శ్రీ రమణ మహర్షికి ఆత్మానుభవం ఆయన ప్రయత్నం, ప్రమేయం ఇసుమంతైనా లేకుండా కలిగింది. ఆత్మానుభవం కలిగే సమయానికి మహర్షి ఆత్మ, బ్రహ్మము, జీవాత్మ, పరమాత్మ, అద్వైతం, ద్వైతం వగైరా తత్త్వశాస్త్ర పారిభాషిక పదాలను విననే లేదు. ఆయనకు సహజంగా బ్రహ్మానుభవం కలిగింది. ఆ కలిగినది ఆత్మానుభవం అని ఆయనకు తర్వాత్తర్వాత గ్రంథం పరిచితితో తెలిసింది.ఆ గ్రంథాలలో తనకు కలిగిన అనుభవాన్ని ఎంతో విశదంగా వివరించి ఉండడం ఆయనను అబ్బుర పరిచింది. ఆయనకు తత్త్వశాస్త్ర పారిభాషిక పదాల జ్ఞానం కలిగించింది. ఇలా వ్యక్తి ప్రయత్నం, ప్రమేయం లేక భగవదనుభవం కలగడానికి భగవదనుగ్రహం కారణం. ఇలా జరిగినప్పుడు దానిని మార్జాల కిశోర న్యాయము అంటారు. తల్లి పిల్లి తన పిల్లలను తానే నోటితో కరుచుకొని చోట్లు మారుస్తూ ఉంటుంది. పిల్లి పిల్లల ప్రయత్నం, ప్రమేయం ఇందులో అణు మాత్రమూ ఉండదు. అంతా తల్లి పిల్లే చూసుకుంటుంది. మరొక న్యాయం ఉంది. దానిని కపి కిశోర న్యాయము అంటారు. ఇందులో తల్లి కోతి పిల్ల కోతి పట్ల పూర్తియైన నిర్లక్ష్యం చూపిస్తుంది. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి, కొమ్మల మీద గెంతుతున్నప్పుడు, పిల్లకోతే తల్లికోతిని గట్టిగా కరుచుకుని ఉంటుంది. ఇలా ఈ రెండు రకాల భక్తులుంటారని సాంప్రదాయం చెబుతుంది. భగవంతుని లీలలు, అనుగ్రహాలు అలా వివిధములు, విచిత్రములు, దురవగాహ్యములు. కొందరిపై భగవదనుగ్రహం తనంత తాను పన్నీరుగా కురుస్తుంది. కొందరిపై శరన్మేఘంలా చుక్కైనా రాల్చదు. శ్రీ రమణ మహర్షికి సహజంగా, అప్రయత్నంగా ఆత్మానుభవం అవడం అలా మార్జాల కిశోర న్యాయము. మదురైలో మొట్టమొదటి సారిగా కలిగిన అనుభవం, తిరువణ్ణామలైకి రావడం, అప్పటినుంచి వారాలుగా నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండడం, ఆలయం పాతాళ గుహలో, ఆ పై జీవితాంతం తిరువణ్ణామలైలో సవికల్ఫ సమాధిలో ఉండి భక్తులకు, ముముక్షువులకు ఆధ్యాత్మిక, తత్త్వ మార్గ నిర్దేశనం చేయడం అంతా ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఆయన తిరువణ్ణామలై వచ్చాక తన జీవితం ఎలా తీసికెళ్ళితే అలా ఏవిధమైన ప్రతిఘటన లేకుండా జీవించారు. భగవత్ సంకల్పానికి ఎదురు ఈదలేదు. కలిగిన ప్రారబ్ధాన్ని తామరాకు మీద నీటి బొట్టులా అనుభవించారు. ఆశ్రమం ఆయన ఏర్పరచుకున్నది కాదు. తన చుట్టూ ఏర్పడుతోంటే అడ్డుకోవడం చేయలేదు. తల్లి బాధ్యత తీరిపోయాక ఆయనకు ఒంటరిగా జీవించాలని ఉండేది. కాని ఆశ్రమం ఏర్పాటుని భగదాదేశంగా భావించి మిన్నకున్నారు. ఆశ్రమం ఏర్పడి ఆయన ప్రమేయం లేకుండా ఒక పెద్ద సంసారమునే ఆయన ఈదాల్సి వచ్చింది. తన చుట్టూ ఉన్న భక్తుల ప్రకోపాలను, ఆశ్రమ నిర్వాహకుల చర్యలను ఎంతో నిర్లిప్తతతో గమనించారు. ఆశ్రమంలో ఆయన కూరగాయలు తరిగేవారు. "గృహస్థు" లాగానే జీవించారు. కాని ఎన్నడూ ఆ లంపటంలో చిక్కుకోలేదు. ఆయన పూర్ణ జ్ఞాని కనుక తన ఇష్టాయిష్టాలను పరిగణించుకోలేదు. నిజానికి ఆయనకు ప్రస్ఫుటమైన ఇష్టాయిష్టాలు లేవు. తల్లి తనతో జీవించడానికి వస్తే అంత నిర్లిప్తంగానూ తన బాధ్యత నెరవేరుస్తున్నట్టు తెలియకుండా, తెలియనీయకుండా నెరవేర్చారు. జ్ఞానికి బంధాలు వారిని బంధించవు, కాని అంత నిస్సగంగానూ విధ్యుక ధర్మములను నెరవేరుస్తారు. జ్ఞాని బంధాలను అంటించుకోకుండానే బాధ్యతలను నెరవేరుస్తారు, నెరవేర్చవచ్చు అని శ్రీ రమణ మహర్షి జీవితం మనకి తెలియజేస్తుంది. సన్యాసము అంటే మానసిక సంన్యాసమనీ, బాహిరంగా సంగం, అంతరంగంలో నిస్సంగం అని ఉదాహరణ పూర్వకంగా జీవించి, మనకు ఆదర్శప్రాయులయ్యారు. గృహస్థ జీవితమూ అలా గడపవచ్చు అని తెలియజేశారు. జ్ఞాని ఎప్పుడూ విధ్యుక్త ధర్మములను నిర్లక్ష్యం చేయడు. కుహనా జ్ఞానులే రికామీగా తిరుగుతూ శిష్యగణములను సమీకరించుకుని, ఆస్తిపాస్తులు సంపాదించుకుని సాధారణ గృహస్థు కన్నా ఎక్కువ లంపటాలలో ఉంటారు. డబ్బు, కీర్తి ప్రతిష్టలు, శిష్యురాళ్ళ సామీప్యము వారిని వివశులను చేస్తాయి. వారి సన్యాసము ఉదరపోషణార్ధం తప్ప మోక్ష పిపాసులై తరించడానికి కాదు. భగవంతుడు మనలను ఆయన సంకల్పానికి అనుగుణంగా నడుపుతాడు. దీనిని ప్రారబ్ధం అంటారు. గత జన్మ నుంచి వచ్చినది సంచితమనీ, మరు జన్మకు సంబంధించిన కర్మను ఆగామి అని అంటారు. జన్మ, పునర్జన్మల అసలు స్వభావం తెలిస్తే మన జీవితంపై మన అవగాహన పెరుగుతుంది. మెళుకువ మానసిక దశలో కలిగే అహంకార జననాన్ని, ప్రాదుర్భావాన్ని జన్మ అనీ, రాత్రి గాఢనిద్రలో ఈ అహంకారం, అహంభావం, మమకారాలు సమసిపోవడాన్ని మరణం అనీ అంటారు. మెళుకువ, కల మానసిక దశలలో మనకు జన్మ కలుగుతుంది. గాఢనిద్రలో మరణం సంభవిస్తుంది. జ్ఞానుల స్థితిని మెళకువతో కూడిన నిద్ర - జాగ్రత్ సుషుప్తి అంటారు. శాంతము అన్నా, ఆనందము, మౌనములన్నా, మోక్ష ప్రాప్తి అన్నా ఇదే. ఈ జాగ్రత్ సుషుప్తి దశ వారికి జీవితాంతం మాయకుండా, మారకుండా, ఉంటుంది. వారిని జీవన్ ముక్తులు అంటారు. జీవించి ఉండగానే వ్యక్తిత్వం నాశనమై, శుధ్ధాహం కలిగి, వారికి "నేను" ఆ శుద్ధాహంతోఅన్వయింపబడి ఉంటుంది. ఇదే అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఆనందో బ్రహ్మా
