Saturday, January 4, 2025

 *దైవలీలలు.....*

కనిపించే ప్రపంచమంతా భగవన్మయం. ఈ ప్రపంచాన్ని సృజించి అందులో తానుగా, తనలో సృష్టిగా దృశ్య ప్రపంచాన్ని ఇముడ్చుకొని భగవంతుడు సృష్టికి ఆధారభూతంగా అలరారుతున్నాడు.

ఏ అవకరమైనా దైవ నిర్దేశితమే. ఆయన సృజనను త్రికరణాలతో ఆమోదించడమే విజ్ఞత. ఆయన ఆజ్ఞకు భిన్నంగా సృష్టిలో ఏదీ రూపుదిద్దుకోలేదని గ్రహించాలి. ఏదో ఒక ప్రయోజనం కోసమే జీవుడికి సంపద గానీ, దురదృష్టం కానీ అందివచ్చిందని, సంపద సృష్టిలో జీవుడి ప్రయోజకత్వం గానీ దరిద్రంలో అతడి అసమర్థత గానీ లేవని సాధకుడు గ్రహించాలి.

ఏ ఒక్కరిపైనా దైవానికి ప్రేమ గానీ, ద్వేషం కానీ ఉండవు. ధర్మ పక్షపాతిగా ఆయన శ్రీకృష్ణావతారంలో పాండవుల పక్షాన నిలిచి వారి శ్రేయస్సును కాంక్షించాడు.

దైవం కరుణామయుడు. తన సృష్టిని ఆయన ఎన్నడూ ఛిన్నాభిన్నం చేయడు. ఆయన కరుణా స్వభావంతోనే సమస్త ప్రాణులకు భూమ్యాకాశ సముద్రాల్లో ఆహారం లభిస్తోంది. ఆయన స్తోత్రప్రియుడు. మనకు అన్నీ ఇచ్చిన పరమాత్మను స్తుతించడంలో విజ్ఞత ఉంది. తనను ఎవరైనా ప్రశంసిస్తే మనిషికి సంతోషం కలుగుతుంది. మనిషికి ఈ స్తోత్రప్రియత్వం భగవంతుడి లక్షణం నుంచే సంక్రమించిందని గుర్తించాలి.

మంచి చెడులు భగవంతుడి సృష్టి. విరుద్ధ లక్షణాలు గల మంచీచెడుల మధ్య సంఘర్షణ సహజం! జగత్తును సృజన చేసి ప్రాణుల జీవన నాటక అభినయాన్ని చూసి వినోదించడం ఆయన లీలలో భాగమేగానీ ఆయనకు ఏ ఒక్కరి పైనా ప్రత్యేక శ్రద్ధ ఉండదు. పరమాత్మ ప్రణాళికలో భాగంగానే సృష్టి-స్థితి-లయం జరుగుతాయి. సృష్టి ఎంత సహజమో లయం కూడా అంతే సహజం. అవి నివారింప వీలుకాని విషయాలని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టం చేశాడు. దుష్టులైన రాక్షసులను అవ్యాజ కరుణతో సంహారానంతరం తనలో ఐక్యం చేసుకున్న ఉదంతాలు పురాణేతిహాసాల్లో అనేకం కనిపిస్తాయి.

ఎల్లప్పుడూ ఆనందంగా సాత్వికాంశతో జీవించడం పరమాత్మను ఆరాధించడమే. ఆనందమే దైవం. ఆనందమయ సాత్విక జీవనమే దైవారాధన!

దయ, దానగుణం, ఉపకార బుద్ధి వంటి విశేష గుణాల సాధన భగవదారాధనలో అంతర్భాగంగా సాధకుడు గ్రహించాలి.

కొన్ని సంకల్పాలు బలమైన కోరికలుగా మారి అవి తీరక ఉవ్విళ్లూరిస్తూ జీవుణ్ని వేధిస్తాయి. పరితాపం పెంచుతాయి. అనుకోని కొన్ని లాభాలు వరాలై మన ముంగిట వాలతాయి.

బలహీనులపై బలవంతుల దాష్టీకం సృష్టి సహజమే అయినా అహేతుకంగా నిర్దయగా వ్యవహరించే వారి తీరు దైవాన్ని తిరస్కరించడమే అవుతుంది. దుష్టులు కొందరు ఏ రూపంలో అభివృద్ధి చెందినట్లు కనిపించినా ఏదో నాటికి వారి పతనం తథ్యమని చరిత్ర పలుమార్లు ఎలుగెత్తింది.

దానం, కరుణ వంటి సద్గుణాలు అందించే మధురభావ సంతృప్తి అనితర సాధ్యం. స్వార్థం, నిర్దయ వంటి అవలక్షణాలతో మనిషి ఎన్నడూ ఆనందంగా జీవించలేడు.

భౌతిక వస్తుసేకరణ తప్పు కాదు. కానీ వాటి వల్ల ఆనందం లభ్యమవుతుందన్నది ఓ భ్రమ మాత్రమే అంటారు జ్ఞానులు. ఆ సత్యాన్ని సాధకుడూ అనుభవంతో తెలుసుకుంటాడు. తోటివారి ధర్మయుత ఐశ్వర్యం అనసూయాపరులకు మోదాన్ని కలిగిస్తుంది. జనామోదమే దైవామోదమని సాధకుడు అనుభవంలో తెలుసుకుంటాడు.

భగవద్భక్తితో సాధించలేని ఏ లౌకిక విజయమూ ఉండదని పురాణేతిహాసాలు నివేదిస్తాయి. భక్తులకు ఆ మహాకార్యాలు పరమాత్మ సందేశాలని మానవుడు గ్రహించాలి.

No comments:

Post a Comment