🔱 అంతర్యామి 🔱
# అయిదువేళ్ల వెనుకా...
🍁ఆవురావురుమంటూ కంచం ముందు కూర్చుంటాం. అన్నం, కూరలు వడ్డించగానే అయిదువేళ్లతో అన్నం కలుపుతాం, తొలిముద్దనోసారి కళ్లకద్దుకుని తరవాతే నోటికి అందిస్తాం. ఇస్తున్నది చేయి అందుకోబోతున్నది నోరు! మరి కళ్లకద్దుకోవటంలో అర్ధం ఏంటీ అంటే- ఆ ముద్ద మన నోటికి చేరటానికి ఎన్ని చేతులో సహాయం చేస్తున్నాయి. ఆ సహాయం అందించే మూలపురుషుడు పరమాత్మ. ఆ పరమాత్మ మన కళ్లలో ఉన్నాడు మరి.
🍁మన నోటికందే షడ్రసోపేతమైన భోజనంలో ఎంత మంచి ఉందో, అంత చెడ్డా ఉంది. ఈ షడ్రుచుల మీదే మనిషి తత్వం ఆధారపడి ఉంది. అవే మన గుణాలను బయట పెడతాయి. అవే సత్య, రజస్తమో గుణాలు నాభి వరకూ ఉన్న భాగం తమోగుణ ఆవాసం. నాభి నుంచి ఉదరం వరకూ రజోగుణం. ఉదరం నుంచి కంఠం వరకూ సత్య గుణం. కంఠ భాగంపైన ముఖ మండలం... మనసు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి జ్ఞానం వికసించే కేంద్రం. జ్ఞానం భగవత్ సంకేతం. అదే బ్రహ్మం. అంటే- పరమాత్మను చేరుకోవడానికి దారి. అందుకే మనం నోటికందించే అన్నం పరబ్రహ్మ స్వరూపం.
🍁 అది మనకు భగవంతుడి ప్రసాదం. దాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించి మన నోటికందిస్తే మనకి క్షేమం. మనకింత క్షేమాన్ని కలిగించే ఆహారాన్ని భగవంతుడు ఎందరి సాయంతో మన వరకూ చేరుస్తున్నాడో కూడా తెలుసుకోవాలి! ఆకలితో నకనకలాడుతూ కూర్చోగానే విస్తట్లో ప్రేమగా అన్నం వడ్డించేది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు. మొత్తం మీద ఆవిడో అన్నపూర్ణ. ఆకలితో ఉన్నవారికి సుష్టుగా, కొసరి కొసరి వడ్డించిన వారెవరైనా అన్నపూర్ణలే. ముందుగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆమెకు కావాల్సినవన్నీ తెచ్చిస్తున్నవారు మరొకరు. అతడు తండ్రో, భర్త, కుమారుడో ఎవరైతేనేం? ఒక దాత, ఒక దేవుడు. మరి ఆ పదార్థాలు ఆయన సృష్టిస్తున్నాడా? మళ్లీ ఎన్నో చేతులు, ఎంతో శ్రమ. ఎండావానా అనక కాయకష్టం చేసి పండించిన పంటంతా తానొక్కడే అనుభవించాలనుకోకుండా సమస్త మానవాళి ఆకలి బాధలు తీరుస్తున్న రైతన్నలో... కనిపించని ఆ పరమాత్మ చేయి కనిపించడం లేదా? అందరి సహకారంతో అందే కమ్మనైన ఆహారాన్ని ముద్దగా చేసి కడుపులోకి పంపిస్తున్నాం.
🍁లోపలి యంత్రం అవసరమనుకున్నవి రక్తంగా మార్చి శరీరానికి శక్తినిస్తుంది. జ్ఞానాన్నిస్తుంది, ఆలోచననిస్తుం వివేచననిస్తుంది. మలినాల్ని, వ్యర్థాల్ని బయటకు తోసేస్తుంది.
🍁మూడుపూటలా ఆ అయిదువేళ్లు ఐక్యతతో పనిచేసి నోటికింత అందిస్తున్నాయంటే వాటి వెనకాల మనకి కనిపించని ఆ పరమాత్మ సహస్ర బాహువులతో, సహస్రాక్షులతో, సహస్ర శీర్షాలతో చేస్తున్న నిర్విరామ కృషి ఉంది. అది ఎంత అచంచలమైనదో తెలుసుకోవాలి. తెలుసుకుని మన చుట్టూ ఉన్నవారితో చేయ చేయీ కలపాలి. అయిదు వేళ్లూ నోట్లోకెళ్తున్న మనిషి జీవించే స్వల్పకాలంలో ఈ రహస్యం తెలుసుకొని, జీవించడమే ఒక నైవేద్యం!🙏
⚜️🌷🌷⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment