7️⃣0️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*మూడవ అధ్యాయము*
*కర్మయోగము.*
కాబట్టి మానవులు ధర్మం గురించి తెలుసుకోవాలంటే వారి పురోహితులను, పెద్దలను, జ్ఞానులను ఆశ్రయించాలి. వారి ఆచార వ్యవహారములను అనుసరించాలి. ఇదే మూడవ ప్రమాణము. ఈ మూడు ప్రమాణములలో ఆఖరిది అయిన శిష్టాచారమే సామాన్య మానవులకు, చాలా ప్రముఖమైనది, ఆచరించతగ్గది. ఎందుకంటే శ్రుతులు, స్మృతులు కేవలం బోధిస్తాయి. కాని శిష్టాచారము పెద్దలు ఏం చేస్తున్నారో చూచే అవకాశం కల్పిస్తుంది. అదే చూచి నేర్చుకోవడం. పెద్దవారు, బుద్ధిమంతులు తాము ఆచరించి ఇతరులకు చూపిస్తారు. పెద్దలు చేసిన మంచి పనులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. వారు అనుసరించిన ధర్మమార్గమునే అనుసరిస్తారు. వారిని చూచి వారి పిల్లలు కూడా అదే ధర్మమార్తమును అనుసరిస్తారు. అది వాళ్ల ఆచారంగా, ఒక ప్రమాణంగా తరతరాలకు సంక్రమిస్తుంది.
ఈ శిష్టాచారము ఎవరి వద్ద నుండి నేర్చుకోవాలి అంటే మనకు నలుగురు గురువులు అంటే శ్రేష్ఠులు ఉన్నారు. వారిలో మొదటిది తల్లి. తల్లి మనకు మొదటి పాఠం చెబుతుంది. చెయ్యాల్సినవి చేయకూడనివి నేర్పుతుంది. అది ఆమె బాధ్యత. రెండవ శిష్ఠుడు తండ్రి. తండ్రి తాను మంచి పనులను ఆచరించి తన పిల్లలు కూడా ఆచరించేటట్టు చేయాలి. మూడవ శిష్ఠుడు గురువు. గురువు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు. ఆ ధర్మాలను తాను ముందు ఆచరించి, తనను చూసి పిల్లలు నేర్చుకునేటట్టు చేయాలి. తరువాతి శిష్ఠుడు రాజు, రాజు ధర్మాత్ముడు అయితే ప్రజలు కూడా ధర్మం ఆచరిస్తారు. రాజు లంచగొండి అయితే ప్రజలు అదే మార్గాన్ని అనుసరిస్తారు. అందుకే యథా రాజా తథా ప్రజా అనే సూక్తి వచ్చింది. ఎవరికైతే తల్లి తండ్రి గురువు రాజు ధర్మాచరణలో తమ పిల్లలకు, శిష్యులకు, ప్రజలకు రోల్ మోడలుగా ఉంటారో అతడు తప్పకుండా ధర్మాత్ముడు అవుతాడు. ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది.
(ఈ సూత్రం ఈ నాటికి అన్వయించుకుంటే, మన మంత్రులు పాలకులు నీతిగా ఉంటే వారి కింది అధికారులు ప్రజలు నీతిగా ఉంటారు. మంత్రులే అవినీతికి పాల్పడితే, కింది అధికారులు కూడా అవినీతికి పాల్పడతారు. కాబట్టి పెద్దలైన వారు, అవినీతి అంతం చేస్తాము అని ప్రగల్భాలు పలకడం మాని, ముందు వారు ఆచరించి, ఇతరులకు మార్గదర్శకం కావాలి.)
ఈ శ్లోకంలో ఆఖరు ప్రమాణం అయిన శిష్టాచారం గురించి చెప్పాడు పరమాత్మ. ఓ అర్జునా! శ్రేష్ఠులు అయిన వారు ఏమేమి ధర్మములను ఆచరిస్తారో, సామాన్యులు కూడా ఆయా ధర్మాలను అనుసరిస్తారు. ఎందుకంటే సామాన్యమానవులు సాధారణంగా ఆలోచించరు. తమ తల్లి తండ్రులు, గురువులు, పెద్దలు, రాజు ఏమి చేస్తే దానిని అనుసరిస్తారు. నువ్వు రాజువు, పరాక్రమవంతుడివి. వీరుడివి. ఈ యుద్ధంలో నిన్ను నీ పరాక్రమాన్ని, వీరత్వాన్ని నమ్ముకొని అందరు రాజులూ యుద్ధానికి సన్నద్ధం అయ్యారు. అటువంటి నీవే నేను యుద్ధం చేయను అంటే ఇతర రాజులు కూడా నిన్నే అనుసరిస్తారు. ఎందుకంటే సాధారణంగా మానవులను మంచి కంటే చెడు లక్షణాలు తొందరగా ఆకర్షిస్తాయి. నీలో ఎన్ని మంచిలక్షణాలు ఉన్నా ఈ తాత్కాలిక పిరికితనము, పారిపోయే గుణము, తప్పించుకు తిరిగే గుణము అనే చెడు మాత్రమే తొందరగా అందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి ఓ అర్జునా! నీవు అందరికీ ఆదర్శంగా నిలబడి, ముందు నిలబడి యుద్ధం చేస్తే, ఇతర రాజులు నిన్ను అనుసరిస్తారు. నీవే పిరికివాడుగా పారిపోతే ఇతర రాజులు కూడా నిన్ను అనుసరిస్తారు అని ధర్మబోధ చేసాడు కృష్ణుడు.
*22. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించనl*
*నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణిll*
అర్జునా! మూడు లోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు. అలాగే నేను కోరుకోదగ్గది, పొంద తగినది, నేను పొందలేనిది ఏదీ లేదు. ఐనప్పటికినీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను.
ఇప్పటి దాకా కృష్ణుడు అందరి గురించీ చెప్పాడు. అర్జునుడిలో ఏమీ చలనం లేదు. ఇంక లాభం లేదని, ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. "అర్జునా! నాకు ఈ మూడు లోకాలలో చేయతగిన పని కానీ, చేయవలసిన పని కానీ లేదు. నాకు కావాల్సింది ఏదీ లేదు. కొరతగినది ఏదీ లేదు. అలాగే నేను కోరుకుంటే పొందలేనిది అంటూ ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. నీకు సారధిగా కూడా పని చేయడానికి ఒప్పుకున్నాను. కారణం నాకు అన్నీ తెలుసు. నేను గొప్పవాడిని అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ చిన్న పని చేయడానికి వెనుకాడలేదు." అని తన గురించి తాను చెప్పుకున్నాడు.
ఒకవిధంగా కృష్ణుడు, నేను ఆత్మసాక్షాత్కారం పొందిన వాడిని, స్థితప్రజ్ఞుడిని అని నర్మగర్భంగా చెబుతున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారము, నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలమైన మనస్సు కలవాడు. త్రిగుణములకు అతీతుడు, ఆ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు. తీరవలసిన కోరికలు అంటూ ఏమీ లేవు. ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ ఏదీ లేదు. రెండవ ఉద్దేశం కృష్ణుడు జ్ఞాని. అన్నీ తెలిసిన వాడు, అన్నిటికీ అతీతుడు. మాయ గురించి తెలిసిన వాడు, స్థితప్రజ్ఞుడు. అలా చూచినా కూడా కృష్ణుడికి చేయవలసిన కర్మ తీర వలసిన కోరిక అంటూ కూడా ఏమీ లేదు.
అందుకే అంటున్నాడు... అయినా నేను లోకం కొరకు కర్మలు చేస్తూనే ఉన్నాను. ఎందుకు? ప్రజలు నన్ను చూచి, వారూ అలాగే ఆచరించాలి. ధర్మమార్గంలో నడవాలి. అంతే కానీ నా కోసం కాదు. నాకు రూపం లేదు. అయినా ఒక రూపం ధరించాను. ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను. చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక సామాన్యుడు ఏమేమి చేయాలో అన్నీ చేసాను. వీలున్నంత వరకు ప్రజలకు ధర్మమార్గంలో నడవమని బోధించాను.
ఇంతెందుకు ఇప్పుడు నీకు సారధిగా ఉన్నాను. ఎంతో ఉత్సాహంగా నీకు సారధ్యం చేస్తున్నాను. నీ అజ్ఞలు పాలిస్తున్నాను. నీవు రథం ఎటు పోనిమ్మంటే అటు పోనిస్తున్నాను. ఒక విధంగా నీకు సేవ చేస్తున్నాను. ఈ విధంగా నీకు సారధ్యం చేసి నందు వలన నాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. పైగా నష్టం ఎక్కువ. ఎందుకంటే, నీ మీదికి సంధించిన ప్రతి బాణము నాకు తగిలే అవకాశం ఉంది. కొంత మంది ముందు సారధిని చంపుతారు. కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చు. నాకే ప్రమాదము ఎక్కువ. అయినా ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను. కారణం ఇది నా కర్తవ్యం. నేనుచేయాలి. ప్రతివాడూ చిన్న పని, పెద్ద పని అనే తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని నెలకొల్పడానికి నీకు సారధిగా ఉన్నాను.
నాకు పెద్దపని చిన్న పని అంటూ లేదు. గొప్ప బీద తేడా లేదు. నా చిన్ననాటి మిత్రుడు సుదాముడు పరమ బీదవాడు, కుచేలుడు, ఆయన వచ్చినపుడు నేను ఆయన కాళ్లు కడిగాను. ఎందుకు? ఆయన సద్భ్రాహ్మణుడు, వేదములు చదువుకున్న వాడు, జ్ఞాని, నిష్కామ కర్మలు ఆచరించిన వాడు. అటువంటి బ్రాహ్మణులు నాకు దైవంతో సమానము. పైగా ఆయన నాకు అతిథి. అందుకే ఆయనకు నేను, నా భార్యలు అతిథి సత్కారాలు, సేవలు చేసాము. నేను గొప్పవాడిని, నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని గర్వంతో విర్రవీగలేదు. ఈ ప్రకారంగా అన్ని తెలిసిన నేను నా కర్తవ్య కర్మ నేను చేస్తుంటే నీవు చేయడానికేమి? నీవే కాదు జీవన్ముక్తులు అనే వారు కూడా కర్మలు చేయాలి. వారు చేసి లోకానికి ఆచరించమని బోధించాలి. ప్రజల చేత ఆచరించేటట్టు చేయాలి. అదీ నిష్కామంగా చేయాలి ఎటువంటి ఫలితములను ఆశించి చేయరాదు. సన్యాసులు జీవన్ముక్తులు కూడా సమాజ శ్రేయస్సు కోరి ధర్మకార్యాలు ఆచరించాలి. అందరూ ఆచరించేటట్టు చేయాలి. స్వార్ధరహితంగా చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. అని చెప్పి దానికి కారణం కూడా చెబుతున్నాడు పరమాత్మ.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P177
No comments:
Post a Comment