Sunday, October 26, 2025

 *మార్గదర్శకులు మహర్షులు -13*
🪷

రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి


*భృగుమహర్షి -1*

బ్రహ్మదేవుడి యొక్క హృదయం నుంచీ పుట్టిన నవబ్రహ్మలలో భృగుమహర్షి ఒకడు. ఈ భృగుమహర్షి వంశంలో పుట్టిన గొప్పవాళ్ళు చ్యవనమహర్షి, జమదగ్ని, శుక్రాచార్యుడు, దధీచి, ఇంకా శ్రీమహా విష్ణువే పరశురాముడిగా అవతరించాడు. అట్లాంటి మహాత్ములు పుట్టిన గొప్ప వంశం ఆయనది. ఆ వంశానికి మూలపురుషుడు భృగుమహర్షియే!

భృగుమహర్షి కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన ఖ్యాతి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెయందు ఆయనకు ధాత, విధాత అనే కొడుకులు, శ్రీ అనే ఒక కూతురు కలిగారు. ఈయనకు ఉశన అనే భార్య ఉంది. ఆమెయందు ఆయనకు కవి (ఉశనసుడు అని మరొక పేరు) అనే కొడుకు కూడా కలిగాడు. ఆయనే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు. పులోమ భృగువు యొక్క మరొక భార్య. ఆయనకు పులోమయందు చ్యవనమహర్షి పుట్టాడు. (చ్యవనుడిగాథ ఆయన చరిత్రలో తెలుసుకుందాం) ఈ విధంగా భృగుమహర్షి అనేకమందిని సంతానంగా కని భృగు వంశాన్ని అభివృద్ధి చేశాడు. వాళ్ళు మహాత్ములు. వాళ్ళకు ఎంతమంది సంతానం ఉంటే దేశానికి అంత మంచిది కదా! అలాగే ఉండాలి. ఆ అనేకమంది సంతానం సామాన్యులు కారు. మాన్యులు.
📖

ఒకసారి దేవతలు రాక్షసులను అందరినీ జయించి చాలా దూరం తరిమికొట్టారు. రాక్షసులు అపజయంపొంది తమ గురువైన శుక్రాచార్యుడి దగ్గరికివెళ్ళి మొర పెట్టుకున్నారు. "గురుదేవా! తమవంటి మహాశక్తివంతులు మాకు గురువుగా ఉన్నారు. అయినా మేము దేవతల చేత హింస పొందుతున్నాము. మమ్మల్ని తరిమితరిమి కొడుతున్నారు. మాకు జనక్షయమౌతున్నది. అయినా మేము ఏమీ అనలేకపోతున్నాము. మమ్మల్ని రక్షించండి" అంటే; అప్పుడు ఆయన తిన్నగా కైలాస పర్వతానికి వెళ్ళి తపస్సు చేసి శివుడిని సంజీవనీ మంత్రోపదేశం చెయ్యమని అడిగాడు. ఆయన అనుగ్రహంతో సంజీవనీ మంత్రం వచ్చింది శుక్రాచార్యుడికి. 

ఆ మంత్రప్రభావంతో చచ్చిపోయిన రాక్షసులనందరినీ బతికించడం మొదలు పెట్టాడు శుక్రాచార్యుడు. అలా రాక్షసులు చనిపోకుండా మళ్ళీ బతుకుతున్నారు.

అయితే ఆయన అలా చాలాకాలం పాటు తపస్సు చేస్తున్నప్పుడు (అంతకుముందు రాక్షసులను ఆయన కాపాడుతూ ఉండేవాడు కాబట్టి), తమను రక్షించే గురువు లేకపోయినందువల్ల, ఆ రాక్షసులు రాక్షసమాత, శుక్రాచార్యుడి తల్లి, భృగుపత్ని అయిన ఉశన దగ్గరికి వెళ్ళి, "ఇప్పుడు మా గురువైన శుక్రాచార్యుడు మా వెంటలేడు. మేము ఆయన రక్షణ లేకపోవటం చేత అనాథలమయినాము. అందుకని మమ్మల్ని రక్షించు" అని ప్రార్థించారు. అందుకు ఆమె, "మీ గురువైన శుక్రాచార్యుడు వచ్చేదాకా నేను మిమ్మల్ని రక్షిస్తాను" అని వాళ్ళకు శరణాగతి ఇచ్చింది. తానే ఆశ్రమం నుంచీ బయటికి వచ్చి ఇంద్రాది దేవతలను తన తపోబలం తో స్తంభీభూతుల్ని చేసింది. ఎక్కడి వాళ్ళను అక్కడ అలాగే కదలకుండా, గమనంలేకుండా చేసింది. ఆమె మహత్తు అటువంటిది. ఆమె శుక్రాచార్యుడి తల్లి!

ఇంద్రాది దేవతలు స్తంభించిపోయి ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తిని ధ్యానం చేసి ప్రార్థించారు. దేవతల దుస్థితి చూసాడు శ్రీమహావిష్ణువు. వాళ్ళ చేతులు, కాళ్ళు కదలకపోవటంచేత రాక్షసులు వచ్చి వాళ్ళను తీవ్రహింసలకు గురిచేస్తున్నారు. దేవతలు భయంకరమైన ఆపదలో ఉన్నారు. ఉశనాదేవిని సంహరిస్తే తప్ప ఆవిడశక్తి ఉపసంహారం కాదు అని విష్ణువు గ్రహించాడు. అయితే ఆమె ఒక స్త్రీ. ఆమెను సంహరించడానికి సంశయిస్తున్నాడు.

అప్పుడు ఇంద్రుడు ఆయనను, "దేవతలను రక్షించటానికై, స్త్రీ అయినా ఆమెను సంహరించవలసిందే. ఇదే ధర్మం" అని ప్రార్థించాడు. అయినా తనకు ఆమె ఏదయినా అపకారం చేస్తే తప్ప ఆమెను చంపడానికి వీలుకాదని అనుకుని, ఒక భయంకరరూపం ధరించి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను భయపెట్టడానికి ప్రయత్నించాడు మహావిష్ణువు.

ఆవిడకు తీవ్రమయిన క్రోధం వచ్చింది. విష్ణువుతో, "నీవు మహా విష్ణువవు. నువ్వు లోకాలనన్నిటినీ రక్షించాలి. అందరినీ సమదృష్టితో చూడవలసినవాడివి. శరణు అన్న రాక్షసులను అభయహస్తంతో రక్షిస్తున్న స్త్రీని నేను. పతివ్రతను. ఇంద్రుడి దుర్బోధతో నన్ను సంహరింపచూస్తున్న నీవు ఇంద్రుడితో సహా భస్మం కావలసిందే" అని శాపం పెట్టటానికి సంకల్పించింది. శాపాక్షరాలు ఆమె కంఠంలోంచీ బయటికి రాకుండా ఆమె కంఠాన్ని ఒక పదునైన బాణంతో ఛేదించాడాయన.

శాపాక్షరాలు బైటికి వస్తే తనకి, ఇంద్రుడికి ప్రమాదం కనుక, ఆమెను చంపటానికి ఆయనకు అలా ఒక కారణం ఏర్పడింది. ఉశనాదేవి కంఠం తెగి మరణించింది. దేవతలు జయజయధ్వానాలు చేసారు. కొంతమంది రాక్షసులు పరిగెత్తుకు వెళ్ళి ఈ విషయాన్ని భృగుమహర్షికి తెలియజేసారు.

చనిపోయి నేలపై పడి ఉన్న భార్య దగ్గరికి వచ్చాడు భృగుమహర్షి. ఆయనకు ఆగ్రహం కలిగి విష్ణువుతో, "దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయవలసిన నువ్వు మహాపతివ్రత అయిన స్త్రీకంఠాన్ని ఛేదించి చంపావు. నువ్వు చేసిన ఈ దోషానికి ప్రతిఫలంగా నీవు భూలోకంలో మానవుడిగా జన్మిస్తూ జన్మమృత్యువులు పదేపదే పొందుతూ సుఖదుఃఖాలను కూడా మామూలు మానవులవలెనే అనుభవిస్తూ ఉంటావు" అని శపించాడు.

విష్ణుమూర్తి అందుకు బాధపడకుండా, ఆ మహర్షికి తాను ప్రసాదించిన ఆ శక్తి తన పట్ల వమ్ముకావడం ఇష్టంలేక ఆయనను శరణువేడాడు. తను ఏ మాయోపాయం తోనైనా తప్పించుకోగలడు! అయినా భృగుమహర్షి జగత్పూజ్యుడు, ఆయన శాపం శిరోధార్యం, గౌరవించదగినది అనుకొని విష్ణువు భృగువును ప్రార్థించాడట! 

"మహర్షీ! నువ్వు త్రిలోక పూజ్యుడివి. తపశ్శక్తిసంపన్నుడివి. బ్రహ్మజ్ఞానివి. సత్యాన్ని, ధర్మాన్ని పోషించే బాధ్యత తీసుకుని నీ భార్యను సంహరించవలసి వచ్చింది. ఆమెను నేను స్వార్థంతోగాని, అహంకారంతోగాని చంపలేదు కదా! ఆమె ఇంద్రాది దేవతలను స్తంభీభూతులను చేస్తే, ఇంద్రుడు ప్రార్థిస్తే, దేవతలను రక్షించే బాధ్యత కలిగిన నేను ఆమెను చంపక తప్పలేదు. నా కర్తవ్యాన్ని నెరవేర్చాను! నీ భార్య యందు నాకు ఏమాత్రమూ అవిధేయత లేదు" అన్నాడు.

అందుకు భృగుమహర్షి, "మహాత్మా! ఇదంతా నీ లీల, ఈశ్వర కటాక్షం ఇది. నీ సంకల్పం ఎవరికీ తెలియదు. విధివ్రాత ఇలా ఉంది. నా భార్యపోయే యోగం వచ్చింది. నిన్ను నేను శపించవలసి వచ్చింది. అందరి తపస్సులకు ఫలం ఇచ్చే నిన్ను శపించటం అనేది నిమిత్తమాత్రమే కదా! ఈ శాపానికి ఏమి మార్గమున్నదో, భవిష్యత్తులో లోకకళ్యాణం ఎట్లా జరుగుతుందో అట్లాగే జరుగుతుంది. కాబట్టి నీవు నన్ను పాదస్పర్శచేసి శరణు అనవద్దు. శాపాన్ని గౌరవంగా తీసుకుని దుష్టశిక్షణము, శిష్టరక్షణము చేసి ధర్మ సంస్థాపనం చేసి లోకకళ్యాణం చెయ్యి" అని అన్నాడు విష్ణుమూర్తితో, అంటే, శాపవిమోచనం లేదన్నమాట!

ఆయన ఇంకా శ్రీమహావిష్ణువుతో, “నీ అవతారములు, భూలోకంలో నీ జనన మరణములన్నీ కూడా లోకకళ్యాణం కోసమే ఉపయోగిస్తావు. నువ్వు ఏపని చేసినప్పటికీ కూడా నీ చేతలన్నీ లోక కళ్యాణప్రదమవుతాయి. నీ అవతారము లన్నీ - వేదములు నిన్ను ఎలా స్తోత్రం చేస్తున్నాయో అలా ప్రజలు, పురాణములు ఇతిహాసములు నిన్ను స్తోత్రం చేయుగాక! నీవు నీచేష్టలు జగత్కళ్యాణ హేతువుల వుతాయి" అని మంత్ర జలాలని విష్ణువు మీద చల్లి శుభాశీస్సులు అందించాడు.

వెళ్ళే ముందు తన భార్యను ఆ మంత్ర జలాలతో బతికించుకున్నాడు. వెంటనే ఆమెకి శిరస్సు వచ్చింది. ఆమె పునర్జీవితు రాలయింది. ఎప్పుడైతే ఆమె విష్ణువు చేతిలో చనిపోయిందో ఆమె శక్తి అప్పుడే ఉపసంహరించబడింది. వాళ్ళంతా స్తంభనం నుండి విడుదలై తక్షణమే యథా పూర్వంగా అయిపోయారు. ఆమె సజీవంగా ఉన్నప్పుడు ఆమె శాపాన్ని ఉపసంహరించే శక్తి దేవతలకు, విష్ణువుకు కూడా లేదు. ఆమె పోతేనే ఆమె శాపబలం పోయింది. అందుకే ఆమె పునర్జీవితురాలు అయింది. ఆమెకి తిరిగ ప్రాణం వచ్చింది. ఇంద్రాది దేవతలు భృగుమహర్షి మహిమ కు ఆశ్చర్యపడి తమతమ స్థానాలకు వెళ్ళిపోయారు. శాపగ్రస్తుడయిన విష్ణుమూర్తి అంతర్థానమయ్యాడు. లింగపురాణంలోనిది ఈ ఘట్టం.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment