Wednesday, October 2, 2024

 *మూడు శరీరాలు - పంచ కోశాలు - మూడు అవస్థలు.....*

జీవుడు :
    ఉపాధియందుండు ఆత్మ (బ్రహ్మము) అవిద్య (అజ్ఞానము)చే ఆవరించబడి, మాయామోహితమై ఉంటుంది. ఈ మాయావృతుడైన ఆత్మను జీవుడు అంటారు.

మూడు శరీరాలు :
స్థూల సూక్ష్మ కారణ శరీరాలు/దేహాలు

పంచ కోశాలు :
అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు

మూడు అవస్థలు :
జాగ్రత్ స్వప్న సుషుప్తి

1. స్థూల శరీరము :
   (PHYSICAL BODY)
    మన కళ్ళకు కనిపించే భౌతిక శరీరం.

* తత్త్వములు
      అస్థి, మాంస, చర్మ, నాడీ, రోమము మొదలగునవి.
 
* కోశము
      అన్నమయ కోశము.
     (FOOD SHEATH)

* అవస్థ
      జాగ్రదవస్థ (WAKING - CONSCIOUS) కలిగి యుంటాడు.

* జీవుని పేరు
        స్థూల శరీరాభిమానియగు జీవునకు "విశ్వుడ"ని పేరు.

2. సూక్ష్మ శరీరం :
   (SUBTLE BODY)
        దీనికే లింగశరీరమని పేరు.

* తత్త్వాలు
    వాక్కు, పాణి, పాద, ఉపస్థ, పాయువు అనే పంచ కర్మేంద్రియాలను,
    శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రాణము అనే పంచ జ్ఞానేంద్రియాలను,
    ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచవాయువులును,
    పృథ్వి, ఆపః, తేజః, వాయుః, ఆకాశ అనే పంచ భూతాలును,
    మనో బుద్ధి చిత్త అహంకారాలనే అంతఃకరణ భాగాలును కలసి 24 తత్త్వాలవుతాయి.
    ఈ 24 తత్త్వాలు శరీరంగా కలిగి జీవుడు.

* కోశము
    ఇది ప్రాణమయ (LIFE SHEATH), మనోమయ (MIND SHEATH), విజ్ఞానమయ కోశము (INTELLEGENCE SHEATH) అవుతుంది.
    ఇందుగల
  - మనస్సుయొక్క విషయము సంకల్ప వికల్పాలు.
  - చిత్తం యొక్క విషయం విశ్లేషణ.
  - బుద్ధియొక్క విషయము నిశ్చయము.
  - అహంకారం యొక్క విషయము "నేను".

    ఈ శరీరాన జీవుడు పూర్వకర్మ వాసనలు కలిగియుంటాడు.

* అవస్థ
    స్వప్నావస్థ (DREAMING - UNCONSCIOUS)

* జీవుని పేరు
    పూర్వకర్మలచే కలిగిన వాసనలతో "తైజసుడు" అనబడతాడు.

3. కారణ శరీరం :
   (CASUAL BODY)
    పరబ్రహ్మము నుండి ఆవిర్భవించిన మలిన సత్వ ప్రధానమైన మాయ (అవిద్య) జీవునకు కారణ శరీరంగా ఏర్పడింది.
    జీవుని స్థూల సూక్ష్మ శరీరాలకును, సమస్త చేతనాచేతన జీవరాశి ఉత్పత్తికిని ఇది కారణమవడంచేత, దీనికీ కారణ శరీరమంటారు.

* కోశము
      ఆనందమయ కోశము
     (BLISS SHEATH)

* అవస్థ
      సుషుప్త్వవస్థ (DEEP SLEEP - SUBCONSCIOUS)

* జీవుని పేరు
    ఈ కారణ దేహాభిమానియగు జీవుడు, "ప్రాజ్ఞుడు" అనే పేరు కలిగియుంటాడు.

No comments:

Post a Comment