు ఈ వికారములతో కూడిన క్షేత్రమును సాక్షిగా చూస్తుంటాడు కానీ ఆయనకు క్షేత్రములో ఉన్న వికారములు ఏవీ అంటవు.
ఆచార్య ప్రేమ్ సిద్ధార్థ గారు దీని గురించి అద్భుతమైన వివరణ ఇచ్చారు. వారు ఇచ్చిన వివరణ ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు వ్యాసుల వారు క్షేత్రము అంటే కేవలం శరీరం అని చెప్పి, ఈ శ్లోకాలలో క్షేత్రము అనే పదాన్ని మరింత విస్తృతపరిచారు.
మనం చూసే ఈ జగత్తును శాస్త్రకారులు కొన్ని తత్వాలుగా విభజించారు. వైశేషిక దర్శనము 12 తత్వాలుగా విభజించింది. న్యాయదర్శనము 16 తత్వాలుగా విభజించింది. కపిల మహాముని యొక్క సాంఖ్యములో 24 తత్వాలుగా ప్రతిపాదింపబడింది. ఈ ప్రకారంగా విభజింపబడినప్పటికీ వేదాంతము యొక్క ముఖ్య ప్రయోజనము జీవుడు, ఈశ్వరుడు, వీరి ఐక్యము, కాబట్టి ఎన్ని తత్వాలు ప్రతిపాదింపబడ్డా ముఖ్యమైన ఉద్దేశ్యము జీవేశ్వరైక్యము. కాబట్టి ఎన్ని తత్వాలుగా విభజింపబడ్డా, దాని వలన ఎటువంటి నష్టము లేదు. తత్వాలు ఎన్ని ఉన్నా ఉద్దేశం ఒక్కటే. కాబట్టి వేదాంతము, సాంఖ్యయోగంలో కపిలముని ప్రతిపాదించిన 24 తత్వాలనే ప్రమాణంగా స్వీకరించింది.
సాంఖ్యం ప్రకారము పరమాత్మ, ప్రకృతి రెండూ ఉన్నాయి. రెండూ స్వతంత్రంగా ఉన్నాయి. కాని వేదాంతము ప్రకారము ప్రకృతి పరమాత్మ మీద ఆధారపడి ఉంది అంటుంది. పరమాత్మ అవ్యయుడు. నాశము లేని వాడు. ఈ పరమాత్మ నుండి మూలప్రకృతి ఆవిర్భవించింది. దానినే మహత్ తత్వము అని అంటారు. ఏ పని చేయడానికైనా దానికి సంబంధించిన బుద్ధి, తెలివి, నైపుణ్యం ఉండాలి. ఈ మహత్ తత్వములోనుండి అహంకారము వచ్చింది. ఈ బుద్ధి తెలివి ఎప్పుడు ఆవిర్భవించాయో వెంటనే దానికి సంబంధించిన ‘నేను’ అనే తత్వము కూడా పుడుతుంది. దానినే అహంకారము అంటారు. ఈ అహంకారము ప్రకృతి అంతా విస్తరించింది.
తరువాత మహాభూతములు ఐదు ఏర్పడ్డాయి.
మహాభూతములు అంటే సూక్ష్మరూపంలో ఉన్న పంచభూతములు. వీటి నుండి పది ఇంద్రియములు, మనస్సు సూక్ష్మరూపంలో ఏర్పడ్డాయి. అంటే సూక్ష్మరూపంలో మొత్తం 18 తత్వాలు ఏర్పడ్డాయి. తరువాత ఈ స్థూల జగత్తు ఏర్పడింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న భూమి, అగ్ని, వాయువు, నీరు, ఆకాశము ఏర్పడ్డాయి. అంటే ఇరవై మూడు అయ్యాయి. ప్రకృతి ఒకటి. మొత్తం ఇరవైనాలుగు తత్వాలు. వీటినే కపిల మహర్షి తన సాంఖ్యంలో ప్రతిపాదించారు.
No comments:
Post a Comment