పూజా పునస్కారాలెందుకు..............!!
లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే!
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి !!
భావం..!
నుదుట వ్రాసిన రాతలు చెరిపివేయడం..
బ్రహ్మ చేతకానీ, విష్ణువు చేతకానీ, శివుడి చేతకానీ ఎవరివల్లా కాదు.
విధిరేవ గరీయసి.!
భావం..!
పూర్వ కర్మలననుసరించి ఏది అనుభవించాలో నిర్దారింపబడి ఉంటుంది.
దానిని విధి అంటారు.
అది అనుభవించక తప్పదు.
ప్రారబ్ధం భోగతే నశ్యేత్.!
భావం..!
అనుభవించవలసినది ప్రారబ్ధం.
అది అనుభవించడం వల్ల పోతుంది తప్ప మార్చలేవు.
వీటిని తొలగించలేనప్పుడు పూజలు పునస్కారాలు చేసి ప్రయోజనం ఏమిటి?
ప్రారబ్ధం అనుభవించక తప్పదు అనేది సాధారణ నియమం మాత్రమే.
తగిన సాధన చేసి వీటిని కూడా మార్చవచ్చు.
విద్యుత్ తీగ మీద చెయ్యి వేస్తే షాక్ కొడుతుంది.
ఇది సామాన్య సూత్రం.
కానీ చేతికి రబ్బరు తొడుగు కట్టుకొని పట్టుకుంటే
షాక్ కొట్టదు.
అలాగే సాధన అనే కవచాన్ని పెట్టుకుంటే
ప్రారబ్ధం కూడా తొలగించుకోవచ్చు.
శుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిమ్.!
భావం..!
భగవంతుని ధ్యానించినట్లయితే అశుభములు తొలగిపోయి శుభ పరంపరలు కలుగుతాయి.
అశుభం..!
ప్రారబ్ధ వశాత్తు పూర్వ కర్మలననుసరించి వచ్చే దుఃఖములు,తప్పుడు పనులు చేయడానికి ప్రేరణలు.
ప్రారబ్ధం అనుభవించక తప్పదు
అని చతికిలపడిపోకూడదు.
యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యత్ చ దుర్గమం!
తత్ సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం!!
భావం..!
దేనిని మనం అసలు చేయలేం అనుకుంటామో,
దేనిని మనం పొందలేము అనుకుంటామో,
దేనిని సాధించలేము అనుకుంటామో,
అవన్నీ కూడా తపస్సు చేస్తే సాధ్యం అవుతుంది.
మానవుడు గతానికి వగచి ఏడుస్తూ కూర్చోకూడదు.
దుఃఖం ఎక్కువ ఉన్నప్పుడు తపస్సు పెంచుకోవాలి.
దేవతారాధన, నియమబద్ధమైన జీవితం,
ధార్మికమైన ఆలోచనా సరళి పెంచుకుంటూ
తపో మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించినట్లయితే అసాధ్యాన్ని కూడా
సుసాధ్యం చేసుకోగలము.
ఉదాహరణగా మార్కండేయుడు, సావిత్రి,
మొదలైన వారు..!
No comments:
Post a Comment