Tuesday, October 21, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

      ఎక్కడినుండో ఒక యువకుడు అరుణాచలం వచ్చాడు. తల జడలు కట్టుకొని, భిక్షాన్నముతో జీవిస్తూ, అరుణాచలేశ్వరుని దేవాలయంలో పడుకుంటూ  అప్పుడప్పుడు మహర్షి సన్నిధికి వచ్చేవాడు.

      అతని తల్లి వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చింది. వానిని ఇంటికి రమ్మని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఆమెకి ఇతను ఒకే ఒక్కడు. కావలసినంత ఆస్తి. ఇతను ఏదీ వద్దనే అదొక విధమైన విరాగి. 

     ఆ తల్లి, మహర్షి ముందు మొర పెట్టుకుంది. ఒకటి రెండుసార్లు తల్లి మాట వినమని చెప్పి చూచారు మహర్షి. వినలేదు సరికదా పండరీపురం పారిపోయాడు.

    కొంత కాలానికి పండరీపురం నుండి మళ్ళీ వచ్చాడు. అతనెప్పుడూ పలక్కుండా మహర్షి సన్నిధిలో ఒక మూల కూర్చుని అతని సాధన అతను చేసుకుని, ఏదో వారి తిప్పలు వారు పడుతూ ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండేవాడు. ఇప్పుడు జడలు తీసివేసాడేగాని కార్యక్రమం మాత్రం మార్చుకోలేదు. 

     మహర్షి వారిని గమనిస్తూనే ఉన్నారు. వారూ పలకలేదు. మహర్షి పలకలేదు. కొన్ని రోజులు గడచిన తరువాత ఒక ఆశ్రమ భక్తుడు  "భగవాన్! వాళ్ళమ్మ ఇతను వస్తే జాబు వ్రాయమని అడ్రెస్ ఇచ్చి వెళ్ళింది కదా!” అని మహర్షితో అన్నారు.

      అందుకు మహర్షి ఇలా సెలవిచ్చెను ....
      
      “అవును; ఇచ్చింది. వారు వచ్చి పదిహేను రోజులు అయినట్లుంది. చూస్తూనే ఉన్నాను. వారు మాట్లాడితే కదా మనం మాట్లాడేది; పండరీపురం ఎలా ఉందనీ, ప్రసాదం ఏదనీ, నేను ఏక్కడకి పోయి అడిగేది? వారు ఏమీ మాట్లాడరు! వారి వారి మనసును అనుసరించి కదా మనం పోవలసి ఉన్నది. ఎవరెవరి మనసు ఎలా ఉంటే వారి వారి మనసును అనుసరించి పోవలసిన విధి మనకున్నది కదా! అంతకు మించి మనం ఏమి చేయగలం?

No comments:

Post a Comment