Friday, January 3, 2025

 *స్తంభ నరసింహుని వైభవం*

‘ఇందుగలడందు లేడన్న సందేహం వలదు’ అన్న ప్రహ్లాదుడితో ‘ఏదీ ఈ స్తంభంలో చూపించు’ అంటూ హిరణ్యకశ్యపుడు గదతో మోదగానే స్తంభాన్ని చీల్చుకుని నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడనేది పురాణ కథనం. సరిగ్గా అదే సన్నివేశంతో నిర్మితమైంది కర్ణాటక, చిక్‌బళ్లాపూర్‌ జిల్లా, బిళ్లూరు స్తంభలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. గర్భాలయంలో స్తంభంలోంచి ఉద్భవించిన తీరులో మూలవిరాట్టు దర్శనమిస్తుంది. ఆ స్తంభం అపరిమితంగా పెరిగిపోతోందని ఉపరిభాగంలో ఉన్న శీలను దించి ఉపశ మింపజేశారట.

స్తంభ నరసింహుని వైభవం

చుట్టూ కొండల బారులు, మధ్యలో పంట పొలాలు, చెరువులు, కుంటలు, నివాసగృహాలు.. ఇలా ఓ సాధారణ గ్రామం బిళ్లూరు. అక్కడే గుట్ట మీద ఉందీ శ్రీ స్తంభలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. వివిధ రాష్ట్రాల నుంచే గాక ప్రవాస భారతీయులు కూడా ఈ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అల్లంత దూరం నుంచే నరసింహుని గుట్టపై రెండు భారీ విగ్రహాలు దర్శనమిస్తాయి. ఓ పక్కన రామలక్ష్మణులను తన భుజాలపై ఎత్తుకున్న ఆంజనేయుని 60 అడుగుల విగ్రహం, మరో పక్కన 40 అడుగుల ఎత్తున ఆశీనుడైన నాగాభరణాల పరమశివుని శిలాప్రతిమ. గుట్టపైకి వెళ్లే మెట్లమార్గానికి ఇరువైపులా వినాయక, సూర్యభగవానుల ఆలయాలుంటాయి. అలాగే గుడి ప్రాంగణంలో వేంకటేశ్వర, శ్రీరామ మందిరాలున్నాయి. చోళుల నాటి ఆంజనేయ ప్రతిమతో ఉపాలయం ఉంది. ఎన్నిసార్లు ఈ ఆంజనేయునికి ఆలయం కట్టాలన్నా గోడలు కూలిపోవటంతో ఆంజనేయునికిలా ఉండటమే ఇష్టం కాబోలని బహిరంగంగానే ఉంచారట. అందుకే ఇది బయలాంజనేయ ఆలయం అయ్యిందంటారు. 

No comments:

Post a Comment