252వ భాగం
🕉️ అష్టావక్ర గీత🕉️
అధ్యాయము 18
శ్లోకము 40
క్వాత్మనో దర్శనం తస్య యదృష్టమవలమ్బతే|
ధీరాస్తం తం న పశ్యంతి పశ్యన్తాత్మన మవ్యయం||
వ్యక్త ప్రపంచాన్ని చూస్తున్న వానికి ఆత్మ దర్శనం ఎలా సాధ్యం ?జ్ఞాని చూస్తున్నది అంతా అవ్యయమైన ఆత్మతత్వమే అనే నిశ్చయజ్ఞానం కలిగి ఉంటాడు.
మనసును అధిగమిస్తేనే ఆత్మానుభవం సాధ్యమవుతుందని భావాన్ని ఈ శ్లోకం దృఢంగా చెబుతుంది. ఒక వ్యక్తికి అనుభవం అయ్యే ప్రపంచమంతా అతని ఇంద్రియాలతో తెలుసుకోబడేది, మనసుతో అనుభవింపబడేది, బుద్ధితో నిశ్చయింపబడేదిగా ఉంటుంది. మనలోని చైతన్యం మనోబుద్ధుల ద్వారా బాహ్యభి ముఖం అయ్యి ఉన్నంతసేపు నానాత్మమైన ప్రపంచం తెలియబడుతూనే ఉంటుంది. ఆ విధంగా భాహ్యభిముఖమైన మనసు గల వ్యక్తి శుద్ధ చైతన్య స్వరూపాన్ని ఎన్నటికీ చేరలేడు.
"ధీరాస్తం న పష్యంతి".... దీరులు అనదగిన జ్ఞానులు దానిని చూడరు. చిత్తశుద్ధితో ధ్యానాన్ని అభ్యసించి శాస్త్ర అధ్యయనము సక్రమంగా చేసిన వారు వారి ఉపాధుల తాదాత్మ్యం విడనాడి సామాన్య దృష్టిని అదిగమించగలుగుతారు. వారికి ప్రపంచంలోని వస్తువులు మానసిక ఉద్రేకాలు బుద్ధిలోని నిశ్చయా నిశ్చయరూపమైన భావాలు కనిపించవు. ప్రగాఢ ధ్యానమగ్నమైన క్షణాలలో నిచ్చలంగా నిలచి పోవటముతో ధ్యానించే వ్యక్తి ధ్యానింపబడేది అనే భేదం అంతరించి ఏకంగా ఆత్మ మాత్రమే ప్రకాశిస్తుంది. అవ్యయమైన ఆత్మ తత్వం అనుభవంలోనికి వస్తుంది.
క్రిందటి శ్లోకంలోని భావమే వివరింపబడి దృఢముగా ఇక్కడ చెప్పబడింది. మనసుతో శాంతిని సాధించాలనే ప్రయత్నం ఉన్నంత సేపు తాత్కాలిక శాంతి ఉండవచ్చునే కానీ సహజమైన ఆత్మ తత్వం అనుభవంలోనికి మాత్రము రానేరదు .మనసు యొక్క చలనాన్ని మనసుతో నిరోధించ బూనడంలో చలనవేగము తగ్గుతుంది కానీ చలించటం ఆగిపోదు, అందుకే తాత్కాలికంగా శాంతి లభిస్తుంది. కానీ నిశ్చలమైన ఆత్మ తత్వము అనూహ్యంగా అసాధ్యంగా మిగిలిపోతుంది. ధ్యానముపై తమకున్న విలువతో వ్యామోహంతో ధ్యానానికి బంధింపబడి ఆత్మను సాధించడం అసాధ్యమని అక్కడే అశాంతితో ఆగిపోతూ, అలవాటైన ధ్యానాన్ని మానలేక మళ్ళీ ప్రయత్నిస్తూ అలాగే ఉండిపోతారు. ఈ స్థితికి చేరిన తర్వాత శాస్త్ర హృదయాన్ని సరిగా అర్థం చేసుకోగలిగితే, ఆత్మను సాధించడం అసాధ్యమని, ఆత్మ సాధింపడవలసినది కాదని, ఉన్నది ఆత్మ మాత్రమే అని తెలుసుకొని సర్వ ప్రయత్నాలు వదిలి ధీరులు ఆనందంగా జీవించగలుగుతారు. ఈ నిశ్చయ జ్ఞానమే మనసును అధిగమించటానికి ఏకైక మార్గం. మనసు అధిగమించటమే ఆత్మ అనుభవం. నేను ధ్యానిస్తున్నాను అనుకుంటూ రేఖామాత్రంగా నిలిచి ఉన్న అహంకారాన్ని త్యజించి ఆత్మా అనుభవములో నిలువమని ఈ శ్లోకం బోధిస్తుంది. అత్యంత విలువైన సూచనలను ఇచ్చే ఈ శ్లోకాన్ని అర్హులైన వారికి అమూల్యమైన బహుమానంగా అష్టావక్ర మహర్షి అందిస్తున్నారు.
దృగోచరమయ్యే ప్రపంచమంతా విషయీ విషయ సంబంధంగా తెలియబడుతుంది విషయము విషయలో విలీనం అయిపోతే ఏకము అవ్యయము అయిన ఆత్మ తత్వము అనుభవింపబడుతుంది ఆత్మ మాత్రమే ఉంటుంది.🙏🙏🙏
No comments:
Post a Comment