*మహామంత్రి మాదన్న - 14*
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽
రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు
గోలుకొండలో తండ్రి తరపున ఉప మీర్ జుమ్ లాగా వ్యవహరిస్తున్న మీర్జా సయ్యద్ అమీన్ ప్రవర్తన శ్రుతిమించి రాగాన పడింది. తండ్రి గోలుకొండలో వున్నప్పుడు కొంత జంకు గొంకు వుండేవి. తండ్రి కర్నాటకకి వెళ్లగానే ఆ రెంటికీ చెల్లు చీటి ఇచ్చేశాడు. కామంతో కళ్లు మూసుకు పోయి ఉచ్ఛనీచాలు మరిచిపోయాడు.
గుర్రం మీద వెడుతున్న అతనికి స్త్రీలు ప్రయాణిస్తున్న మేనా ఏదన్నా కనపడితే చాలు, దాని పక్కకి గుర్రాన్ని దౌడు తీయించేవాడు. మేనా పక్కనే కదులుతూ మేనాలో ఉన్న వాళ్ల మొహాలలోకి చూసేవాడు. ఆ స్త్రీ ఆ దిగ్రమ నుంచి తేరుకుని అరచే లోపలే పకపక నవ్వుతూ అక్కడి నుంచి దౌడు తీసేవాడు. ఒకవేళ అక్కడే వుండి మరి కొంచెం అతి చేసినా ఏ కొద్దిమందికో తప్ప మిగతావారెవరికీ అతనిని ఆపే ధైర్యం వుండేది కాదు.
'వీడి తండ్రి తరతరాలకి తరగని ఆస్తిని పోగేశాడు. వీడికి మొగలు రాయబారి అబ్దుల్ లతీఫ్ వత్తాసు వుంది. అందుకే వీడు సుల్తాన్ని కూడా లెక్కచేయడు. ఇహ వీడిని ఎవరేం చెయ్యగలుగుతారు' అనుకునేవారు జనం.
తాగి తందనాలాడటం, కంటికి నదురుగా కనిపించిన ఆడపిల్లను ఎత్తుకుపోయి అత్యాచారం చెయ్యడం అతని నిత్య కృత్యాలయ్యాయి. ఆ రోజు పొద్దుటి నుంచి తప్ప తాగడం తప్ప మరొక పని ఏదీ ముట్టుకోని అమీన్ చల్లగాలి కోసం
తన భవనం పై అంతస్తులోని వసారాలోకి వచ్చాడు.
దూరం నుంచి మేళతాళాలు వినిపించాయి.
'ఏమిటి అటే చూస్తూ ఉండిపోయారు' అన్న గొంతు వినిపించడంతో అమీన్ వెనక్కి తిరిగాడు.
వెనుక సలీం నుంచుని వున్నాడు. అమీన్ కి తలలో నాలుకగా మెలుగుతూ, హమేషా తోడునీడలా వుండే నాజూకైన అందమైన కొజ్జా సలీం. అమీన్ కి ఎంతో ప్రియమైన కొజ్జా. దాదాపు అమీన్ తోటివాడే. అతడు కొజ్జాగా పుట్టాడో, కొజ్జాగా మార్చబడ్డాడో అతనికే తెలియదు. బానిస బాలుడిగా గోలుకొండ వచ్చాడు. నగరంలోనే పెరిగాడు. నగరంలో నివసించే వివిధ వర్గాల ప్రజల ఆచారాలు, వేడుకలు అన్నీ ఆకళింపు చేసుకున్నాడు.
'ఏమిటది సలీం' అడిగాడు అమీన్ మేళతాళాలతో సాగుతున్న ఊరేగింపును
చూస్తూ.
'అది శోభనం ఊరేగింపు. ఇవాళ చాలా మంచిరోజు. అందుకే అమ్మాయిని కాపురానికి పంపిస్తున్నారు. పల్లకీ ముందు నడుస్తున్న స్త్రీలు రకరకాల సంభారాలు నిండిన బుట్టలు, పళ్లాలు నెత్తి మీద మోస్తున్నారు. అవన్నీ ఆ అమ్మాయి అత్తవారింట ఇస్తారు' చెప్పాడు సలీం.
'కాపురానికి అంటే, భర్త దగ్గరకు. అంతే కదూ' అడిగాడు అమీన్.
'అవును.'
