Monday, October 27, 2025

 8️⃣0️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

*34. ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌl*
 *తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినైll*

ఇంద్రియములకు, వాటి విషయములకు అంటే శబ్దము, స్వర్శ, రూప, రస, గంధములకు సంబంధించి రాగద్వేషములు ఉంటాయి. అంటే ఇది నాకు ఇష్టము ఇది ఇష్టము లేదు అని. ఆ రాగద్వేషములకు లోబడితే బంధనములు తప్పవు. మానవుడు రాగద్వేషములకు లోను కాకూడదు. ఎందుకంటే రాగద్వేషములు మానవునికి శత్రువులు.

పైశ్లోకంలో ప్రతి మానవుడు ప్రకృతి గుణములకు, స్వభావమునకు, పూర్వజన్మ సంస్కారమునకు లోబడి ప్రవర్తించాలి. అంతకు తప్ప మరొక మార్గము లేదు అని చెప్పాడు. అలా ప్రవర్తించేటప్పుడు మానవుడికి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. అంటే రాగద్వేషములు, ఇష్టాఅయిష్టాలు. ఇది కావాలి అది వద్దు. వీడు నావాడు వాడు పరాయి వాడు అనే ద్వంద్వాలు అని ప్రతి వాడికీ సహజం. కాని అవి కార్యరూపం దాల్చకముందే వాటిని మనసులో నుండి నెట్టివేయాలి. అంతే కానీ ఆ ఆలోచనలను పెంచి పోషిస్తే అవి వికృత రూపం దాల్చి విపరీత పరిణామాలకు దారి తీస్తాయి. బంధనములను కలుగచేస్తాయి. అటువంటి ఆలోచనలను మనసులో నుండి మొగ్గలోనే తుంచి వేస్తే, మానవునికి శ్రేయస్సు కలుగుతుంది.

ఇలా రాగద్వేషములను ఇష్టా అయిష్టాలను తుంచి వేయాలంటే జ్ఞానం కావాలి. అది మంచి గురువు నుండి మాత్రమే లభిస్తుంది. ఆయన వలన ఆత్మ విచారము, భక్తి, వైరాగ్యము, శాస్త్రములను అధ్యయనం, నిష్కామ కర్మ మొదలగునవి నేర్చుకోవాలి. లేకపోతే రాగద్వేషముల ప్రభావానికి లోబడి కర్మలు చేస్తాము. కష్టాలపాలవుతాము. పూర్వజన్మ సంస్కారము చెడ్డదిగా ఉన్నా ఈ జన్మలో మంచి పనులు చేయడం ద్వారా వాటి ప్రభావమును తగ్గించుకోవచ్చు. ఒక్కోసారి పూర్తిగా నివారించవచ్చు. అది అతని సాధనా శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నా ఖర్మ ఇంతే, నేనేమీ చేయలేను, నా ప్రారబ్ధం నన్ను ఇలా చేస్తోంది అని బాధపడేకంటే, వాటి నుండి బయట పడటానికి ప్రయత్నించడం మంచిది. దానికి మూలం దుష్ట ఆలోచలను పెంచి పోషించకుండా మొగ్గలోనే తుంచి వేయడం ఉత్తమం.

ఎవరికైనా వారి వారి ప్రకృతి స్వభావాన్ని అనుసరించి ఇష్టము అయిష్టము అనేవి రెండు కలుగుతాయి. వాటినే రాగద్వేషములు అని అంటారు. ఇవి ఇంద్రియములు, వాటి గుణములు అయిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ప్రాపంచిక విషయములతో కూడి ప్రవర్తించేదాన్ని బట్టి కలుగుతాయి. కొంత మందికి మెలోడీ సంగీతం ఇష్టం, మరొకరికి రణగొణధ్వనులతో కూడిన సంగీతం ఇష్టం. కొంత మందికి తీపి ఇష్టం, మరొకరికి కారం ఇష్టం. ఒకడికి ఎదుటి వాడు సంతోషంగా ఆనందంగా ఉంటే ఇష్టం, మరొకడికి ఎదుటి వాడు బాధపడుతుంటే ఇష్టం. ఎదుటి వాడిని బాధపెట్టి మరీ ఆనందిస్తాడు. ఇలాగా ప్రతి వాడికి ఇష్టాఇష్టాలు మారుతూ ఉంటాయి. ఈ స్వభావాలను బట్టి మనసులో ఆలోచనలు కలుగుతాయి. అది మొదటి మెట్టు. ఆ ఆలోచనలు కోరికలుగా మారడం రెండవ మెట్టు. ఆ కోరికలను తీర్చుకోవడం కొరకు కర్మలు చేయడం మూడవ మెట్టు. ఇలా ఇష్టాఅయిష్టాలు ఏర్పడతాయి.

మొట్ట మొదటిగా మనలో మెదిలే ఆలోచనలను ఎవరూ ఆపలేరు. ఎందుకంటే అది మానవుని ప్రకృతి స్వభావాన్ని బట్టి పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి కలుగుతుంది. ఈ ఆలోచనలను మొదటి మెట్టు అంటే మనసులో దాని గురించి ఆలోచన మొలకెత్తగానే, దాని మంచి చెడ్డలు విచక్షణా బుద్ధితో విచారించి, దానిని నివారించగలిగితే వాడు ధన్యుడు అవుతాడు. అలాకాకుండా దానిని పెంచి పోషించి, కర్మల దాకా తెచ్చుకుంటే, సుఖం కానీ దుఃఖం కానీ రెండూ కానీ కలుగుతాయి. బంధనములు కలుగుతాయి. జ్ఞానికైనా, అజ్ఞానికైనా, బాగా చదువుకున్నవాకైనా, ఉన్నతపదవులలో ఉన్న వారికైనా వారి వారి ప్రకృతి స్వభావాలను బట్టి, పూర్వజన్మసంస్కారాలను బట్టి, ప్రాపంచిక విషయములలో ప్రవర్తించినపుడు వివిధ రకములైన ఆలోచనలు వస్తుంటాయి. అని మంచివా కాదా, ఆచరించతగ్గవా కాదా అనే విచక్షణా బుద్ధితో నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఆలోచన వచ్చింది కదా అని దాని మీద మోహము కోరిక పెంచుకొని ఆ కోరిక తీరడం కోసం కర్మలు చేస్తే బంధనములు తప్పువు. వీటికంతా మూలము ఈ రాగద్వేషములు అనే దొంగలు. ఈ దొంగలను, శత్రువులను మొగ్గలోనే మనం అదుపులో పెట్టుకోవాలి. అవి పెరిగి పూవు, కాయ, పండు దశలకు చేరుకుంటే ప్రమాదం.
(సేకరణ)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

 (రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P198

No comments:

Post a Comment