Monday, October 21, 2024



 నాలుగు గోడలు నడుమ నేర్చుకొనే విద్య జీవన గమనం లో కొంత వరకు మాత్రమే ఉపయోగ పడుతుంది...

అసలైన విద్య నాలుగు గోడలు బయట ప్రపంచం మనకు నేర్పుతుంది...

ప్రతీ పాఠం అనుభవం ద్వారానే నేర్చుకుందాం అనుకొంటే 
ఒకటి కాదు...  
పది జీవితాలు... కూడా సరిపోవు...

 అందుకే...
 ""అవసరం కోసం మాత్రమే జీవించే వారిని అధములనీ""...

""సొంత అనుభవం ద్వారా మాత్రమే జ్ఞానం తెచ్చుకొని జీవించే వారిని మధ్యములనీ""

""ఇతరుల అనుభవాలను చూసి... చదివి... తెచ్చుకొన్న జ్ఞానం ద్వారా జీవితాన్ని చక్కదిద్దుకొని జీవించే వాళ్ళను ఉత్తమలనీ"" చెబుతారు 

ఈ మెసేజ్ ఒక మంచి పుస్తకం కోసం వ్రాసిన ముందు మాట అయినా కూడా పుస్తకం కొని చదివినా,
 చదవక పోయినా,  కూడా ఉపయోగ పడుతుందని షేర్ చేస్తున్నాను....

ఆర్థిక క్రమశిక్షణ లోపించిన సినిమా రంగ ప్రముఖుల జీవితాలు ఎలా విషాదంగా ముగిశాయో ఈ పుస్తకం వివరిస్తుంది...

 సినీ రంగంలో వెలిగిపోతూ రెండు చేతులా డబ్బుగడిస్తున్న రోజుల్లో విపరీతంగా దానధర్మాలు చేసి దివాలా తీసిన నాగయ్య, కన్నాంబ, రాజనాల, సావిత్రి, రాజబాబు, నృత్య దర్శకుడు సలీం జీవితాలు మనకు కళ్ళు తెరిపిస్తాయి...

 కొత్తనీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుందన్న స్పృహ లేకపోవడం వల్ల, ప్రత్యామ్నాయాలు చూసుకోకపోతే, డిమాండ్ లేక రోడ్డున పడాల్సి వస్తుందని హీరోయిన్ మాలతి, గిరిజ, రామ్మోహన్, రంగనాథ్, దర్శకులు కేవీరెడ్డి, కమలాకర కామేశ్వరరావు, సంగీత దర్శకుడు జేవీ రాఘవుల జీవితాలు తెలియజేస్తాయి...

 తాగుడుకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకున్న వారిలో హరనాథ్, రామ్మోహన్, రాజబాబు లాంటి వారు ఉన్నారు...

 కుటుంబ సభ్యుల మోసాలకు గురై నిస్సహాయంగా మిగిలిపోయిన వారిలో ఎస్. వరలక్ష్మి, సావిత్రి, కాంచన కనిపిస్తారు... 

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలని ఉద్దేశంతో సినిమాలు తీసి బికారులు అయిన వారిలో- దక్షిణ భారతదేశంలో తొలి మహిళా దర్శకురాలు, నిర్మాత, ఒకప్పటి అందాల తార టి. పి. రాజ్యలక్ష్మి, కన్నాంబ, నాగయ్య, కస్తూరి శివరావు, రాజబాబు, సావిత్రి, కాంతారావు లాంటి హేమాహేమీలు ఉన్నారు...

 సినీ పరిశ్రమలో నెలకొన్న మూఢనమ్మకాలకు ఐరన్ లెగ్ శాస్త్రి, కుల ఆధిపత్యం కాటుకు నరసింహారాజు బలైపోయారు...

 కుటుంబ హింస, తాగుడు, సినిమాలు తీసి నష్టపోవడంతో సావిత్రి,  దానధర్మాలు తాగుడు, సినిమాలు తీసి రాజబాబు తమ జీవితాలను తామే నాశనం చేసుకున్నారు...

 సొంత ఇంటిని అప్పులోల్లకు అమ్ముకొని హైదరాబాద్ వచ్చి అద్దె ఇంట్లో చాలీచాలని డబ్బుతో జీవితం గడిపిన కాంతారావు, సారథి స్టూడియో దగ్గర రేకుల షెడ్డులో ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన రాజనాల,  జీవితం చివరి దశలో  సైకిల్ షాప్ లో గడిపిన ఆంధ్ర దేవానంద్ రామ్మోహన్, వెంకటరమణ థియేటర్ గోడకూలి దాని పక్కన ఉన్న గుడిసెలో ఉండే మాలతి దుర్మరణం చెందడం హృదయాన్ని కలచివేస్తాయి...

 ఉదయ్ కిరణ్ కు ధైర్యం చెప్పిన రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడం మరో విషాదం...

ఉత్తరాదిన చూస్తే భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే, హిందీలో తొలితరం ప్రముఖ నటులు భరత్ భూషణ్, పైడి జయరాజ్, ఒకప్పటి బాలీవుడ్ ఫేమస్ విలన్ పరుశురాం, దిక్కులేకుండా  చనిపోయిన ప్రముఖ హీరోయిన్ పర్వీన్ బాబిల జీవితాలు ఒక హెచ్చరికలా మిగిలిపోతాయి...

 తొలితరం నటులు చాలామంది చివరి దశలో దుర్భరమైన పేదరికం అనుభవించారు... 

సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలోనే వీటిని చాలా దగ్గర నుంచి  చూసిన శోభన్ బాబుపై అది తీవ్రమైన ప్రభావం చూపింది. శోభన్ బాబు భూములనే తన ఆస్తులుగా మార్చుకొని తాను బాగుపడడమే కాక ఎందరికో ఆదర్శంగా నిలిచారు...