'ఇవ్వాళ ఆ అమ్మాయికి తొలిరాత్రి' తనలో తనే గొణుక్కున్నాడు అమీన్.
సలీం మాట్లాడలేదు.
సలీం కొజ్జా అయినా ఆ మాత్రం తెలియని వాడు కాదు. అనేకసార్లు అమీన్ కామకేళి కి సూత్రధారుడే గాకుండా ప్రత్యక్ష సాక్షి కూడా. అదిగాక అమీన్ దిగజారిన కామ చేష్టల గురించి, నోటి దూల గురించి బాగా తెలుసు సలీంకి.
'అందుకే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బానిసవి' అంటూ సలీం బుగ్గ గట్టిగా గిల్లాడు అమీన్.
'కృతజ్ఞుడిని. నేను ఉన్నది మీ సేవ కోసమే అన్నాడు' సలీం ఆనందంగా.
'నాకు ఒక ఆలోచన తట్టింది. అది అమలు చేస్తాను'.
'ఏమిటది' అడిగాడు సలీం ఆసక్తిగా.
'తొలిరాత్రిని ఆ అమ్మాయి నుంచి దూరం చెయ్యడం మహా ఘోరం. చూస్తూ చూస్తూ అంత పాపానికి నేను ఒడిగట్టలేను. అందుకే ఆ అమ్మాయి అత్తవారిల్లు మారుస్తాను. అప్పుడు ఏమవుతుంది చెప్పు'.
'ఎప్పుడూ అయ్యేదే అవుతుంది.' అన్నాడు సలీం.
'సరిగ్గా ఊహించావు. ఆ మారే భర్త ఎవరో చెప్పమంటావా'.
'నాకు తెలుసు. నేను అదే ఏర్పాట్లలో వుంటాను. మీదే ఆలస్యం' అంటూ కిందికి పరిగెట్టాడు సలీం.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
బుగ్గల్లో సిగ్గుల కెంపులు మొగ్గలు తొడుగుతుంటే మనసు శరీరం పులకలు వేస్తుంటే తల వంచుకుని కూచుంది శోభనం పెళ్లికూతురు. పల్లకీ పక్కనే గుర్రంపై సవారు చేస్తున్నాడు ఆమె భర్త. అతని శరీరం యవ్వన కాంతులతో మెరుస్తోంది. కళ్లు తన సహచరి పట్ల ప్రేమ వెలుగులు చిమ్ముతున్నాయి. తలవంచుకు కూచున్నా, క్షణానికి ఒకసారి తన వంక క్రీగంటి చూపులు చూస్తున్న ఆమె మొహం లోకే తదేకంగా చూస్తూ చిలిపిగా కన్ను గీటాడు. ఆమె మొహం సిగ్గుల బంతి పువ్వు అయింది. అయినా భర్త మొహం లోకి అలవోకగా చూస్తూ తనూ కన్ను గిలికింది. సిగ్గు ముంచుకు రావడంతో తల దించుకుంది.
ఆమె సిగ్గుతెరల నుంచి తేరుకోక ముందే అరుపులు, వీపు మీద కొరడా దెబ్బలు బలంగా తగలడంతో గుర్రం మీంచి జారిపోతున్న భర్త, కళ్లెం వదిలించుకుని పరిగెడుతున్న గుర్రాన్ని చూసి ఆమె కెవ్వున అరిచింది. ఆమె అరుపులను పట్టించుకోకుండా పల్లకీని అక్కడే వదిలేసి పారిపోయారు బోయీలు. అంబా అని దిక్కులు ప్రతిధ్వనించేలా అరుస్తూ తోకలు ఎత్తి దుమ్ము లేపుతూ పరిగెట్టాయి అరణం ఆవులు.. వెనక్కు చూడకుండా దూరంగా పారిపోతున్న మేళతాళాల వాళ్లు, ఇతరులను చూసి ఆమె భయంతో బిగుసుకుపోయింది. 'రక్షించండి రక్షించండి' అని అరుస్తూ స్పృహ తప్పి పల్లకీలోనే ఒరిగిపోయింది.
కళ్లు తెరిచిన ఆమెకి తను ఎక్కడున్నానో తెలియలేదు. కానీ తను ఎలా ఉన్నానో తన్ను తాను చూసుకున్న ఆమెకి తెలిసొచ్చింది. చేతులతో మానాన్ని కప్పుకుని భయంగా అరిచింది.
అమీన్ ఆమె దగ్గరగా వచ్చాడు.
ఆమె అతని కాళ్ల మీద పడింది. సిగ్గు, అవమానంతో కూడిన దు:ఖం కట్టలు తెగిరాగా పెద్దగా ఏడుస్తూ 'నన్ను వదిలిపెట్టు. నీకు దండం పెడతాను' అంది.
'ఎటు చూసినా నీకు దారి లేదు. ఎటూ పోలేవు. పోయినా అదిగో అటు చూడు. గుమ్మం దగ్గర సలీం నుంచుని వున్నాడు. వాడు నిన్ను పువ్వులో పెట్టి తీసుకువచ్చి నాకు అప్పగిస్తాడు. వాడిని తప్పించుకు న్నావనుకో. బయట ఇంకా చాలామంది ఉంటారు. అన్నాడు అమీన్.
ఆమె తలదించుకుంది. తనను కాపాడే దేవుడు ఎవడూ లేకున్నా కనీసం ఒక్క దెబ్బతో చంపేసే దెయ్యం అయినా తనని కరుణించకపోతుందా అని ఆశపడింది.
📖
దాద్ మహల్. అది న్యాయదేవత చిరునామా అని జనం నమ్మకం. దాంతో పాటు సుల్తాన్ మహమ్మద్ నిర్మించిన అమన్ మహల్ కూడా న్యాయదేవతకి ప్రియమందిరమే. ఆ మందిరాలలో సుల్తాన్ అబ్దుల్లా అనేక అభ్యర్థనలను పరిశీలించి సత్వర న్యాయం చేసేవాడు.
ఆ రోజూ సుల్తాన్ దాద్ మహల్లో అభ్యర్థన లను స్వీకరించే రోజు. పట్టపుటేనుగు ఎక్కి అట్టహాసంగా ఊరేగుతూ దాద్ మహల్ కి వచ్చాడు సుల్తాన్.
లోపలికి వచ్చిన సుల్తాన్ కి అక్కడ కూచుని వున్న తల్లి కనిపించింది. తల్లికి వినయంగా సలాం చేసి ఆసనంలో కూచున్నాడు. తల్లి మొహంలోకి చూసిన అతనికి మాట్లాడటానికి నోరు పెగలలేదు. గుండె దిటవు జారింది. తల్లి మొహంలో అంత అసహనత, కోపం, ఆందోళన ఎన్నడూ ఆయన చూడలేదు. అదీగాక తన దృష్టిలో ఎన్నడూ పడని ఒక ఉద్యోగి రాజమాత పక్కన చేతులు కట్టుకుని నుంచుని వుండటం గమనించాడు. అందుకే మౌనంగా వుండిపోయాడు.
'ఇతను మాదన్న. మీర్జా మహమ్మద్ సయ్యద్ కర్నాటకకి వెళ్లక ముందు అతని అంతరంగిక సిబ్బందిలో వుండేవాడు'.
అబ్దుల్లా మాదన్న వైపు పరిశీలనగా చూశాడు.
మాదన్న వినయంగా వంగి సలాం చేసి బయటికి వెళ్లిపోయాడు.
రాజమాత అబ్దుల్లా మొహంలోకి సూటిగా చూస్తూ, ‘కుతుబ్షాహీ సుల్తానులు న్యాయానికి ఎప్పుడూ పెద్ద పీట వేశారు. న్యాయదేవతకి నిలువెత్తు అలంకారాలుగా దాద్ మహల్, అమన్ మహల్ లను నిర్మించారు. ఈ మందిరాలలో న్యాయం ముందు అన్యాయం హమేషా ఓడిపోయింది. న్యాయం చెయ్యడంలో నువ్వు నీ పూర్వీకుల అడుగుజాడలలో నడుస్తావని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా వని ప్రజలు చెప్పుకుంటారు'.
'అసలు సంగతి చెప్పండి' అన్నాడు సుల్తాన్.
‘అక్కడికే వస్తున్నాను. కుతుబ్షాహీల రాజధాని నగరంలో, నిత్యం వేలాదిమంది విదేశీయులు వస్తూ పోతూ వుండే ఈ నగరంలో...' రాజమాత మొహంలో కనిపించిన ఆగ్రహ జ్వాల ఆమె మొహాన్ని ఎరుపెక్కించింది. కంఠానికి అడ్డు పడింది. ఆవిడ మాట్లాడలేకపోయింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సుల్తాన్ ఆందోళనగా తల్లి మొహంలోకి చూశాడు.
