Sunday, October 26, 2025

 🌊🌊" "చూపు లేకపోయినా ముందు చూపు గల గుడ్డివాడు ""

అదొక మారుమూల కుగ్రామం, కాలినడక ప్రయాణాలు మాత్రమే ఉన్న ఆ పాత రోజుల్లో, ఆ ఊరిలో ఇద్దరు ఆప్తులు ఉండేవారు — ఒకరు గుడ్డివాడు, మరొకరు కుంటివాడు. వారిద్దరూ కేవలం స్నేహితులు కాదు, ఒకరికొకరు తోడుగా నిలిచే చెడ్డీ దోస్తులు.

వారి ఊరికి చాలా దూరంలో ఓ పెద్ద తిరునాల జరుగుతోంది. దానికి వెళ్లాలని ఇద్దరూ అనుకున్నారు. ప్రయాణం కష్టం కదా, అందుకే ఒకరినొకరు ఆసరా చేసుకున్నారు. కుంటివాడు దారి చూపడానికి గుడ్డివాడి భుజాలపై కూర్చున్నాడు, ఆ గుడ్డివాడు ప్రేమగా ఆ బరువును మోస్తూ, కాలిబాట వెంట నడక సాగిస్తున్నాడు. ఈ దృశ్యం చూస్తే, ఒకరి కొరతను మరొకరు ఎలా తీర్చుకున్నారో అర్థమవుతుంది.

తెలతెలవారక ముందే మొదలైన వారి ప్రయాణం, మధ్యాహ్నం అయ్యేసరికి ఉగ్రరూపం దాల్చింది. నిగనిగ మెరుస్తున్న సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. సూర్యుని వేడి కంటే, పొట్టలో ఆకలి మంటలు నకనకలాడుతూ పిండేస్తున్నాయి. . ఆకలికి "అన్నమో రామచంద్ర!" అని గుడ్డివాడు కుంటివాడితో వాపోగా, "ప్రాణము పోసిన వాడు నీరు పోయడా" పదా ముందుకు అని కుంటివాడు సముదాయిస్తూ నత్తనడకలా సాగుతున్నారు ముందుకు ఆ అంగవికలురు.

ఏదో ఒక ఊరు దొరక్కపోతుందా అని, దారివైపు "కళ్లు కాయలు కాసేలా చూస్తూ " ముందుకు సాగుతున్నారు ఆ అంగవికలురు.

ఇంతలో... భుజాలపై ఉన్న కుంటివాడు సంతోషంతో, ఎగిరి గంతేసినట్లు "అబ్బా! ఆకలి తీరిందిరా! అల్లంత దూరానా, దారి ప్రక్కనే ఉన్న ఓ మామిడి చెట్టు క్రింద కుప్పలు తిప్పలుగా మామిడి పండ్లు పడి ఉన్నాయ్!"

గుడ్డివాడు : "తొందర పడకురా సుందర వదనా! మెరిసేదంతా బంగారం కాదురా! ఈ బాటలో మనుషులు వస్తూ పోతూ ఉన్నారా? చెప్పు."

కుంటివాడు: "లేదురా! కనుచూపు మేర మానవ సంచారమే లేదురా!"

గుడ్డివాడు: "పోనీ! ఆ చెట్టుకు కంచె వేసి ఉంచారా!?"

చూపు గల కుంటివాడు: "లేదురా!"

ముందుచూపు గల గుడ్డివాడు : గట్టిగా పకపక నవ్వుతూ ఇలా అన్నాడు: "ఓరే పిచ్చివాడా! అవి తినే కాయలు కాదురా! అవి పిచ్చికాయలు (అడవి మామిడి పండ్లు)! తినేవైతే, ఇంత జన సంచారం లేని చోట, అదీ కంచె లేకుండా, దారి ప్రక్కన కుప్పలు కుప్పలుగా పడి ఉండేవి కావు కదా!"

దృష్టి ఉన్నా, కుంటివాడు గ్రహించ లేని ఆ సత్యాన్ని అనుభవం, ఆలోచన, ముందు చూపుతో గుడ్డివాడు చూడ గిలిగాడు కదా.

🌊 మనం దృష్టి ఉన్నా.. ముందుచూపు లేని మానవులం కదా !

~~ ఇద్దరూ శారీరకంగా అంగవైకల్యంతో ఉన్నా, ఒకరికొకరు తోడుగా నిలిచి, ప్రయాణాన్ని సాగించారు. ఈ కథలో కుంటివాడు చూపు ఉన్నవాడు, గుడ్డివాడు చూపు లేనివాడు. కానీ చివరికి, ఎవరు నిజంగా "చూశారు" అనేది మనల్ని ఆలోచింపజేస్తుంది ఈ కద.

~~ చూపు అంటే కేవలం కళ్లతో కనిపించేది కాదు. అది ఒక పరిమితి కలది. మనం చూస్తున్నది నిజమా? తినదగినదా? నమ్మదగినదా? అనే ప్రశ్నలకు చూపు సమాధానం ఇవ్వదు. కుంటివాడు మామిడి పండ్లు కనిపించాయి కాబట్టి, అవి తినదగినవే అనుకున్నాడు. ఇది తక్షణ స్పందన.

~~ ముందుచూపు అనేది అనుభవం, ఆలోచన, వివేకం, మరియు లోతైన విశ్లేషణల సమ్మేళనం. గుడ్డివాడు తన చూపు లేకపోయినా, అనుభవంతో ఆ పండ్లను విశ్లేషించాడు. "ఇక్కడ జన సంచారం లేదు, కంచె లేదు, కాయలు కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయి — ఇవి తినదగినవేనా?" అని ప్రశ్నించగలిగాడు. ఇది దూరదృష్టి, ఇది జీవన జ్ఞానం.

🌟 ఈ కథ మనకు నేర్పే జీవన పాఠాలు:

~~ తక్షణ లాభం కంటే దీర్ఘకాలిక పరిణామం ముఖ్యం . మెరిసే అవకాశాలు వెంట పరిగెత్తే ముందు, వాటి వెనుక ఉన్న నిజమైన విలువను అంచనా వేయాలి.

~~ సమాచారం ఉన్నా, వివేకం లేకపోతే ప్రమాదమే. నేటి ప్రపంచంలో సమాచారం చాలా ఉంది. కానీ ఆ సమాచారాన్ని వివేకంతో వాడే ముందు చూపు లేకపోతే, అది మోసపోవడానికి దారి తీస్తుంది.

~~ అనుభవం అనేది చూపుకన్నా గొప్ప ఆయుధం . కళ్లతో కనిపించని విషయాలను, మనసుతో, అనుభవంతో, ఆలోచనతో చూడగలగడం — అదే నిజమైన చూపు.

🪞 ఇది మన జీవితంలో ఎలా వర్తిస్తుంది ?

- ఉద్యోగం ఎంచుకునేటప్పుడు, కేవలం జీతం చూసే చూపుతో కాకుండా, వృద్ధి అవకాశాలు, ఆత్మసంతృప్తి వంటి అంశాలను ముందుచూపుతో చూడాలి.

- పెట్టుబడి పెట్టేటప్పుడు, తక్షణ లాభం కాకుండా, దీర్ఘకాలిక స్థిరతను విశ్లేషించాలి.

- సంబంధాలను ఏర్పరచుకునేటప్పుడు, బాహ్య ఆకర్షణ కాకుండా, అంతరంగ విలువలు చూసే ముందు చూపు అవసరం.

No comments:

Post a Comment