*మార్గదర్శకులు మహర్షులు -14*
🪷
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి
*భృగుమహర్షి -2*
సరస్వతీనదీ తీరంలో ఒకనాడు మహర్షు లందరూ ఒక మహాక్రతువు చేసారు. వాళ్ళలో త్రిమూర్తులలో గొప్ప వాళ్ళెవరు అని ఒక ప్రశ్న వచ్చింది. బ్రహ్మా? విష్ణువా? రుద్రుడా? ఎవరు గొప్పవారు అని వారి సందేహం! అయితే గొప్పవాడు అంటే దేనిలో గొప్ప? ఆర్యధర్మంలో - అంతఃకరణ లో అత్యుత్తముడు ఎవడో వాడే అనిఅర్థం. నూరుతలలు, వేయిచేతులు ఉన్నవాడు గొప్పవాడు అని కాదు. అంతఃకరణలో అత్యుత్తమ గుణం ఉన్నవాళ్ళు ఎవరు అని ప్రశ్న.
త్రిమూర్తులు ముగ్గురినీ పరీక్షచేసి ఉత్తముడని నిర్ణయించవలసిన బాధ్యతకు ఈ భృగుమహర్షి తగినవాడు అని వాళ్ళు ఆయనకు ఆ పని అప్పగించారు. అంటే త్రిమూర్తులలోని తారతమ్యభేదాన్ని నిర్ణయం చేసే శక్తి ఆయనకుందనే అర్థం! కాని త్రిమూర్తులను పరీక్షించడం సాహసం కాబట్టి, భృగుమహర్షి సాహసలక్ష్మిని ప్రసన్నం చేసుకుని తన తపోబలాన్ని పెంచుకుని వెళ్ళాడు.
మొట్టమొదట ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మ ఎవరు? అనేక తపస్సులకు ఫలాన్నిచ్చేటటువంటి, ఆ ఫలాన్ని నిర్ణయించేటటువంటి ధర్మాన్ని సృష్టించాడు ఆయన. విశ్వకర్తలయిన మహర్షులను సృష్టించాడాయన. వసువులు, రుద్రులు, సిద్ధులు, సాధ్యులు, విశ్వకర్మలు, విశ్వేదేవతలు, పితృదేవతలు - వీళ్ళందరికీ ఆయన తండ్రి. సృష్టికర్త. వాళ్ళంతా పరివేష్టించి ఆయనను స్తోత్రం చేస్తున్న సమయంలో భృగుమహర్షి ఆ బ్రహ్మలోకసభకు వెళ్ళాడు.
ఆయన బ్రహ్మకు నమస్కరించలేదు. స్తోత్రం చేయలేదు. దర్పంగా దండమండ లాలతో నిలబడ్డాడు. ఆయన వైఖరికి బ్రహ్మకు కోపం వచ్చింది. తన సభలో జగత్పూజ్యుడైన తనను గౌరవించకుండా, నమస్కరించకుండా దర్పంగానిలబడేసరికి భృగువు మీద బ్రహ్మకు తీవ్రమయిన కోపంతో ముఖం ఎర్రబడింది. ఆ తీవ్రమైన క్రోధంతో సెగలు బయటికి వచ్చేసినవి. అప్పుడు తన కమండలంలోని మంత్ర జలం బ్రహ్మమీద చల్లి ఆయనను శాంతింప చేసి చల్లబరచాడు భృగువు. చల్లబరచిన తరువాత ఆయనతో, "ఇందుకోసమే నేను వచ్చాను. నేను చేసిన పరీక్ష పూర్తయింది" అని చెప్పి వెళ్ళిపోయాడు.
అక్కడినుంచీ పార్వతీసహితుడై ఉండే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. శివుణ్ణి స్తోత్రం చేసి నమస్కరిస్తే, ఆయన ప్రసన్నుడై దగ్గరకువచ్చి చెయ్యిజాపి కరగ్రహణం చేసి ఆసనం మీద కూర్చోమన్నాడు స్వయంగా. అయితే ఆ చెయ్యి అందుకోకుండా దర్భంగా నిలబడి మళ్ళి ఆయనను చూసాడట! మొదట స్తోత్రం చేసాడు. ఆయన దగ్గరికొచ్చాడు. ఆయనను మళ్ళీ గౌరవించలేదు. "నీగౌరవం నాకక్కరలేదు" అన్నాడు భృగువు. రుద్రుడికి ఆయన చర్య వల్ల కోపం వచ్చింది. స్తుతికి ప్రసన్నుడైతే అవమానానికి క్రోధం వచ్చినట్లే. మొదటిది ఉంటే రెండోది ఉన్నట్లే!
"నేను నిన్ను మన్నించి ఆదరిస్తే నువ్వు నన్ను అవమానించావు. నిన్ను శిక్షిస్తాను" అని ఆగ్రహించాడు రుద్రుడు.
"ఈ భృగువు జగత్పూజ్యుడైన ముని. ఏ కారణంచేత ఆయన ఇలా చేసాడో, శాంతించండి ప్రభూ!" అని ఆయనను వారించింది అమ్మవారైన పార్వతీదేవి. శాంతించి మౌనంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు భృగుమహర్షి.