నేను’ కన్నా భిన్నంగా ఏదీ లేనప్పుడు, అంతా ‘నేనే’ అయినప్పుడు జీవితంలోని ద్వంద్వాలు అన్నీ అంతరించిపోతాయి. చావు పుట్టుకల అర్థం, సృష్టి- స్థితి- లయాలకు ఉన్న పరమార్థం అవగతం అవుతుంది. ఆధ్యాత్మికం అంటే మేధాశక్తి కాదు. ఉన్నతమైన ఆదర్శం కాదు. నైతికమైన ప్రవర్తన కాదు. నియమ నిష్ఠలు కాదు. మతపరమైన విశ్వాసాలు కాదు. ఉత్సాహంతో కూడిన భావతీవ్రత కాదు. అత్యుత్తమమైన ఈ లక్షణాల రాశి కూడా కాదు! మన అంతరంగంలో స్థిరమైన సత్యం ఒకటి ఉంది. మన మనస్సుకూ, జీవశక్తికీ, దేహానికీ కూడా అది అతీతమైనది. అది మనలోనే కాదు, సకల సృష్టిలోనూ ఉంది. ఆ అతీత సత్యంతో మనం ఏకం కావాలి. సన్నిహితం కావాలి. సంయోగం కావాలి. మనలో ఉన్న ఆకాంక్షా జ్వాల అందుకోసమే! అదే ఆధ్యాత్మికం అంటే! నేను ఎవరిని? ఈ ప్రపంచం ఏమిటి? ఈ ప్రపంచంలోని చావు పుట్టుకలు ఎక్కడి నుంచి వచ్చాయి? పుట్టుకకు ముందు నేను ఉన్నానా? మరణం తరువాత నేను ఉంటానా? ఉంటే ఎలా ఉంటాను? ఈ చావు పుట్టుకల వలయంలోకి నేను రావడం ఎందుకు జరిగింది? ఇన్ని బాధలు పడడం ఎందుకు? ఈ జగత్తులోకి నేను రావడానికి కారణం ఏమిటి? ఏది సాధించాలని వచ్చాను? ఏం చేస్తున్నాను? చేయాల్సిందే చేస్తున్నానా? లేక తప్పటడుగులు వేస్తున్నానా? ఈ రహస్యం తెలిసేదెలా? ఈ ప్రశ్నలు ఈనాటివి కావు. అనాదిగా మానవుణ్ణి వేధిస్తున్నవే! వీటన్నిటికీ సమాధానాలు మన మహర్షులు ఏనాడో కనుగొన్నారు. ‘‘అన్నిటికీ మూలం ‘నేను ఎవరిని?’ అనే ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకుంటే మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు వాటంతట అవే దొరుకుతాయి’’ అంటారు భగవాన్ శ్రీరమణ మహర్షి. అందుకే ‘‘నేనెవరిని అనేది ముందు తెలుసుకో!’’ అని చెప్పారు ఆ మహానుభావుడు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ ‘అహం బ్రహ్మాస్మి’ అని ఒకే ఒక వాక్యంలో ‘బృహదారణ్యకోపనిషత్తు’ సమాధానం చెప్పింది. ‘అహం’ అంటే ‘నేను’. ‘బ్రహ్మ’ అంటే సర్వానికీ మూలం అయిన పరతత్త్వం. ‘అస్మి’ అంటే ‘అయి ఉన్నాను’ అని అర్థం. మనలో రెండు ‘నేను’లు ఉన్నాయి. ఒకటి అజ్ఞానంలో ఉన్న ‘నేను’. ఈ ‘నేను’కు అసలైన ‘నేను’ ఎవరో తెలీదు. మరొకటి అన్ని ‘నేను’లూ నేనైన ‘నేను’! వీటిలో మొదటిది రెండవ దాన్ని తెలుసుకొని, దానిలో ఏకమైనప్పుడు- మొదటిది తన ఉనికిని కోల్పోతుంది. అసలైన ‘నేను’ మిగులుతుంది. అదే ‘బ్రహ్మ’. ‘ఓం తద్బ్రహ్మ’ అంటుంది మంత్రపుష్పం. ఇప్పుడు మనకు అనుభవంలో ఉన్న ‘నేను’ ఈ దేహానికే పరిమితమై, తన ఉనికిని అంతటితోనే సరిపెట్టుకుంటోంది. ‘నేను వేరు- మిగిలినవారందరూ, ఈ ప్రపంచమంతా నాకన్నా భిన్నమైనది’ అనుకుంటోంది. ఈ ‘నేను’ ఎక్కడ ఉందో అక్కడ ‘నాది’ అనేది కాచుకొనే ఉంటుంది. ఈ ‘నేను - నాది’ అనేవే అహంకార - మమకారాలు. ఇవి ఎక్కడ ఉన్నాయో అక్కడ సుఖ దుఃఖాలు, వెలుగు చీకట్లూ, ఈర్ష్య అసూయలు, పగ ప్రతీకారాలు, అభిమాన దురభిమానాలు, జయాపజయాలు... ఇలా ద్వంద్వాలన్నీ ఉంటాయి. వీటన్నిటినీ జయించేందుకే ఆధ్యాత్మిక సాధన - అంటే ఈ ‘నేను’ను ఆ ‘నేను’తో కలిపే సాధన అవసరం అవుతుంది. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? దాన్ని గురించి శ్రీఅరవిందులు ఇలా చెప్పారు: ‘‘ఆధ్యాత్మికం అంటే మేధాశక్తి కాదు. ఉన్నతమైన ఆదర్శం కాదు. నైతికమైన ప్రవర్తన కాదు. నియమ నిష్ఠలు కాదు. మతపరమైన విశ్వాసాలు కాదు. ఉత్సాహంతో కూడిన భావతీవ్రత కాదు. అత్యుత్తమమైన ఈ లక్షణాల రాశి కూడా కాదు! మన అంతరంగంలో స్థిరమైన సత్యం ఒకటి ఉంది. మన మనస్సుకూ, జీవశక్తికీ, దేహానికీ కూడా అది అతీతమైనది. అది మనలోనే కాదు, సకల సృష్టిలోనూ ఉంది. దానికి ఆధారంగా కూడా ఉంది. ఆ అతీత సత్యంతో మనం ఏకం కావాలి. సన్నిహితం కావాలి. సంయోగం కావాలి. మనలో ఉన్న ఆకాంక్షా జ్వాల అందుకోసమే! అదే ఆధ్యాత్మికం అంటే! ఈ ‘నేను’ ఆ ‘నేను’ను చేరుకోవడానికి చేసే ప్రయాణమే యోగసాధన అంటే.! ఇంతవరకూ మానవుడు చేస్తున్న ఆలోచనలు అప్పుడు ఆ ‘నేను’ను కలుసుకోవడంతో ఆగిపోతాయి. ‘అహం బ్రహ్మాస్మి - నేనే బ్రహ్మను’ అని తెలుసుకోవడమే ఈ జీవితానికి సార్థకత! అదే మోక్షం!!’’ కానీ శ్రీ అరవిందుల యోగం అంతటితో సరిపెట్టుకోదు. వాస్తవానికి వారి యోగసాధన అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ‘‘దైవాన్ని తెలుసుకోవాలి. దైవంతో ఏకం కావాలి. దైవాన్ని అభివ్యక్తం చేయాలి’’ అంటారు శ్రీఅరవిందులు. మనం ఆ స్థితిని సాధించినప్పుడు... మనం సాధించినది మనతోనే ఆగిపోదు. ‘నేను’ అంతటా, అన్నిటా అభివ్యక్తం అవుతుంది. అనుభూతం అవుతుంది. ప్రకటితం అవుతుంది. తన వెలుగును ప్రసరిస్తుంది. అంతా తానే అయినప్పుడు ఇక తనకు వెలితి ఏముంటుంది? తనకు లేనిది కానీ, కావలసింది కానీ ఏదీ ఉండదు. అంతా నిండుగా ఉంటుంది. తన కన్నా భిన్నంగా ఏదీ లేనప్పుడు, అంతా తానే అయినప్పుడు ఈ అవినీతి, దోపిడి, నేను- నాది, గెలుపు - ఓటమి, తన - పర, అధికార లాలస, స్వార్థం, అహంకారం, ఈర్ష్య - ద్వేషం, పగ - ప్రతీకారం, ఆశ - నిరాశ వంటి ద్వంద్వాలు, మత ఛాందసాలు, ప్రాంతీయ దురభిమానాలు, భాషా వైషమ్యాలు, ఉగ్రవాదాలు, పనికిమాలిన ఇజాలు... అన్నీ అంతరించిపోతాయి. చావు పుట్టుకల అర్థం - సృష్టి - స్థితి, లయాలకు ఉన్న పరమార్థం అవగతం అవుతుంది. మనలో ఈ అవగాహనను పెంపొందించుకోవడానికి ఇకనైనా ప్రయత్నించమని చెబుతోంది
మీలో ఉన్న జ్ఞానం దీపం ఆరిపో నీయకండి ! చిమ్మచీకట్లో నడుస్తున్నప్పుడు దారి కనిపించదు. అప్పుడే దీపం అవసరమేమిటో గుర్తుకొస్తుంది. అలాగే జీవితం అంధకారమయంగా మారినప్పుడు దిక్కు తోచదు. ఎటువెళ్లాలో ఒక పట్టాన తెలియదు. ఏ ఆలోచనా తట్టదు. అప్పుడూ దీపమే కావాలి. హృదయంలో వెలిగే దీపమది. అదే ‘జ్ఞాన దీపం’! లోకంలో భౌతికంగా కాంతులీనే దీపాలకు ఆది, అంతం ఉంటాయి. మనిషిలో అంతర్లీనంగా వెలిగే దీపానికి ముగింపు ఉండదు. అది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. పగలు, రాత్రి- సుఖదుఃఖాలకు ప్రతీకలు. సుఖం కలిగినప్పుడు సంతోషించడం, అది లేనప్పుడు దుఃఖించడం అతి సామాన్యులు చేసే పని. ప్రాజ్ఞులు అలా కాదు. సుఖదుఃఖాల్లోనూ ఒకే తీరుతో (ఆనందం) వ్యవహరిస్తారు. జ్ఞానసిద్ధి పొందినవారిని ‘బుద్ధుడు’ అంటారు. అతడు ఎప్పుడూ వెలుగులోనే ఉంటాడు. చీకటి అతడి దరి చేరదు. అజ్ఞానం అంటే, చీకటి. జ్ఞానం అంటే, వెలుగు. వెలుగు ఉన్నచోట చీకటికి తావు లేదు. అజ్ఞానం వల్లనే దుఃఖం కలుగుతుంది. జ్ఞానంతో అది తొలగిపోతుంది. చీకటి వెలుగులు- ప్రకృతి సహజాతాలు. అవి వస్తాయి, పోతాయి. కేవలం ప్రాకృతిక వెలుగు మీదనే ఆధారపడితే, పరాధీనులై మిగిలిపోతారు. సహజమైన వెలుగు వచ్చేంతవరకు, వారు చీకట్లో జీవనం గడపాల్సి వస్తుంది. మనిషి తానే ఒక వెలుగైతే, స్వతంత్రుడిగా మారతాడు. జ్ఞానం పట్ల ప్రేమ పెంచుకోవడం వల్లనే, మానవుడు విద్యుద్దీపాన్ని కనుగొన్నాడు. జ్ఞానం అనేది రెండు ముఖాలున్న నాణెం వంటిది. ఒక ముఖంతో బయటకు చూస్తే, విజ్ఞాన ఫలితంగా కొత్తవాటిని కనిపెట్టే శాస్త్రవేత్త అవుతాడు. మరో ముఖంతో లోపలికి చూసుకుంటే, జీవన రహస్యాలు విప్పిచెప్పగల తత్వవేత్తగా ఉంటాడు. అందువల్లే పశ్చిమ దేశాలు వైజ్ఞానికంగా ఎదిగాయి. భరతఖండం ఆధ్యాత్మిక శిఖరంగా ఉన్నతీకరణ చెందింది. ప్రపంచం దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. అజ్ఞానం అనే చీకటి వల్లే అరిషడ్వర్గాలు మనసులోకి చేరతాయి. అల్లకల్లోలాన్ని, గందరగోళాన్ని అవి సృష్టిస్తాయి. ఫలితంగా మనసు దుఃఖానికి లోనవుతుంది. చీకటి తొలగాలంటే వెలుగు కావాలి.జ్ఞానం వెలుగుతున్న దీపం వంటిది. ‘ఇంట్లో దీపం వెలుగుతుంటే, అక్కడికి ఏ దొంగా వెళ్లడు’ అని గౌతమ బుద్ధుడు బోధించేవారు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి విషయంలోనూ అంతే! ‘లోపలి దీపం’ వెలిగించుకున్న మనిషి మనసులోకి అరిషడ్వర్గాలకు చెందిన ఏ చోరుడూ ప్రవేశించలేడు. గాలి వీస్తున్నప్పుడు దీపం వెలగదు. పరిపరి విధాలుగా సంచరించే మనసు, వీచే గాలి వంటిది. అలాంటి నిలకడ లేని మనసులో ఆత్మజ్యోతి ప్రకాశించదు. ధ్యాన సాధనతో మనసును ఉన్నతీకరించుకోవాలి. మానవ జీవితం పెట్టుబడి వంటిది. దానికి రాబడి- లోపలి దీపం వెలగడమే!!
No comments:
Post a Comment