🙏 *రమణోదయం* 🙏
*జనులారా! స్వర్గాది లోకాలున్నాయని, లేవని మీలో మీరు వాదించుకోవద్దు. మనం వసిస్తున్నామనుకుంటున్న ఈ లోకం ఎంత నిజమో, స్వర్గాది లోకాలు కూడా అంతే నిజమని మీరు అనుకోవచ్చు.*
*వివరణ* : స్వర్గ నరకాలనే లోకాలున్నాయనటం నిజమేనా అని ఎంతో ఆసక్తితో తర్కించుకుంటారు. చూసే తాను సత్యమని తలచేవారు తనకన్యంగా గోచరించే ఈ ప్రపంచాన్ని కూడా నిజమనుకుంటున్నారు. తర్వాత, శాస్త్రాలలో చెబుతున్న స్వర్గ నరకాలు తమ కళ్ళకి కనబడకపోవటం చేత అవి కేవలం కల్పితాలేమోనని సందేహిస్తున్నారు.వాటి వాస్తవికత గురించి వాదించుకుంటున్నారు. వీరి ఆలోచనలో ఎక్కడ పొరపాటో శ్రీ భగవాన్ చక్కగా వివరించారు.
దృష్టి ఎలాగో దృశ్యం అలాగేనన్న న్యాయం ప్రకారం, లోకాలని చూసే తాను ఎంత నిజమో, చూడబడే ఈ లోకపు వాస్తవికత కూడా అంతే. అందువల్ల అశాశ్వతమైన తాను, అంటే అహంకారం, ఒక అసత్యపు రూపమని *ఆత్మజ్ఞానం* చేత గ్రహిస్తే, ఇక జీవుడు చూసే ఈ లోకం కూడా యిప్పుడే అసత్యమని తెలుసుకోవచ్చు. తర్వాత యితర లోకాలనబడే స్వర్గనరకాలు అబద్ధమని నిర్ధారించవచ్చును. అయితే *ఆత్మజ్ఞానం పొందటానికి ముందు తానూ, ఈ లోకమూ నిజమని చూడటం చేత స్వర్గనరకాది లోకాలు కూడా వారి వారి పాప పుణ్యాల ఫలితాలకి తగినట్లు అనుభవించవలసిన లోకాలేయని అతను ఒప్పుకోవలసిందే. వాటిని అసత్యాలుగా చేయాలంటే వాటితో పాటు యీ ప్రపంచం, దానిని చూచే తాను, యిందులో జీవుస్తున్నట్లు కనబడే తన జీవితం అన్నీ అసత్యాలుగా చూడటమే తగిన మార్గం.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.178)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
No comments:
Post a Comment