7️⃣1️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
*23. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రిత:l*
*మమ వర్త్మానువర్తంతే మనుష్యా: పార్థ సర్వశ:ll*
ఓ పార్థా! నేను కనుక నా కర్తవ్య కర్మలు అత్యంత శ్రద్ధతో ఎటువంటి సోమరితనం లేకుండా నెరవేర్చకపోతే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తారు. కృష్ణుడే చేయలేదు మేమెందుకు చేయాలి అంటూ ఎవరూ ఏ పనీ చేయరు. అంతా గందరగోళంగా తయారవుతుంది. అందరూ అధర్మపరులవుతారు. మానవులు అందరూ నన్నే అనుసరిస్తారు కాబట్టి నేను నా కర్తవ్యకర్మలను చేయక తప్పదు.
ఇక్కడ కృష్ణుడు రెండు పదాలు వాడాడు. అతన్ద్రిత:, అంటే సోమరి తనం లేకుండా ఉండటం, తంద్రత అంటే సోమరి తనము, తోందరపాటు అని మనం అంటూ ఉంటాము. ఆ తోందరపాటు లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, సోమరి తనం లేకుండా నేను కర్మలు చేస్తున్నాను. అత్యంత జాగరూకతతో చేస్తున్నాను. నాకు ఏ కర్మా చేయవలసిన అవసరం లేకపోయినా అత్యంత శ్రద్ధాభక్తులతో జాగరూకతతో కర్మలు చేస్తున్నాను. ఎందుకంటే నన్ను అనుసరించి నేను చేసినట్టు కర్మలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్ల కోసం నేను నా విద్యుక్తధర్మములను నిర్వర్తిస్తున్నాను. నాకెందుకులే అని నేను ఊరుకుంటే, జనులు నన్నే అనుసరిస్తారు. నేను ఏమీ చేయలేదు కాబట్టి వారు కూడా ఏమీ చేయరు. సోమరులు అవుతారు. నేనే కాదు జీవన్ముక్తులు, జితేంద్రియులు, స్థిరప్రజ్ఞులు అనే వారు కూడా వారి వారి కర్తవ్యకర్మలు నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు పంచ మహా యజ్జాలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అంతేకానీ నేను ముక్తి పొందాను ఇతరుల సంగతి లోకం సంగతి నాకు అనవసరం అని అనుకోకూడదు అని పరమాత్మ అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు.
ఇందాక చెప్పిన పదం అతన్ద్రిత: అనే పదం మనకే ఒక హెచ్చరిక. ఏ పని చేసినా తందరపాటు లేకుండా జాగరూకతతో శ్రద్ధగా చేయాలి. అజాగ్రత్త పనికిరాదు. సోమరి తనము పనికిరాదు.
ఈసందర్భంలో జగద్గురు శంకరాచార్యుల వారు వివేకచూడామణిలో ఇలా అన్నారు. ప్రమాదో బ్రహ్మనిష్ఠాయాం న కర్తవ్య: కదాచనl
ప్రమాదో మృత్యురిత్సాహ భగవాన్ బ్రహ్మణస్సుత:ll ఇక్కడ ప్రమాదము అంటే ప్రమత్తత, సోమరి తనము, నిర్లక్ష్యము అని అర్థము. బ్రహ్మనిష్టయందు సోమరి తనము, అజాగ్రత్త, నిర్లక్ష్యము పనికిరాదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సోమరితనము, నిర్లక్ష్యము మృత్యువుతో సమానము అని బ్రహ్మమానసపుత్రులు అయిన సనత్కుమారుడు చెప్పాడు. (సేకరణ: గీతా మకరందము).
ఇక్కడ ప్రమాదో అంటే నిర్లక్ష్యము, అజాగ్రత్త, మృత్యువుతో సమానము. ఈనాడు నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలకు నిరక్ష్యము, అజాగ్రత్త ప్రధాన కారణాలు అని మనకు తెలుసు. (సెక్షన్ 304-ఎ ఐపిసి లో ముఖ్యమైన అంశము రాష్ అండ్ నెగ్లిజంట్ డ్రైవింగ్ ఆర్ ఆక్ట్) ఇక్కడ కృష్ణపరమాత్మ కూడా ఒక రథసారధి (డ్రైవర్) నేను, చావడానికి కూడా సిద్ధపడి, నీకు రథసారథిగా ఉండటానికి ఒప్పుకొని, నా ధర్మం ప్రకారం ఇంత జాగ్రత్తగా రథం నడుపుతుంటే, నీ ధర్మము, క్షత్రియ ధర్మము అయిన యుద్ధం చేయడానికి నీకేం (మాయరోగం) అనే మాట అనలేదు కానీ ఆ అర్థం వచ్చేట్టు అన్నాడు.
అన్నీ తెలిసిన పరమాత్మే తన కర్తవ్య నిర్వహణ పట్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇంక మనం ఎంత అని అనుకొని మనం కూడా అన్ని కర్మలను ఎటువంటి తొందరపాటు లేకుండా, జాగ్రత్తగా చేయాలి.
ఇలాచేయకపోతే ఏమవుతుంది అనే దానికి తరువాతి శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P179
No comments:
Post a Comment