Vedantha panchadasi:
నాసఙ్గేఽ హంకృతిర్యుక్తా కథమస్మీతి చేచ్ఛృణు ౹
ఏకో ముఖ్యో ద్వావముఖ్యావిత్యర్థ స్త్రి విధోఽ హమః ౹౹ 9 ౹౹
9.అసంగమగు కూటస్థమునందు అహంభావము ఎట్లు కలుగుననినచో వినుము. "నేను" నకు ఒక ముఖ్యార్థము రెండు గౌణార్థములు మొత్తము మూడర్థములు గలవు.
అన్యోన్యాధ్యాసరూపేణ కూటస్థాభాసయోర్వపుః ౹
ఏకీభూయ భవేన్ముఖ్యః తత్ర మూఢైః ప్రయుజ్యతే ౹౹ 10 ౹౹
10.అవికారియగు కూటస్థమునకు ప్రతిఫలనమగు చిదాభాసునకు అన్యోన్యాధ్యాసచే ఏకీభావము కల్పించుటచే నేర్పడిన "నేను" ముఖ్యము.దీనిని మందబుద్ధులు ఉపయోగింతురు.
పృథగాభాసకూటస్థావముఖ్యౌ తత్ర తత్త్వవిత్ ౹
పర్యామేణ ప్రయుంఙ్తేఽ హం శబ్దం లోకే చ వైదికే ౹౹ 11 ౹౹
11.వేరువేరుగా చిదాభాసను కూటస్థమును "నేను" గా
భావించుట గౌణమైన అర్థము.
భేదాన్ని గమనించలేక రెండూ ఒకటే అనే భావంతో "అహం"(నేను)అనే శబ్దాన్ని వాడతారు.
లౌకిక వ్యవహారేఽ హం గచ్ఛామీ త్యాదికే బుధః ౹
వివిచ్యైవ చిదాభాసం కూటస్థాత్తం వివక్షతి ౹౹ 12 ౹౹
12. లౌకిక వ్యవహారములగు నేను పోవుచున్నాను మొదలగు ప్రయోగములందు జ్ఞాని పురుషుడు కూటస్థము నుండి చిదాభాసను వివక్షించియే "నేను"ను ఉపయోగించును.
అసఙ్గోఽ హం చిదాత్మాఽ హమితి శాస్త్రీయదృష్టితః ౹
అహంశబ్దం ప్రయుఙ్తేఽ యం కూటస్థే కేవలే బుధః ౹౹ 13 ౹౹
13.నేను అసంగుడను,నేను చిదాత్మను అని శాస్త్రీయదృష్టితో కూటస్థమును ఉద్దేశించియే జ్ఞాని పురుషుడు "నేను"అనే శబ్దమును ఉపయోగించును.
వ్యాఖ్య:-
అసంగమైన చిదాత్మయందు అహంప్రత్యయ మనేది - నేను అనే జ్ఞానం.
కుదరదు కదా?
అటువంటప్పుడు
"నేను ఉన్నాను" అనే జ్ఞానం ఎట్లా కలుగుతుంది .
కూటస్థబోధ కలిగినచో ఇక జీవునకు "నేను" అనే భావము కలుగుట సంభవమా అని సంశయము.
సంగరహితమగు కూటస్థముతో సంగమేర్పరచనిచో నేను కూటస్థముననే భావము కలుగజాలదు కదా.
ఈ సంశయమును వారించుటకు అహం శబ్దపుటర్థ భేదములను వివరింపబడు చున్నవి.
అహం ప్రత్యయానికి ఒక ముఖ్యార్థము.
రెండు గౌణార్థాలూ మొత్తం మూడు రకాలైన అర్థాలున్నాయి.
ముఖ్యార్థం ఏమంటే,
కూటస్థుడు,చిదాభాసము,
ఈ రెండూ పరస్పరాధ్యాసం వల్ల ఏకరూపమైపోగా అది 'అహం' (నేను)అనే శబ్దం యొక్క ముఖ్యార్థం అవుతుంది.
శబ్దానికున్నట్టి ముఖ్య శక్తి వల్ల ఆత్మ అనేది అహంప్రత్యయానికి విషయం కాకపోయినా లక్షణా వృత్తి వల్ల అహం ప్రత్యయానికి విషయం కావచ్చు.
జ్ఞానము లేనివారు కూటస్థమునకు చిదాభాసకు భేదమును ఎరుగలేరు కనుక రెండింటిని ఒకటిగనే భావించి "నేను"గా వ్యవహరింతురు.
