Wednesday, January 1, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

62. యథా యోగ్యం తథా కురు

ఏది యోగ్యమో అది చేయుమమ్మా (దేవ్యపరాధక్షమాపణ స్తోత్రం)

ఇది శంకరకృతంగా ప్రసిద్ధమైన దేవ్యపరాధక్షమాపణ స్తోత్రంలోని వాక్యం. నిజానికి దైవాన్ని ఈ ఒక్క వాక్యంతో ప్రార్థిస్తే చాలు.

అందుకే స్తోత్రానికి ఇదే చరమ వాక్యం.

మనం చాలా చాలా కోరికలతో దేవుని ప్రార్థిస్తాం. తప్పేం లేదు. కోరికలను
తీర్చేవారు దేవతలే. అయితే అభీష్టదైవాన్ని అర్థించేటప్పుడు ఈ ఒక్కమాటంటే చాలు.

మన దృష్టి చాలా పరిమితం. వర్తమానమనే బిందువుపై నుండి గతాన్ని విశ్లేషించి, వర్తమానాన్ని పరిశీలించి, భవిష్యత్తుపై అంచనాలతో కోరుకుంటాం. కానీ అనంతకాలం గురించి మనకు అవగాహన ఎక్కడిది?

'రేపు ఇది జరిగితే బాగుండును' అని అంచనా వేస్తాం. కానీ అది ఈ క్షణాన ఉన్న అవగాహన వల్ల అనుకున్నది మాత్రమే. రేపటి రోజుకి ఏది ఎలా ఉంటుందో మనం చెప్పలేం.

అదే విధంగా మనం కోరుకున్న దానిని చుట్టుకొని ఎన్ని చిక్కులున్నాయో మనకు తెలియదు.

మనకు ఏది యోగ్యమో 'సర్వజ్ఞతా'శక్తి కలిగిన పరమాత్మకే తెలుసు. పైగా మనకు ఈ జీవితంపైన మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ జీవికి ఈ బ్రతుకు ఒక మజిలీ మాత్రమే. ఇప్పుడు తప్పించుకున్న కర్మ మరొకప్పుడు తగలక మానదు. ఈ
అల్పపుటెరుకల మనస్సు ఏమి కోరుకోగలదు? మనకేది యోగ్యమో మనమెలా తెలుసుకోగలం?

పసిపిల్లవానికి ఎన్నెన్నో తినాలని ఉంటుంది. చివరికి నిప్పుకణికని కూడా నోట్లో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతాడు. ఎవరైనా నిరోధిస్తే ఏడుస్తాడు. కానీ, అతనికి
సమయసందర్భాలను, శరీరస్థితిని గమనించి తల్లి ఆహారాదులను సమకూర్చుతుంది.ఈ విశ్వంలో విశ్వేశ్వరుని ముందు మనమూ అన్ని విధాల పసిపాపలవంటివారమే.
అందుకే మనం అనుకూల, ప్రతికూలాలకు అల్లకల్లోలపడకుండా ప్రతి అనుభవమూ భగవత్ప్రసాదంగా భావించగలిగే స్థితిని సాధించాలి. అదే 'యథాయోగ్యం' అంటే.

విధ్యుక్త కర్మని భగవదర్పణంగా ఆచరించి, ప్రేమపురస్సరంగా 'భగవానుడు నాకు హితుడు. నా ప్రతి అనుభవమూ నా ఉన్నతికై, జ్ఞానానికై ఇవ్వబడినది' అనుకున్నవాడు.
శాంతినీ, ధైర్యాన్నీ పొంది పురోగమించగలడు. ఈ విధమైన ప్రార్థనను మనస్పూర్తిగా
ఆచరించినప్పుడు మనమున్న స్థితిని అనుసరించి, మన కర్మల గతులను గమనించి మనకు ఏది యోగ్యమో దానిని అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు.

“యోగక్షేమం వహామ్యహమ్" అని భగవానుడు గీతలో పలికిన అభయవాక్యమిది.నిత్యమూ భగవానునితో మనస్సును అనుసంధానించిన“నిత్యాభియుక్తు”ని యోగమును క్షేమంగా ఉంచుతాడు.

భగవంతునితో హృదయాన్ని అనుసంధానించడమే యోగం. అది క్షేమంగా ఉంటే చాలు. దానిని క్షేమంగా ఉంచే బాధ్యత భగవానునిదే. ఆ యోగమార్గం భద్రంగా ఉండడమే అత్యంత ముఖ్యవిషయం. ఇతర సుఖదుఃఖాదులను జీవయాత్రలో భాగంగా స్వీకరిస్తూ, భగవద్యోగం మాత్రం భద్రంగా ఉండాలని కోరుకోవాలి.

మనకి అవసరమైన దానితో జీవితాన్ని కలపడమే యోగం. దానిని పదిలంగా
కాపాడడమే క్షేమం.

విశ్వనిర్వహణ వ్యవస్థలో నిరంతరం ప్రతి అణువుకీ యోగాన్ని సమకూర్చి నిర్వహించే విశ్వవ్యాపకుడు 'యథా' యోగ్యాన్ని 'తథా' చేయగలడు.

భగవద్గీత బోధించిన బోధనల సారం ఈ ప్రార్థనావాక్యంలో ఉంది.                

No comments:

Post a Comment