Tuesday, October 21, 2025

 శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
శివానందలహరి – శ్లోకం – 51
భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా-
హ్లాదో నాదయుతో మహా(ఽ)సితవపుః పఞ్చేషుణా చాదృతః |

సత్పక్షః సుమనో(ఽ)వనేషు స పునః సాక్షాన్మదీయే మనో-
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు: ||

శంకరులు, శ్రీశైలేశుడైన శివుడు ఒక గండుతుమ్మెద అని చెబుతూ, ఆ తుమ్మెదను తన మనస్సు అనే పద్మములో‌ విహరించమని పిలుస్తున్నారు. శివునికి తుమ్మెద లక్షణాలను శంకరులు ఎలా ఆపాదించారో చూడండి.
గండుతుమ్మెద భృంగి (ఆడుతుమ్మెద) ఇచ్ఛానుసారముగా నాట్యముచేయునది. గజముయొక్క మదజలము గ్రహించునది. మాధవమాసము వలన (వసంతములోని వైశాఖము) ఆనందము పొందునది. ఝంకారనాదము కలిగినది. అసితవపుః – మహా నల్లని శరీరం కలది. మన్మధుడిచే తనకుసహాయముగా (తుమ్మెదలు మన్మధుని వింటినారి) నిశ్చయించబడినది. పూదోటలయందు ఆసక్తి ఉన్నది.
శివుడు భృంగి ఇచ్ఛానుసారముగా తాండవము చేయువాడు. గజాసురుని పీచమణచినవాడు. నారాయణుని వలన (మోహినీరూపములో) ఆనందమునొందినవాడు. ప్రణవనాదయుతుడు. సితవపుః – మహా తెల్లని శరీరం కలవాడు. మన్మధుడిచే తనలక్ష్యముగా నిశ్చయించబడినవాడు. సజ్జనులను రక్షించుటయందు ఆసక్తి కలవాడు.
ఆ శ్రీశైలేశుడు, భ్రమరాంబా పతి, పరమేశ్వరుడు అయిన గండుతుమ్మెద నా మనస్సనే కమలములో‌ విహరించుగాక!

No comments:

Post a Comment