దీనిని మందబుద్ధులు ఉపయోగింతురు.
గౌణార్థాము,
"అహం" శబ్దానికి వేరువేరుగా రెండర్థాలున్నాయి.
ఇవి గౌణార్థాలు -
ముఖ్యార్థాలు కానివి.
1)చిదాభాస 2)కూటస్థము.
తత్త్వజ్ఞానులైన వారు ఈ రెండు అర్థాల్లోనూ లౌకిక వైదిక వ్యవహారాల్లో అహంశబ్దాన్ని వాడుతుంటారు.
చిదాభాస అనేది లౌకికార్థం,
కూటస్థమనేది వైదికార్థంగానూ వాడతారు.తత్త్వమునెరిగిన
వారు ఈ అర్థములలో యథావశ్యకముగ "నేను"అనే శబ్దమును ఉపయోగింతురు.
అనగా తత్త్వవిచారమున "నేను" చే కూటస్థమును,
లోక వ్యవహారమున "నేను" చే
చిదాభాసను ఉద్దేశింతురని భావము.
మూఢులైనవారు మాత్రం కూటస్థ చిదాభాసలను భిన్నంగా చూడకుండా వాటి అవివిక్తరూపాన్ని ఒకటిగానే వ్యవహరిస్తారు.
తత్త్వవేత్తలైనవారు ఈ రెంటినీ వివేేచన చేసి వాటి వాటి స్వరూపాల్ని ఎప్పుడో వాడుతూ ఉంటారు.కాబట్టి వాటిని ముఖ్యార్థాలని అన్నారు.
జ్ఞాని పురుషుడు అవసరాన్ని బట్టి "అహం"శబ్దాన్ని వాడుతారు.ఎలాగంటే,
"నేను పోవుచున్నాను"
"నేను పెడుతున్నాను" లాంటి లౌకిక ప్రయోగాల్లో కూటస్థుని నుండి చిదాభాసమును వేరుచేసి,
ఆ చిదాభాసను వ్యక్తం చేయటం కోసమే "అహం"శబ్దాన్ని వాడతారు.
అహం శబ్దానికి లౌకికార్థం చిదాభాస అన్నమాట.
జ్ఞాని పురుషుడు శాస్త్రీయ పద్ధతిలో(వైదికార్థంలో)
"నేను అసంగుడను",
"నేను చిద్రూపుడను" అని ,
ఈ విధంగా కేవలం కూటస్థ చైతన్యాన్ని ఉద్దేశించియే "అహం"శబ్దంతో
చెపుతారు.
ఇది లక్షణావృత్తిలో వీరు చెప్పే రెండవ గౌణార్థం.
జ్ఞానితాజ్ఞానితే త్వాత్మాభాసస్యైవ న చాత్మనః ౹
తథా చ కథమాభాసః కూటస్థోఽ స్మీతి బుద్ధ్యతామ్
౹౹ 14 ౹౹
14.(ఆక్షేపము)జ్ఞానిత్వము,
అజ్ఞానిత్వము చిదాభాసను గూర్చియే చెప్పవలెను గాని కూటస్థమగు ఆత్మను గూర్చి కాదు. అట్లుండగా చిదాభాసుడు నేను కూటస్థమునని ఎట్లు తెలియగలడు ?
నాయం దోషశ్చిదాభాసః కూటస్థైక స్వభావవాన్ ౹
అభాసత్వస్య మిథ్యాత్వాత్కూటస్థత్వవ శేషణాత్ ౹౹ 15 ౹౹
15. (సమాధానము)అందు దోషము లేదు.చిదాభాసుడు వాస్తవముగ కూటస్థమే.
కూటస్థోఽ స్మీతి బోధోఽ పి మిథ్యాచేన్నేతి కో వదేత్ ౹
సహి సత్యతయాభీష్టం రజ్జుసర్ప విసర్పణమ్ ౹౹ 16 ౹౹
16.(ఆక్షేపము)చిదాభాసుని
'నేను కూటస్థమును' అను బోధ కూడా మిథ్యయే గదా ?
(సమాధానము) మిథ్యయే, కాదని ఎవరందురు ?
ఆరోపింపబడిన పాము కదలికలు సత్యమని ఎవరు స్వీకరింతురు ?
తాదృశేనాపి బోధేన సంసారో హి నివర్తతే ౹
యక్షానురూపో హి బలిరిత్యాహు ర్లౌకికా జనాః
౹౹ 17 ౹౹
17.మిథ్యయైనను అట్టి బోధచే మిథ్యయగు సంసారదుఃఖము నశించును గదా.ఏ దేవుడికి ఆ బలియని లౌకిక జనులందురు.
చూ.బ్రహ్మసూత్రములు
(భామతి) 4.1.16
వ్యాఖ్య:- చిదాభాసానికి(జీవునికి) తాను కూటస్థుణ్ణి అనే జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది ? అంటే,
జ్ఞానిత్వము,అజ్ఞానిత్వము అనే ఈ రెండూ కూడా ఆత్మాభాసకే ఉంటాయి తప్ప చిదాత్మ కు ఉండవు. అటువంటప్పుడు
"నేను కూటస్థుణ్ణి" అని చిదాభాస ఎట్లా తెలుసుకోగలుగుతుంది ? అడగటం సముచితమే అవుతుంది.
ఎందుచేతనంటే,
ఆత్మ అజ్ఞాన నివారణాన్ని ఆపేక్షించదు.
కూటస్థుడు కూడా తాను కూటస్థుడనని ఎరుగడాయె !
శంక అనవసరం, చిదాభాసము,కూటస్థము అనే ఈ రెండు భిన్నతత్త్వాలు కావు.
పైగా,చిదాభాసం అనేది కూటస్థ స్వరూపమే!
దర్పణంలో కనిపించే ముఖాభాసమనేది, మెండెం మీద ఉన్నట్టి ముఖమే తప్ప అన్యమైనది ఎట్లాకాదో
అట్లాగే ఈ విషయంలోనూ గ్రహించాలి.అంటే ,
చిదాభాసం, కూటస్థుని తన స్వరూపంగానే భావిస్తుంది.
వాస్తవమగు కూటస్థము మిథ్యయగు అంతఃకరణమున ప్రతిఫలింపగా చిదాభాస ఏర్పడును.
జ్ఞానము వలన అభాసత్వము తేలిపోవుటచే చిదాభాసయందు చిత్ మాత్రమే కూటస్థము మాత్రమే మిగులును.
అభాసత్వమే మిథ్య అగుటచే ఇక మిగులునది కూటస్థమే.
చిదాభాసం మిథ్యకాబట్టి, ఆ చిదాభాసాన్ని ఆశ్రయించి ఉన్నట్టి "నేను కూటస్థుణ్ణి" అనే జ్ఞానంకూడా మిథ్యే అని అంటారా ?
సరే, అట్లాగే అనండి !
ఎందు చేతనంటే, కూటస్థుడు తప్ప సమస్తమూ మిథ్యే కాబట్టి !
రజ్జువునందు ఆరోపింపబడిన సర్ప కదిలికలు గురించి మనం అనుకున్నట్లే ఇదీనూ !
సర్పము,సర్పజ్ఞానమూ రెండూ మిథ్యే !
మరి,జ్ఞానం మిథ్య అయినప్పుడు ఆ మిథ్యాజ్ఞానం వల్ల సంసారనివృత్తి ఎట్లా అవుతుంది.అంటే -
మిథ్యాజ్ఞానంవల్ల కూడా సంసారనివృత్తి జరుగుతుంది.
ఎందుచేతనంటే,సంసారం కూడా మిథ్య కాబట్టి !
"లోకంలో ఎటువంటి దేవతలకు (యజ్ఞానికి) అటువంటి బలే" అనే సామెత ఉంది కదా! అట్లాగే మిథ్య అయిన సంసారం మిథ్యాజ్ఞానంతోనే నివృత్తి కావాలి.
మిథ్యాజ్ఞానం గురించిన విమర్శలు అద్వైతముపైన
సాధారణములే.
అంతఃకరణము మిథ్య అయినచో అది కల్పించిన వేదాంత సిద్ధాంతము కూడా మిథ్యయే అని.
కాని ఏ మిథ్యకైనా ఆధారమగు సత్యమొకటి ఉండవలెను గదా.
కనుక వేదాంత సిద్ధాంతము మిథ్యయైనా దానికి ఆధారమగు బ్రహ్మము సత్యముగనే మిగులును.ఇక స్వప్నములోని ఆకలి స్వప్నములోని భోజనము వలననే తీరునట్లు మిథ్యయగు అజ్ఞానము మిథ్యయగు వేదాంత జ్ఞానము వలననే తొలగును.
No comments:
Post a Comment