*వేదమునకూ వేదాంతమునకూ సంఘర్షణ ఉన్నదా.....*
కర్మకాండ విభాగంలో క్రతువుల నిర్వహణ గురించి చెప్పబడింది. కాని జ్ఞానకాండ విభాగంలో, అంటే ఉపనిషత్తులలో, వీటన్నింటినీ విడిచి పెట్టమని ఉంది. కర్మకాండలో మనుష్యులు దేవతారాధన చెయ్యాలని ఉండటమేకాక ఆ ఆరాధనా విధానానికి కూడ వివరణ ఉంది. ఉపనిషత్తులలో యజ్ఞాలని నిర్వహించే వాడు అజ్ఞానపు పశువని కూడా ఉంది. రెండూ వేదాలలో భాగాలే..
వేదారంభంలో ఉన్న విషయాలే చివరి భాగంలో ఖండింపబడుతాయి. ఇది ఆశ్చర్యదాయకమైన విషయం.
ఒకవైపు కర్మాచరణముంటే రెండవ వైపు అంతా జ్ఞానమార్గము దానికి పూర్తిగా భిన్నం. అందువల్ల మామూలు వాడుక భాషలో వేదాలంటే కర్మకాండ అనీ, వేదాంతమంటే (ఉపనిషత్తులు) జ్ఞానకాండమనీ స్థిరపడి పోయాయి.
భగవద్గీతలో కృష్ణభగవానుడు పదేశించినది వేదాంతమే. గౌతమబుద్ధుడూ, మహావీరుడూ వేదాలలోని కర్మకాండను ప్రతిఘటించిన వారిలో ఆద్యులని సాధారణంగా అంటారు. కాని ఇది వాస్తవం కాదు. వీరిద్దరి కంటే ముందు శ్రీకృష్ణుడే ఆ పని చేశాడు.
కృష్ణభగవానుడు అర్జునునితో - ''సత్వ-రజః-తమో గుణాలకి సంబంధించినది వేదం. ఈ మూడు గుణాలకు అతీతమైన స్థితిని నీవు చేరుకోవాలి'' అంటాడు. (త్రైగుణ్య విషయావేదా నిస్త్రెగుణ్యోభవార్జున'') అంతేకాక, ''వేదాలలో చెప్పిన దానిని పరిమితంగా, యథాతథంగా ఆచరించే వాళ్లని ప్రేరేపించేది స్వర్గసుఖాలని పొందాలన్న కోర్కే'' (2-44). వైదిక కర్మలు, సమాధి కల్పించే నిశ్చలమానసిక స్థితిని కల్గించలేవు.
''వేదవాదరతాః పార్థ! నాన్యదస్తీతి వాదిన'' 2-42
''కామాత్మనః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం'' 2-43
''వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే'' 2-44
ఇక్కడేదో వైరుధ్యముందనిపించవచ్చు. ధర్మానికి మూలం వేదమని ముందు చెప్పుకొన్నాం. నిజానికి ఇక్కడ వైరుద్ధ్యమేమీ లేదు.
నిత్యవ్యవహారంలో ఉపనిషత్తులలోని తత్త్వం ప్రకారం జీవించటం కష్టం - అంటే ఆత్మయొక్క అభిన్నత్వాన్ని గ్రహించటానికి త్రిగుణాల వల్ల శృంఖలాలను ఛేదించి, ఏకాగ్రతతో, నిశ్చలంగా ఆత్మవిచారం చేయటమన్నమాట. వేదోక్తమైన కర్మల ఉద్దేశం మనలని ఆ స్థితికి క్రమేపీ చేర్చటమే. జగత్తు ''సత్య''మని మనం భావించినంత కాలమూ ఈ జగత్తులో సుఖంగా బ్రతకటానికి దేవతారాధన తప్పదు. తద్వారా సత్యమని మనం భావించే జగత్తుకి కూడ శ్రేయస్సుని చేకూరుస్తాం. దేవలోకం కూడ. ఈ లోకంవలెనే, సత్యమనుకొంటాం. దేవతలను సంతుష్టి పరచి మనమెంతో లబ్దిని పొందుతాం. ఈ లోకంలో వలెనే దేవలోకంలో కూడా సుఖాలను అనుభవించగలమని ఆశిస్తాం. కాని అంతటితో ఆగిపోతే, మనం లక్ష్యాన్ని మరచినట్లే. భగవంతునిలో శాశ్వతంగా లీనమైపోవటమే లక్ష్యం. దీనిని మరచి లౌకిక ప్రయోజనాలని సంక్రమింప జేసే వైదిక కర్మల మీదే మనస్సు నిల్పటం, అవివేకం.
నిత్యజీవితంలో జగత్తు ''మిథ్య'' అని అంగీకరించలేం. ''నువ్వు అట్లా అనుకోవటంలో తప్పులేద''ని వేదాలు విశ్వకల్యాణానికై చేయవలసిన కర్మలను విశదీకరించాయి. నిర్గుణుడైన పరమాత్మగాని జీవాత్మపరమాత్మల అభేదంగాని మనకి అవగాహన కల్గటం కష్టమవటం వల్ల మనం ఆరాధించటానికి వీలుగా అనేక రూపాలను ధరించిన దేవతలను మనకిచ్చాయి. కర్మలను చేస్తున్నప్పుడూ, దేవతారాధన చేస్తున్నప్పుడూ, ఇవన్నీ మనకి చిత్తశుద్ధినీ, ఏకాగ్రతనీ కలిగించటానికే ననీ, ఆ మానసిక స్థితిని చేరిన తరువాత ఈ జగత్తు మిథ్యగా తోస్తుందనీ, మనకీ పరమాత్మునికీ భేదంలేదనీ, పరమాత్మలో లీనమై అభిన్నమవుతామనీ - గుర్తుపెట్టుకోవాలి.
దేవతల అనుగ్రహం ద్వారా ప్రాపంచక, స్వర్గ సుఖాలకోసమే యజ్ఞాలను చేస్తే అది సాధారణలోక వ్యవహారం వంటిదే అవుతుంది. ఆత్మసాక్షాత్కారం వల్ల కలిగే ఆనందానికి సాటిరాగలది దేవలోకంలో కూడా ఏదీ లేదు.
అంతేకాదు, చేసిన పుణ్యఫలం పూర్తికాగానే దేవలోకాన్ని విడిచి మళ్లీ సంసారవలయంలో పడి పూర్వకర్మానుసారం జన్మలనెత్తాల్సిందే. ప్రస్తుత స్థితిని బట్టి క్రమేపీ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించటానికి వీలుగా వేదాలు కర్మలనూ, ఆరాధనలనూ నిర్దేశించినా అంతిమ లక్ష్యాన్ని గుర్తుంచుకొని మనం పురోగమించాలి.
వేదోక్తమైన కర్మానుష్ఠానాన్ని విడనాడటం అనుచితమే అయినా, దానిని ఏ పరిస్థితులలోనూ విడనాడ కూడదనటం కూడ అనుచితమే. సంప్రదాయ సిద్ధంగా యజ్ఞాలూ, వేదాధ్యయనమూ చేయకుండా నేరుగా ఉపనిషత్తులనే పఠించటం పట్ల మొగ్గుచూపుతున్నారు ఈ రోజులలో. అందువల్ల చాలామందికి ఉపనిషత్తులలోని విషయం తెలియటమే కాక, ఆ విషయం గురించి చర్చలు కూడ చేయగలుగుతున్నారు. అయినా చిత్తశాంతి కలిగిన వారు, అరిషడ్వర్గాలు లేనివారు, ఆత్మసాక్షాత్కారం పొందిన వారు, ఎక్కడా కాన రారెందుచేత? వైదిక నియమాలను పాటించి, యజ్ఞయాగాదులను నిర్వహించి, మనస్సునూ, దేహాన్నీ వారు అంతిమ దశకు సమాయత్త పరుపక పోవటమే దీనికి కారణం.
No comments:
Post a Comment