హయత్ బక్షీ బేగం తనను తాను సంబాళించుకుంది. అబ్దుల్లా మొహంలో తదేకంగా చూపులు నిలుపుతూ, 'సుల్తాన్ ప్రసాదానికి అల్లంత దూరంలో, న్యాయ మందిరాలకి కూత వేటంత దగ్గరలో ఒక శోభన వధువు అన్యాయానికి గురైంది. భర్త కౌగిలిలో పరవశించవలసిన ఆమె పశుకామానికి బలి అయింది'.
సుల్తాన్ మొహంలో రంగులు మారాయి. 'అమ్మా, ఆ అమ్మాయి వచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాను' అన్నాడు దృఢంగా.
“ఫిర్యాదు చేస్తే న్యాయం చేసేది న్యాయాధి పతి. ఫిర్యాదు చెయ్యకముందే న్యాయం చేసేది రాజ్యాధిపతి. నువ్వు రాజ్యాధిపతివి'.
'ఎవరైనా సరే. విషయం తెలియాలి కద' అన్నాడు సుల్తాన్.
'రాజ్యంలో, కనీసం రాజధానిలో ఏం జరుగుతుందో అనుక్షణం కనిపెట్టవలసిన గూఢాచార సంస్థ కానీ, నగర కొత్వాల్ గానీ నీకు ఈ విషయం ఇప్పటికే చెప్పి వుండాలి. వాళ్లు చెప్పలేదంటే, నువ్వు వాళ్లకి అందు బాటులో వుండి వుండవు. వినోద విహార విలాసకేళిలో మునిగిపోయిన నీకు అంతరాయం కలిగించడానికి వాళ్లు ధైర్యం చేసి వుండరు' అంది హయత్ బక్షీ బేగం నిరసన నిండిన గొంతుతో.
సుల్తాన్ సిగ్గుతో తల వంచుకున్నాడు. రాజమాత మౌనంగా వుండిపోయింది.
'అమ్మా, నన్ను మన్నించండి. ఆ నవ వధువుకి అన్యాయం చేసినవాడు ఎంతటి వాడైనా వాడికి శిక్ష తప్పదు. ఇదిగోలుకొండ సుల్తాన్ గా మీకు నేను ఇస్తున్న మాట' అన్నాడు సుల్తాన్ ఎర్రబడిన మొహంతో.
'వాడు ఎంతటివాడో తెలుసుకునేందుకు శ్రమపడే అవసరంలేదు' అంటూ పక్కన వున్న గంట కొట్టింది. మందిరంలోకి వచ్చిన బానిస యువతితో 'రజా కులీని, మాదన్నను రమ్మను' అంది.
బానిస వెళ్లిపోయింది.
రెండు క్షణాల్లో రజా కులీ, మాదన్న వచ్చారు. వినయంగా సలాం చేసి నుంచున్నారు.
సుల్తాన్, రజా కులీ మొహంలోకి చూశాడు.
'రాజమాతా, మీ ఆదేశం అందగానే గండికోట నుంచి బయలుదేరాను. ఎక్కడా ఆగలేదు' అన్నాడు రజా కులీ.
'సంతోషం' అంది రాజమాత.
సుల్తాన్ వారిద్దరి వైపు అయోమయంగా చూశాడు.
'అబ్దుల్లా ఆ అసహాయ అబల అన్యాయానికి గురి అయి వారం దాటింది.
ఆ దారుణం జరిగిన వెంటనే ఆ కుటుంబం నగరాన్ని వదిలి వెళ్లిపోయింది. న్యాయం కోసం సుల్తాన్ని కూడా ఆశ్రయించలేదంటే ఆ నేరం చేసినవాడు ఎంతటి శక్తివంతుడో, బలవంతుడో తెలిసిపోతుంది కదా' అంది.
'వాడు ఎంతటివాడైనా ఉరికంబం ఎక్కి తీరుతాడు' అన్నాడు సుల్తాన్ నిశ్చయం నిండిన గొంతుతో.
'రజా కులీ, సుల్తాన్ కి జరిగిన విషయాన్ని నివేదించు' అంది హయత్ బక్షీ బేగం.
👳🏽
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment