Tuesday, October 28, 2025

 ప్రార్థన 👌

రెండు చేతులు మోకరిల్లి 
రెండు పెదాలతో శబ్దం చేయడం ప్రార్ధన కాదు..
మన ఆంక్షలు అన్ని కుప్ప పోసి 
నివేదనగా సమర్పించడం కాదు 
 ప్రాణ భయంతో విలువిల్లాడుతూ 
 రక్షించమని ప్రాధేయపడుతూ.. ఒక అభద్రతతో చేసిన విన్నపము కాదు..

 నీవు చేస్తున్న భజనలు, కీర్తనలు ఉపవాసాలు, ప్రార్థనలు, నైవేద్యాలు, సమర్పణలు ఇవేవీ ప్రార్థనలు కావు...
నీటిలో ఇదే చేప సముద్రాన్ని ఏమి కోరింది...
వర్షిస్తున్న మేఘం నేలను ఏమడిగింది..
పుష్పిస్తున్న పూలకు సౌరభం  ఎక్కడిది...
పరుగులు తీస్తున్న నీటిలో దాహం ఎక్కడిది?
ఇవేవి ప్రార్ధన ఫలాలు కావు....
జీవనం వైవిద్యాలు!!

నీతో నీవు చేసే నిరంతరప్రయాణమే ప్రార్ధన!
హృదయ బాషలో మాట్లాడటం..
ప్రేమ నిఘంటువులో శబ్దరహిత
పదాలు ఏరుకోవడం...
ఒకరి కన్నీటికి, వేదనకి 
కారణం కాకుండా జీవించడం..
అంతరంగంలో శుభ్ర గంగను
ప్రవహింప చేసుకోవడం....
ఆకలితో అలమటించే వారికి
ఒక అన్నం ముద్దగా మారిపోవడం...
పెదాలు, శ్వాస పెనవేసుకుని ఒక లయలో జీవం అయిపోవడం!!

ప్రదర్శన ప్రార్ధన కాదు
జీవితమే ప్రార్థన, మదిగదిలో మౌనమే దాని అంగీకారం!!
నీ పెదాల మీద సహస్రదళ పద్మాలు
చిరునవ్వుగా మారడం....

కీర్తికిరీటాలు నీ ప్రార్ధనల పుణ్యఫలాలేమి కావు
నీ జీవనయాణంలో, శ్రమయాగం నుండి పుట్టిన మధురఫలాలు..
ప్రోగుచేసుకున్న నీ సంపద... నీదికాదు... ఎందరో రెక్కల, డొక్కల స్వేధం...
నీవు పంచవాల్సిన కర్తవ్య బోధ!!

నీవే ఒక చెట్టువైపో
నీడల పరుపుపై ఎందరో విశ్రమిస్తారు
నీవే నీటి చెలిమవైపో...
దప్పికగొన్నవారు తోడుకుని గొంతు తడుపుకుంటారు...
నీవే నేలగా మారు..
హాలికుల చెమటతో  ప్రేమ పంట పండుతుంది...
నీవే ఒక నదిగా మారిపో..
కొండల హృదయాల్ని స్పర్షిస్తావు!!
నీవే ఒక ప్రార్థన గా మారిపో!!
కృతజ్ఞతతో  ఫలవంతమైతావు

Dr తుమ్మల దేవరావ్,నిర్మల్
(నా జెన్ కవితల నుండి)

No comments:

Post a Comment