 ఆర్థిక అంశాల్లో మొదటి నుంచి ఒక ప్రణాళిక బద్ధంగా ఉండడం, సంపాదించిన డబ్బును సరైన విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల జమున ఎప్పటికీ జమున నే అనుకునేట్టు ఆత్మవిశ్వాసంతో బతికారు...

 అన్ని పోగొట్టుకొని దాన్ని గుణపాఠంగా తీసుకొని తిరిగి జీవితాన్ని గెలుచుకున్న అమితాబ్ బచ్చన్ ను ఆదర్శంగా తీసుకోవాలి...

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాజులు, రాజ్యాలు పోయిన తర్వాత బతుకుతెరువు కోసం ఎన్నో తంటాలు పడ్డారు...

 జునాగడ్ రాజు పాకిస్తాన్ పారిపోయి దయనీయమైన బతుకు గడిపారు... 

నిజాం వారసుడు ప్రిన్స్ ముఖరంజా విదేశాల్లో అద్దె ఇంటిలో సామాన్య జీవనం సాగించారు... 

నాంపల్లిలో నిజాం వారసులకు సంబంధించిన ట్రస్టు ఒకటి ఉంది... వందలాదిమంది నిజాం వారసులు బతుకుతెరువు కోసం అక్కడ నెల నెలా పెన్షన్ తీసుకోవడానికి క్యూలో నిలబడతారు...

 ఒరిస్సా చివరి రాజు భరణాల రద్దు తర్వాత దయనీయమైన జీవితాన్ని గడిపారు...

 చివరి మొగలాయి చక్రవర్తి బహదూర్ షా ముని మనవరాలు కలకత్తాలో రెండు గదుల ఇంటిలో నివసిస్తున్నారు... పిల్లల పోషణ కోసం టీ కొట్టు నడిపిస్తున్నారు...

 అయితే రాజుల వారసులు అందరూ ఇంతేనా, అంటే కాదు...
 జీవితం పట్ల సరైన అవగాహన లేని వారి వారసుల పరిస్థితి మాత్రమే ఇలా కనిపిస్తుంది...


సంపద గురించి సరైన అవగాహన ఉన్న వ్యక్తి పేదరికం నుంచి జీవితాన్ని ప్రారంభించినా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు...

 అదే సరైన అవగాహన లేని వ్యక్తి రాజ కుటుంబానికి చెందిన వారైనా దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది...

 డబ్బులు సంపాదించడమే కాదు హోల్డ్ చేయడం కూడా తెలియాలి...

 అలా తెలిసిన వ్యక్తి వద్దనే సంపద నిలుస్తుంది...

మహోజ్వలంగా  వెలిగిన సినీ తారలు, సువిశాల భారతదేశాన్ని వందల ఏళ్ళు పాలించిన రాజవంశాలు, రాజకీయ నాయకులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన వారు తాము చేసిన పొరపాట్ల వల్ల జీవిత చరమాంకంలో దయనీయంగా గడిపారు...

 మహనీయుల పరిస్థితే ఇలా ఉంటే, మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి?...

 మన జీవితం అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి?...

వడ్డీ రేట్లు, స్టాక్ మార్కెట్, ధరల పెరుగుదల, వడ్డీ, వ్యాపారం ఇవన్నీ పైకి కనిపించేవి... 

కానీ సంపద సమకూరడానికి పైకి కనిపించే వీటికన్నా కనిపించని ఆలోచనల ప్రభావం ఎక్కువ ఉంటుంది...

 ఒక మనిషి సంపన్నుడిగా ఎదిగినా, పేదవాడిగా మిగిలిపోయినా పైకి కనిపించే వాటికన్నా కనిపించని ఆలోచనలూ, వాటి అనుగుణంగా తీసుకొన్న నిర్ణయాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది... 
పైకి కనిపించని ఆలోచనలే కీలకపాత్ర వహిస్తాయి...

 జీవితంలో ఏ స్థాయిలో ఉండాలి అని అనుకుంటున్నాము... ఎంత సంపాదించాలని అనుకుంటున్నాం?... 
ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా కృషి చేయాలి?...
అనే అంశాలతో కొత్త బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి...
మన ఆలోచనలు ఏ తీరుగా ఉన్నాయో సరి చూసుకొని, ప్రతీ దశలోనూ సమీక్ష చేసుకొంటూ... ముందుకు సాగాలి...
దానికి తగినట్లు ఎప్పటి కప్పుడు కొత్త బ్లూ ప్రింట్ రూపొందించు కోవాలి... 

విజయాన్ని కాక్షించాలి... చవిచూడాలి...

డబ్బు సంపాదించడం జీవిత ద్యేయం కాదు...
 కానీ చాలా జీవిత
ద్యేయాలు సాధించడానికి డబ్బు ప్రధాన... ప్రాధమిక... అవసరం... 

చదివినందుకు ధన్యవాదములు...

మీ మనస్సు లోకి తీసుకొంటే కోటి నమస్కారములు...

ఆచరించి మీరు అనుకొన్న విజయం సాధిస్తే శత సహస్ర కోటి నమస్కారములు... 

💐💐💐💐💐💐💐💐💐
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


(" లక్ష్మీ కటాక్షం" ( డబ్బుకు విలువ ఇస్తేనే నిలుస్తుంది) బుద్దా మురళి. ముద్రణ సెప్టెంబర్ 2024 వెల రెండు వందల రూపాయలు. పేజీలు 168. ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు మరియు 98 499 9 8087)

No comments:

Post a Comment