వైకుంఠంలో శ్రీమహావిష్ణువు శేషశయనం మీద పవళించి ఉండగా, ఆయనను చూచి కూడా స్తోత్రం చెయ్యలేదు. పైగా ఆయనకు కాలితో తన్ని అవమానించాడు. మొదట బ్రహ్మకు నమస్కరించలేదు. శివుడిని స్తోత్రం చేసినప్పటికీ అవమానించాడు. ఇప్పుడు విష్ణువును కాలితో తన్నాడు. వెంటనే మహావిష్ణువు దిగివచ్చి, "తపోధనా! నన్ను తన్నినందుకు కఠినమైన నా హృదయం తాకినందువలన నీ కాలు ఎంతో నొప్పిపుట్టి ఉండవచ్చు. అసలు నీ రాకచూసి నేనే వచ్చి నీకు నమస్కరించ వలసింది. అలా చేయని కారణం చేత నన్ను శిక్షించి బాగుచేసావు. నీ పాదం నా హృదయానికి తగులుట చేత నా హృదయంలో ఉన్న సమస్తలోకాలు పవిత్రమైనవి. కాబట్టి నీ రాకతో నేను ధన్యుణ్ణి అయినాను. ఈ రత్న సింహాసనం మీద కూర్చోవలసింది. ఉపచారాలు చేస్తాను" అని అన్నాడు.
ఈ సంభాషణ అంతా అయిన తరువాత ఇక భృగువు ఏమంటాడు! కరిగిపోయాడు. సజలనేత్రాలతో విష్ణువును స్తోత్రం చేసాడు.
“నిన్సు ఎవరు పరీక్ష చేయగలడు? ఏ పరీక్షకయినా మేము ఆగలేము. కాని నిన్ను పరీక్ష చేసే అధికారం మాకు లేదు కదా! నువ్వు అన్నిటికి అతీతుడివి. త్రిగుణాలకు అతీతుడివి" అని సర్వవిధాల స్తోత్రం చేసి, మళ్ళీ భూలోకంలో సరస్వతీ నది తీరానికి వచ్చి మహర్షులందరికీ విష్ణువు యొక్క మహత్తు చెప్పాడు. ఆయనే అందరిలోనూ ఉత్తముడు అని తేల్చి చెప్పాడు. భాగవతం దశమ స్కంధంలోనూ ఈ కథ ఉంది. అయితే పద్మపురాణంలో శివుడని పేర్కొనబడింది. ఇంకా అనేక పురాణాలలో అనేక విధాలుగా ఈ కథలు పేర్కొనబడినవి.
భృగువు పాదంలో ఉన్న నేత్రాన్ని విష్ణువు తీసేసాడని కొందరంటారు. వేంకటేశ్వర మాహాత్మ్యంలో పుట్టిన కథ అది. అలా ఏమీచేయలేదని మరికొందరి అభిప్రాయం. అందుకే భృగువు అంతటి శక్తివంతుడు అయ్యాడు అన్నారు. అదంతా కేవలం పురాణమే. వేంకటేశ్వర మాహాత్మ్యాన్ని చెప్పడం కోసం కల్పించి ఉండవచ్చు. లక్ష్మి వెళ్ళిపోయిందని, ఆమెకు కోపం వచ్చిందని అన్నారు. పూర్వ అష్టాదశ పురాణాలలో ఎక్కడాకూడా ఆ గాథ లేనేలేదు.
📖
ఇట్లాంటిదానికి మరొక ఉదాహరణ సత్యనారాయణ వ్రతకల్పం. భక్తులచేత మర్యాదచేయించుకోవడం కోసం ఆయన ఎన్ని ముప్పుతిప్పలు, ఎన్ని అవస్థలు, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఆ వ్రతకల్పం చదివితే తెలుస్తుంది! తనకు నమస్కారం చేయించుకోవటానికి ఓడను ముంచేయటము, నమస్కారం చేసిన తరువాత ఓడను తేల్చడము, ప్రసాదం తీసుకోకపోతే మళ్ళీ ముంచటము - 'అసలు ఆయన ఇన్ని బాధలెందుకు పడాలి? ఆయనకేం కర్మ! ఆయన విష్ణువే కదా!' అని ప్రశ్నలు కలుగవచ్చు. ఈ కథలిలా కల్పించబడటానికి వాటిల్లో ఏదో చిన్న పరమార్థం ఉంటుంది. కానీ ఆ కల్పనంతా యథార్థంగా తీసుకోకూడదు. పురాణం ఎల్లకాలాల్లోనూ వ్రాస్తూనే ఉన్నారు. మనం వాటిలోని సారాంశాన్ని గ్రహించి మెలగాలి.
అందుకని త్రిమూర్తులను పరీక్షచేసిన తరువాత, శ్రీమహావిష్ణువే ఈ సృష్టిలో పరమపూజ్యుడు అని, పరమ సత్యగుణ సంపన్నుడనీ నిర్ణయం చేసి చెప్పాడాయన.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment