Wednesday, October 22, 2025

 మురళీకృష్ణ గారి ఈ కథకు ముగింపునిద్దాం -1 స్ఫూర్తితో నాదొక కథ.
శీర్షిక : *జీవితం - ఒక ప్రయాణం*

రచన: *దేవులపల్లి దుర్గాప్రసాద్*

విశాఖపట్నం, హైదరాబాదు మధ్య దూరాన్ని దూరం చేస్తూ వందే భారత్ పరుగులు పెడుతోంది.  

పక్కపక్క సీట్లలో కూర్చున్న వంశీ, వసంత అదేపనిగా కదులుతున్నారు. ఎనిమిది గంటల పాటు కట్టి పెట్టినట్లుగా, ఒక యోగముద్రలో కూర్చున్నట్లుగా ప్రయాణం చెయ్యడం చాలా కష్టంగా ఉంది ఇద్దరికీ.

తెల్లవారుఝామునే లేచి రైలెక్కేయడం వలన రాజమండ్రి వచ్చేవరకు నిద్ర పోయినా, ఇక అక్కడ నుండి ఈ కూర్చునే నృత్యాల సాధనలో పడ్డారిద్దరూ.

వసంత కిటికీ వైపు కూర్చుని ఉంది.

వంశీ తన లేప్టాప్ తీసి సినిమా పెట్టుకున్నాడు, చెవులకి హెడ్ ఫోన్సు పెట్టుకుని.

వసంత మాత్రం తాను తెచ్చుకున్న పాత తెలుగు నవల, మల్లాది కృష్ణమూర్తి గారి *సావిరహే* తదేకంగా చదువుతోంది. 

వసంతని చూసి అబ్బుర పడ్టాడు వంశీ. ఈకాలంలో కూడా ఒక యువతి ఇలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్సుకు దూరంగా పుస్తకం చదవడం, అదీ తెలుగు నవల చదవడం ఎంతో అబ్బురంగా, అద్భుతంగా అనిపించింది వంశీకి.

అన్నట్లు ఈ వంశీ, వసంతలు ఒకరికొకరు తెలియదు.

పక్కపక్కనే కూర్చున్న రైలు ప్రయాణీకులు మాత్రమే. 

అప్పుడప్పుడు వంశీని గమనిస్తోంది వసంత.  సినిమాలో పూర్తిగా లీనమయి చూడ్డం, సినిమా చూస్తూ నవ్వుకోవడం చూసి ఆ సినిమా ఏమిటో అనే కుతూహలం పెరిగింది వసంతకి.

కానీ అడగడానికి మొహమాటం అడ్డొచ్చింది. అయినా ఇంతందమైన అమ్మాయి పక్కన కూర్చున్నా కనీసం పలకరించడానికి ప్రయత్నించని కుర్రాడు బుద్ధి మంతుడే అనుకుంది.
*********************
వరంగల్ వచ్చేసరికి ఇద్దరికీ మాటలు కలిసాయి. .

వసంత చదువుతున్న పుస్తకం పేరు, రచయిత పేరు తెలుసుకున్న వంశీ, ఆ నవల్లో హీరో హీరోయిన్ కి ఎన్నో దేశ, విదేశీ భాషల్లో "ఐ లవ్ యూ" చెప్తాడు కదా !?" అని ఆసక్తిగా అడిగాడు. 
అవునని వసంత చెప్పగానే ఒక్కసారి నిశ్శబ్దంగా అయిపోయాడు, వంశీ. ఏదో తెలియని విషాదం అతని ముఖంలో కనిపించింది. వెంటనే లేచి వాష్ రూమ్ కి వెళ్లాడు.

 ఒక పదినిమిషాల తర్వాత తిరిగొచ్చిన అతని చూస్తే, ముఖం ఉబ్బి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. 

ఓ సారీ అండీ. నావల్ల మీరు డిస్టర్బ్ అయినట్లున్నారు. మీరేదో మంచి కామెడీ సినిమా చూస్తున్నట్లున్నారు అంది వసంత.

ఆ, ఫర్వాలేదండీ. నేను చూస్తున్నది మాయాబజార్ సినిమా కలర్ లో. అని లేప్టాప్ ని ఆమెకి కూడా కనబడేలా తిప్పాడు.

ఆ, మీరు చూడండి. అని వసంత ముఖం కిటికీ వైపుకు తిప్పేసుకుంది.

ఆమె స్పందన అలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు వంశీ.
కిటికీవైపు తిరిగినా ఆమె కన్నీరు కారుస్తున్నట్లుగా తెలుస్తోంది వంశీకి. తన హేండ్ బేగ్ లో చేతిరుమాలు తీసుకుని తుడుచుకుంటోంది.
 
సహజంగా సిగ్గరి అయిన వంశీ ఆమెను మరలా పలకరించ సాహసం చెయ్యలేదు.

వందే భారత్ హైదరాబాదు చేరింది. ఇద్దరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని విడిపోయారు. 
వారి మనసుల్లో మాత్రం జవాబు దొరకని ప్రశ్నలు ఉండిపోయాయి.
*********************
హైద్రాబాద్, కోకాపేట్ లో ఎస్కిమోస్ ఐస్క్రీమ్ షాప్లో  తనకిష్టమైన ఐస్క్రీమ్  తీసుకుంటున్న వంశీ, 
హలో వంశీ గారు! అన్న పిలుపుకు వెనక్కి తిరిగి చూసాడు.

"ఆ మీరా వసంతా!!" అని ఆశ్చర్యం, ఆనందం కలిసిన స్వరంతో పలకరించాడు.

"పదండి. బయట లాన్లో కూర్చుని తిందాం" 

"ఉండండి. డబ్బులిచ్చేసి..." 

నేనిచ్చేసానండీ. రండి. అని వసంత చనువుగా అనడంతో నవ్వుతూ ముందుకు కదిలాడు వంశీ.
ఇప్పుడు చెప్పండి. ఆరోజు *సావిరహే* నవల అని తెలియగానే ఎందుకంత బాధ పడ్డారు అడిగింది వసంత. నేరుగా లాన్లో సిమెంట్ బెంచి మీద కూర్చుంటూ, వంశీకి పక్కన చోటిస్తూ.
అది మా అమ్మా నాన్నగార్ల తీపి గుర్తండీ. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. మా నాన్నగారు మా అమ్మకి ఆ నవల్లోలానే ఎన్నో భాషల్లో ఐ లవ్ యూ చెప్పేవారట. పెళ్ళయిన తర్వాత కూడా నలుగురి మధ్యలో ఉన్నపుడు కూడా ఒకరికొకరు ఆ అరబిక్, రష్యాలాంటి భాషల్లో ఐ లవ్ యూ చెప్పేసుకునే వారట. ఎవరికీ అర్థం కాదని.
"ఓ చాలా హృద్యంగా వుంది"
కానీ ఆ హృద్యమైన ప్రేమ గీతం మూగబోయింది నా పుట్టుకతో.
ఆ!!
అవునండి. నేను పుట్టినపుడు మా అమ్మకి తీవ్రమైన ధనుర్వాతం, దాంతో పాటు గుండె పోటు రావడంతో, మా నాన్న ఒక్కరే కావడం, ఆ సమయంలో సరైన ఆర్ధిక బలం లేకపోవడంతో, మా అమ్మని దక్కించుకోలేక పోయారు. నాలోనే మా అమ్మని చూసుకుంటూ , నాతోనే కబుర్లాడే వారు. నాకు పదిహేనేళ్ళ వయసులో తను కూడా నాకు దూరమయ్యారు అని గద్గదిక స్వరంతో చెప్తూ ఆగిపోయాడు వంశీ. 

వంశీ భుజం మీద అనునయంగా చెయ్యి వేసింది వసంత.

"వాళ్ళిద్దరూ చనిపోతేనే కాని మా వాళ్ళకి జాలి కలగలేదు. మా నాన్న కూడా వెళ్లిపోయిన తర్వాత, మా తాతగారు నన్ను చేరదీసి, మా బాబయ్య, పిన్ని గార్ల సంరక్షణలో పెట్టారు‌."

"నా సంగతి సరే.మీరెందుకు అలా.. మాయాబజార్ సినిమా..." అంటున్న వంశీతో.

"నాదీ అలాంటి విషాద గతమేనండీ. మా ఇంట్లో అందరికీ ఒక తెలుగు పుస్తకాలు, పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. మా అక్క పెళ్లి నిశ్చితార్థం రోజు ఫంక్షన్ అయిన తర్వాత, అప్పుడే విడుదలయిన కలర్ మాయాబజార్ చూద్దామని ధియేటర్ కి వెళ్లామందరమూ.

సినిమా అయిపోయి తిరిగి వస్తున్నపుడు, మా అక్కా, బావగారు మాతో పాటు కారులోకాక, మా తమ్ముడు తెచ్చిన మీ మోటార్ సైకిల్ మీద ఇంటికొస్తామన్నారు. మా అమ్మ వద్దన్నా, మా నాన్నగారు వాళ్ళ సరదాని కాదనలేక సరేనన్నారు. 

మా కారుముందే వాళ్ళ బైక్ వెళుతోంది. సడెన్ గా అట్నుంచి తాగీసి డ్రైవింగ్ చేస్తూ, సెల్ ఫోన్ మాట్లాడుతూ వచ్చిన ఒక మోటార్ సైక్లిస్ట్ మా అక్క వాళ్ళ బైక్ ను గుద్దేసాడు. 
అని దుఃఖాన్ని ఆపుకోలేని వసంత మాటలు ఆపేసింది. 

వసంత చేతిని తన చేతిలో తీసుకుని, ఊర్కోమన్నట్లుగా నిమురుతున్నాడు వంశీ.
"మా బావ అక్కడే చనిపోయాడు. అక్క రెండు రోజులు హాస్పిటల్లో బాధ పడి ఆ తర్వాత...." 

"అయ్యో వెరీసారీ వసంత గారు!" అన్నాడు వంశీ, తన కనుకొలకుల్లో నిల్చిన కన్నీటి చుక్కలు తుడుచుకుంటూ.

ఆ రోజు తర్వాత వంశీ, వసంత విడివిడిగా తిరిగింది తక్కువే. కలిసే తిరిగేవారు, తమతమ ఉద్యోగాలు చూసుకుంటూ. ఒక శుభ ముహూర్తాన, మనసులు కలిసిన వాళ్ళిద్దరూ మనువుతో ఒకటయ్యారు. 
🌹
********************

No comments:

Post a Comment