Friday, October 4, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకము Loni konni padyalu

 దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే

కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే

వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే

చింతింపన్వలె నీపదాంభుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!

భావం:

శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిథిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.

నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై

రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ

భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై

చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును.

నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్

జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్

లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ

ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును.

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెఱింగిన్ సదా

కాంత ల్పుత్త్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతిం జెంది జరించుఁ గాని పరమార్థంబైన నీయందుఁ దాఁ

జింతాకంతయుఁ జింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వరా!

శ్రీకాళహస్తీశ్వరా! ఆలోచించి చూస్తే, మనుజునకు అంతా మాయే అని తెలిసినప్పటికీ, తన కాంతలు (పతులు), పుత్రులు, ధనము, శరీరములే వాస్తవము, శాశ్వతములని తలచి వానికై తపిస్తూ మోహమనెడి సముద్రంలో కొట్టుమిట్టాడుతాడేగానీ, పరమార్థము, పరమాత్మవైన నీయందు చింతాకంతైననూ ధ్యానము నిలుపజాలకున్నాడు గదా.

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్

వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్ !

చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా !

ఐహికజీవనమనే మాయలో తగులుకున్న అవివేకులు తమకు పుత్ర సంతతి కలగలేదే అని చింతిస్తూ ఉంటారు. ఐతే, కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుగురు పుత్రులు కలిగినా వారి వలన ఆతడు ఏ ఉత్తమలోకాలను పొందగలిగాడు? బ్రహ్మచారిగానే యుండి సంతతియే లేని శుకునకు దుర్గతి ఏమయినా కలిగిందా? పుత్రులు లేని వారికి మోక్షపదం సిద్ధించకుండా పోదుకదా శ్రీ కాళహస్తీశ్వరా !



No comments:

Post a Comment